IPL: వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌కు టాటాగ్రూప్‌ స్పాన్సర్‌షిప్‌..!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు వచ్చే ఏడాది నుంచి స్పాన్సర్లు మారనున్నారు. దేశీయ దిగ్గజ కార్పొరేట్‌ సంస్థ టాటా గ్రూప్‌ 2023 ఐపీఎల్‌ నుంచి స్పాన్సర్‌గా వ్యవహరించనుంది.

Updated : 11 Jan 2022 17:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు వచ్చే ఏడాది నుంచి స్పాన్సర్లు మారనున్నారు. దేశీయ దిగ్గజ కార్పొరేట్‌ సంస్థ టాటా గ్రూప్‌ 2023 నుంచి ఐపీఎల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని క్రికెట్‌ లీగ్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ పీటీఐ వార్త సంస్థకు వెల్లడించారు. ఈ విషయాన్ని ఐపీఎల్‌ ఈవెంట్స్‌ గవర్నెంగ్‌ కౌన్సిల్‌ మంగళవారం నిర్ణయించింది. ‘‘అవును.. ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా టాటా గ్రూప్‌ వస్తోంది’’ అని బ్రిజేష్‌ పేర్కొన్నారు.

2018-22 వరకు ఐపీఎల్‌ స్పాన్సరింగ్‌ హక్కులను వివో సంస్థ  రూ.2,200కోట్లకు దక్కించుకొంది. కానీ, 2020లో గల్వాన్‌ వద్ద  భారత్‌-చైనా సేనలు ఘర్షణ పడటంతో ఆ ఏడాది వివో స్పాన్సర్‌ షిప్‌ నుంచి వైదొలగింది. ఈ నేపథ్యంలో డీమ్‌11 సంస్థ స్పాన్సరింగ్‌ బాధ్యతలు స్వీకరించింది. 2021 ఐపీఎల్‌ టైటిల్‌ బాధ్యతలను వివోనే తిరిగి స్వీకరించింది. ఆ తర్వాత నుంచి స్పాన్సర్లు మారనున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా టాటా గ్రూప్‌ బిడ్డింగ్‌కు ఓకే చెప్పినట్లైంది. దీంతో 2023లో ట్రోఫీ ‘టాటా ఐపీఎల్‌’గా అభిమానుల ముందుకు రానుంది.

భారత్‌లోనే నిర్వహించడమే తొలి ప్రాధాన్యం

ఐపీఎల్‌లోకి వస్తున్న కొత్త జట్లు అహ్మదాబాద్, లక్‌నవూకు బీసీసీఐ క్లియరెన్స్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా ఐపీఎల్‌ 2022 నిర్వహణపై అడిగిన ప్రశ్నకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘‘ భారత్‌లోనే నిర్వహించేందుకు మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. మా తొలి ప్రాధాన్యం కూడానూ అదే. అయితే మార్చిలో కొవిడ్‌ పరిస్థితులు ఎలా ఉంటాయనేది నిరంతరం గమనించాల్సి ఉంటుంది. అందుకే కరోనా వ్యాప్తిని అనుసరించి ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని