ENG vs SL: ఛాంపియన్‌కు షాకిచ్చిన శ్రీలంక.. ఇంగ్లాండ్‌ ఇంటికేనా?

డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ (England)కు మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే పసికూన అఫ్గాన్‌ చేతిలో ఓడిన ఇంగ్లిష్‌ జట్టు.. ఇప్పుడు కీలకమైన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఘోర పరాజయం చవిచూసింది.

Updated : 26 Oct 2023 19:30 IST

బెంగళూరు: డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ (England)కు మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే పసికూన అఫ్గాన్‌ చేతిలో ఓడిన ఇంగ్లిష్‌ జట్టు.. ఇప్పుడు కీలకమైన మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్.. లంక బౌలర్ల ధాటికి 156 పరుగులకే కుప్పకూలింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని లంక.. 25.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కుశాల్ పెరీరా (4), కుశాల్ మెండిస్ (11) విఫలమైనా.. పాథుమ్‌ నిశాంక (77*; 83 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), సదీర విక్రమార్క (65*; 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకాలు బాదడంతో లంక సునాయసంగా విజయం సాధించింది. ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయి లంక ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో నిశాంక, విక్రమార్క క్రీజులో నిలదొక్కుకుని నిలకడగా బౌండరీలు బాది జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ రెండు వికెట్లు పడగొట్టాడు.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 33.2 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌కు స్వర్గధామమైన చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంక పేసర్ల ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఒక్కరూ కూడా అర్ధ శతకం చేయలేకపోయారు. బెన్‌స్టోక్స్‌ (43; 73 బంతుల్లో 6 ఫోర్లు) టాప్ స్కోరర్‌. జానీ బెయిర్‌స్టో (30; 31 బంతుల్లో 3 ఫోర్లు), డేవిడ్ మలన్ (28; 25 బంతుల్లో 6 ఫోర్లు) కాసేపు నిలకడగానే ఆడినా ఎక్కువ సమయం క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. జోరూట్ (3,) జోస్ బట్లర్ (8), లియామ్ లివింగ్‌స్టోన్ (1) ఘోరంగా విఫలమయ్యారు. తర్వాత వచ్చిన మొయిన్ అలీ (15; 15 బంతుల్లో) కూడా ఆకట్టుకోలేకపోయాడు. క్రిస్‌ వోక్స్‌ (0), ఆదిల్ రషీద్‌ (2), మార్క్‌ వుడ్ (5), డేవిడ్ విల్లీ (14*) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార 3, ఏంజెలో మాథ్యూస్‌ 2, కాసున్ రజిత 2, మహీశ్‌ తీక్షణ ఒక వికెట్ పడగొట్టారు.

ఇంగ్లాండ్‌ ఇంటికేనా? 

శ్రీలంకపై ఓటమితో ఇంగ్లాండ్ సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి ఒకే మ్యాచ్‌లో నెగ్గింది. అది కూడా బంగ్లాదేశ్‌పై. కివీస్‌, అఫ్గానిస్థాన్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక చేతుల్లో ఓడింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తేనే ఇంగ్లిష్ జట్టు సెమీస్‌కు వచ్చే అవకాశాలున్నాయి. అయితే, ఆ నాలుగు మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్‌ విజయం సాధించడం అంత సులువు కాదు. భారత్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌, పాకిస్థాన్‌లతో ఆ జట్టు తలపడాల్సి ఉండటమే ఇందుకు కారణం. ఇంగ్లాండ్ తన తర్వాతి మ్యాచ్‌లో టీమ్‌ఇండియాతో తలపడనుంది. వరుస విజయాలతో జోరు మీదున్న రోహిత్‌ సేనపై పైచేయి సాధించాలంటే ఇంగ్లాండ్‌ శక్తికి మించి కృషి చేయాల్సిందే. మరోవైపు, మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆసీస్‌.. తర్వాత మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి సెమీస్‌ రేసులో ముందుకొచ్చింది. నెదర్లాండ్స్‌ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సౌతాఫ్రికాను డచ్ జట్టు ఎలా చిత్తుగా ఓడించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాకిస్థాన్‌ కూడా తనదైన రోజు ఎంత పెద్ద జట్టునైనా ఓడించగలదు. ఈ సవాళ్లను అధిగమించి ఇంగ్లాండ్‌ సెమీస్‌కు వస్తే అది అద్భుతమే అవుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని