ODI WC 2023: వరల్డ్‌ కప్‌ వారిదే.. ఫేవరెట్‌ టీమ్‌ చెప్పేసిన సునీల్ గావస్కర్

స్వదేశంలో వన్డే వరల్డ్‌ కప్‌ (ODI WC 2023) జరగనుండటంతో భారత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐసీసీ ట్రోఫీని గెలిచి పదేళ్ల నిరీక్షణకు తెరదించాలని టీమ్‌ఇండియా భావిస్తోంది. అయితే, క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) మాత్రం టైటిల్‌ విజేతగా భారత్‌ కష్టమేనన్న వ్యాఖ్యలు చేశాడు.

Published : 30 Sep 2023 12:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అక్టోబర్ 5న గతేడాది ఫైనలిస్టులు ఇంగ్లాండ్ - న్యూజిలాండ్‌ జట్ల మధ్య (ENG vs NZ) మ్యాచ్‌తో వన్డే ప్రపంచకప్‌ (ODI WC 2023) సమరం ప్రారంభం కానుంది. ఇప్పటికే వార్మప్‌ మ్యాచ్‌లు మొదలైన సంగతి తెలిసిందే. నేడు గువహటి వేదికగా భారత్ - ఇంగ్లాండ్‌ (IND vs ENG) తలపడనున్నాయి. స్వదేశంలో మెగా టోర్నీ జరగనుండటంతో భారతే టైటిల్‌ విజేత అవుతుందనే అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) మాత్రం విభిన్నంగా స్పందించాడు. తన ఫేవరెట్‌ మాత్రం ఇంగ్లాండ్‌ అని పేర్కొన్నాడు. అందుకు గల కారణాలనూ విశ్లేషించాడు.

‘‘డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ ఈసారి కూడా విజేతగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ జట్టులో ముగ్గురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. వారంతా ప్రపంచస్థాయి ఆల్‌రౌండర్లు. టాప్‌ ఆర్డర్‌ నుంచి లోయర్‌ ఆర్డర్‌ వరకు బ్యాటింగ్‌ చేయగల సత్తా ఉంది. ఎలాంటి సమయంలోనైనా మ్యాచ్‌ గతిని మార్చేయగలరు. అందుకే, నా ఫేవరెట్ మాత్రం ఇంగ్లాండ్‌ అని చెబుతా’’ అని గావస్కర్ తెలిపాడు. అయితే, సునీల్‌ వ్యాఖ్యలకు భిన్నంగా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) స్పందించాడు. స్వదేశంలో జరిగే వరల్డ్ కప్‌ కాబట్టి భారత్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నాడు.

‘‘భారత్ ఎలా ఆడబోతుందో చూడాలని ఆసక్తిగా ఉంది. వరల్డ్‌ కప్ ఫేవరెట్లలో టీమ్‌ఇండియా కూడా ఉంది. ఆసియా కప్‌తోపాటు ద్వైపాక్షిక సిరీసుల్లో అద్భుతమైన ప్రదర్శన చేశారు. స్వదేశంలో ఆసీస్‌పై సిరీస్‌ను గెలిచిన విషయం తెలిసిందే. అన్ని విభాగాల్లోనూ టీమ్‌ఇండియా బలంగా ఉంది. షమీ వంటి అత్యుత్తమ పేస్ బౌలర్ భారత పిచ్‌లపై రాణిస్తాడు. ఆసీస్‌తో బెంచ్‌కే పరిమితమైనప్పటికీ మిగతా బౌలర్లు రాణించి విజయం సాధించారు. దీనిని బట్టి భారత రిజర్వ్‌ బెంచ్‌ కూడా ఎంత పటిష్ఠంగా ఉందో ప్రత్యర్థులకు అర్థమైంది’’ అని పఠాన్‌ తెలిపాడు. భారత్ అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు