Year Ender 2022: భారత్ 2022.. ఐపీఎల్‌లో కాసుల జోరు.. మెగా టోర్నీల్లో బేజారు.. ఆఖర్లో ‘పంత్’ కంగారు!
క్రికెట్‌నే శ్వాసగా.. ఆశగా బతికే కోట్లాది మంది అభిమానులు కలిగిన దేశం భారత్. ఇక టీమ్‌ఇండియాలో స్టార్లకు కొదవేంలేదు. అయినా జట్టు ఎంపిక సరిగా లేకపోవడమో.. ఆట పట్ల నిబద్ధత లోపించిందో తెలియదు కానీ ఆటపరంగా ఆధిపత్యం మాత్రం కొనసాగించలేకపోతోంది.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్.. అత్యధిక భారతీయులకు ఇష్టమైన క్రీడ. గెలిస్తే అంబరాన్ని తాకేలా సంబరాలు చేస్తారు.. ఓడితే మాత్రం ఇవాళ మనది కాదులే అని సరిపెట్టుకొంటారు. అంతేకానీ క్రికెట్ మీద ఇష్టాన్ని వదలరు. క్రికెటర్లపై ప్రేమను వదులుకోలేరు. అయితే భారత క్రికెట్‌కు 2022వ సంవత్సరం పెద్దగా అచ్చి రాలేదేమో. ఫామ్ లేక ఆటగాళ్లు ఇబ్బంది పడటం నుంచి మెగా టోర్నీల్లో చేతులెత్తేయడం.. కీలకమైన బీసీసీఐ ఎన్నికల వరకు కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. అలాగే ఏడాది ముగింపులో పంత్ రోడ్డు ప్రమాదానికి గురి కావడం ఆందోళనకు గురిచేసినా.. ప్రాణాపాయం లేకపోవడంతో అభిమానులు సంతోషించారు.
రోహిత్ ‘సర్వాధికారి’
టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ నుంచి పొట్టి ఫార్మాట్ నాయకత్వ బాధ్యతలను స్వీకరించిన రోహిత్ శర్మ.. ఈ ఏడాదిలోనే అన్ని ఫార్మాట్లకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమితులయ్యాడు. వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లను గెలిపించి రికార్డు సృష్టించిన రోహిత్.. మరోసారి మాజీ కెప్టెన్ కోహ్లీ బాటలోనే మెగా ఈవెంట్లలో జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. అయితే ఒకే ఏడాదిలో టీ20ల్లో అత్యధిక విజయాలను అందించిన కెప్టెన్‌గా రోహిత్ అవతరించాడు. అంతకుముందు ఈ రికార్డు ఎంఎస్ ధోనీ పేరిట ఉండేది.
ఫామ్‌తో ఇబ్బంది పడి..
జట్టును నడిపించడంలో పాస్ అయినా.. బ్యాటర్‌గా వ్యక్తిగత ప్రదర్శన మాత్రం రోహిత్ పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. అలాగే వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా తక్కువేం కాదు. ఇప్పటికీ రాహుల్ ఫామ్ అందుకోలేకపోయాడు. ఫామ్ లేక ఇబ్బంది పడిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా దాదాపు మూడేళ్ల తర్వాత సెంచరీ సాధించాడు. అదీనూ ఇప్పటి వరకు సాధించిన టీ20 ఫార్మాట్‌లో కావడం విశేషం. నెలరోజులపాటు విశ్రాంతి తీసుకొని మరీ పునరుత్తేజంతో చెలరేగిపోయాడు. అలాగే పుజారా కూడా తాజాగా టెస్టుల్లో శతకం చేసి సుదీర్ఘ నిరీక్షణకు తెర దించాడు.
తొలిసారే టైటిల్ నెగ్గి..
ఐపీఎల్ 2022 సీజన్ అందరికీ గుర్తుండి పోతుంది. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య అరంగేట్రం చేసిన తొలి సీజన్‌లోనే గుజరాత్‌కు కప్ అందించాడు. పది జట్లతో హోరాహోరీగా సాగిన మ్యాచుల్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై, ఐదు సార్లు ఛాంపియన్ ముంబయి జట్లను కాదని గుజరాత్ టైటాన్స్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. కొత్తగా వచ్చిన కేఎల్ రాహుల్ నాయకత్వంలోని మరో జట్టు లక్‌నవూ సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ వరకు వచ్చింది.
సొమ్ములతో కళకళ..
ఐపీఎల్ అంటేనే అత్యంత ఖరీదైన లీగ్. అలాంటిది ఒక్కసారి వేలంలో కోట్లు పలికితే ఆ క్రికెటర్ జీవితం మారిపోతుంది. అలా ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో టీమ్‌ఇండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ (రూ. 15.25 కోట్లు) భారీ ధరను సొంతం చేసుకొని రికార్డు సృష్టించాడు. ఈ సంవత్సరానికి చివర్లో డిసెంబర్ 23న జరిగిన మినీ వేలం అభిమానుల కళ్లు బైర్లగమ్మేలా అత్యధిక ధరను పెట్టి ఆటగాళ్లను ఫ్రాంచైజీలు దక్కించుకొన్నాయి. మరీ ముఖ్యంగా ఆల్‌రౌండర్లకు మంచి గిరాకీ తగలింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు శామ్ కరన్ (రూ. 18.50 కోట్లు), బెన్ స్టోక్స్ (రూ. 16.25 కోట్లు), ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (రూ. 17.50 కోట్లు)లు జాక్‌పాట్ కొట్టారు.
గంగూలీకి గుడ్‌బై..
అంతర్జాతీయంగా అత్యంత శక్తిమంతమైన క్రికెట్ బోర్డుల్లో బీసీసీఐ ప్రథమ స్థానంలో ఉంటుంది. మరి అలాంటి బోర్డుకు అధ్యక్షుడిగా ఎన్నికైన ‘దాదా’ సౌరభ్ గంగూలీ ఒంటరైపోయిన పరిస్థితి. గత సెప్టెంబర్‌తో గంగూలీ పదవీ కాలం ముగిసింది. ఆ వెంటనే ఐసీసీ ఛైర్మన్ పగ్గాలు చేపట్టాలని భావించాడు. అయితే బీసీసీఐ సహా ఎక్కువ బోర్డుల నుంచి మద్దతు లేకపోవడంతో వైదొలగాడు. మరోసారి బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టే అవకాశం ఉన్నా ఉన్నతస్థాయిలో చోటు చేసుకున్న పరిణామాలు గంగూలీకి ఆ పదవి దూరమైంది. బీసీసీఐ కార్యదర్శిగా మరోసారి ఎన్నికైన జయ్‌షా ఆసియా క్రికెట్ కౌన్సిల్, ఐసీసీ ఆర్థిక కమిటీలో భారత్ ప్రతినిధిగా ఉన్నారు. మాజీ ఆటగాడు రోజర్ బిన్నీ బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై పదవీ బాధ్యతలు చేపట్టాడు. ప్రపంచకప్ విన్నింగ్ జట్టులో సభ్యుడైన రోజర్‌కు కర్ణాటక క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది.
కోహ్లీ - దాదా మాటల యుద్ధం..
వన్డే, టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించే ముందు ఎవరూ తనతో ఎవరూ సంప్రదించలేదని విరాట్ కోహ్లీ పేల్చిన బాంబు ఈ ఏడాది సంచలనంగా మారింది. టీ20 పగ్గాలను స్వచ్ఛందంగా వదులుకొన్న కోహ్లీని వద్దని వారించినట్లు, మిగతా రెండు ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు ముందే చెప్పామని గంగూలీ చెప్పడంతో చర్చకు తెరలేచింది. ఆ నిర్ణయం తీసుకొనే గంట ముందే బీసీసీఐ సెలెక్షన్ కమిటీ తనకు చెప్పిందని కోహ్లీ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా వేడి రాజుకొంది. దీంతో గంగూలీపై సోషల్ మీడియాలో కోహ్లీ అభిమానులు విమర్శల వర్షం కురిపించారు. కర్మ ఫలితంతోనే గంగూలీ కూడా తన పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చిందని ఆక్షేపించారు.
ఫేవరేట్‌గా బరిలోకి దిగి..
ధోనీ మాదిరిగా రోహిత్ టీ20 ప్రపంచకప్‌ను అందిస్తాడని అంతా ఆశపడ్డారు. అంతేకాకుండా ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన అనుభవం. గ్రూప్ దశలో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ కష్టపడి చెమటోడ్చి మరీ నెగ్గడం గమనార్హం. ఎలాగోలా సెమీస్‌కు చేరితే.. అక్కడ ఇంగ్లాండ్ చేతిలో ఘోర అవమానం ఎదురైనట్లు పది వికెట్ల తేడాతో పరాభవం ఎదురైంది. అంతకుముందు జరిగిన ఆసియా కప్‌లోనూ ఘోరంగా సూపర్-4 దశలోనే ఇంటిముఖం పట్టింది. రానున్న రోజుల్లో వ్యక్తిగతంగా ఉత్తమ ప్రదర్శన చేయకపోతే మాత్రం రోహిత్ తన కెప్టెన్సీతోపాటు జట్టులో స్థానం కూడా గల్లంతు కావడం తథ్యమని విశ్లేషకుల అభిప్రాయం.
సెలక్షన్ కమిటీపై వేటు..
చేతన్ శర్మ నేతృత్వంలోని భారత సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు వేసింది. టీ20 ప్రపంచకప్ కోసం సరైన ఆటగాళ్లను ఎంపిక చేయలేదని సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురి కావడం.. సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర ఓటమిపాలు కావడంతో సెలక్టర్లను తప్పించేసింది. కొత్త కమిటీ కోసం దరఖాస్తులను ఆహ్వానించి నెల రోజులు దాటినా ఇంకా ముఖాముఖిలు నిర్వహించాల్సి ఉంది. దీంతో కొత్త సంవత్సరంలోనే నూతన కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. అయితే చీఫ్ సెలక్టర్‌గా ఉన్న చేతన్ శర్మను సెలక్టర్‌గా నియమించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఆరుగురు కెప్టెన్లు.. గాయాల దెబ్బ..
భారత్ క్రికెట్‌లో ఈ ఏడాది తయారైన కెప్టెన్ల జాబితా మరెప్పుడూ కాలేదేమో. ఆటగాళ్లకు గాయాలు కావడం, పని ఒత్తిడి నుంచి మినహాయింపు, ఒకే సమయంలో వేర్వేరు సిరీస్‌లను ఆడేందుకు వెళ్లడం వంటి కారణాలతో ఆరుగురు సారథులు టీమ్‌ఇండియాను నడిపించారు. రోహిత్ శర్మతో సహా కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్, బుమ్రా వివిధ సందర్భాల్లో కెప్టెన్‌గా వ్యవహరించారు. అలాగే టీ20 ప్రపంచకప్ టోర్నీకి ముందు టీమ్‌ఇండియాకు భారీ దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ బుమ్రా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయాల కారణంగా ఆడకపోవడం భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
మహిళా క్రికెటర్లు అదరగొట్టారు..
రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమ్‌ఇండియా మెగా టోర్నీల్లో విఫలమైతే.. మహిళా క్రికెటర్లు మాత్రం తమ ప్రతిభను చాటిచెప్పారు. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో ప్రవేశపెట్టిన ఉమెన్స్ క్రికెట్ పోటీల్లో రజత పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఫైనల్‌లో ఆసీస్ చేతిలో ఓటమి మినహా.. టోర్నీ ఆసాంతం భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. అలాగే ఈ ఏడాది భారత మహిళా క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. పురుషులతో సమానంగా మ్యాచ్‌ను ఫీజు చెల్లించేందుకు బీసీసీఐ ఆమోద ముద్ర వేసింది. అయితే దిగ్గజ మహిళా క్రికెటర్లు మిథాలీరాజ్, ఝులన్ గోస్వామి క్రికెట్‌కు వీడ్కోలు పలికేశారు. అలాగే కొత్త సంవత్సరంలో మహిళల కోసం ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లను చేస్తోంది. ఇక టీమ్‌ఇండియా నుంచి స్మృతీ మంధాన ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ రేసులో నిలిచింది.
విజయాలతో ముగింపు.. పంత్‌కు ప్రమాదం
2022 టీమ్‌ఇండియా టెస్టు సిరీస్ విజయంతో ముగించింది. బంగ్లాదేశ్‌పై రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ గెలిచింది. తొలి టెస్టును అలవోకగా గెలిచిన టీమ్‌ఇండియా.. రెండో టెస్టులో మాత్రం పోరాడి మరీ విజయం సాధించింది. అయితే అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను కోల్పోవడం గమనార్హం. అయితే ఇషాన్ కిషన్ అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. ఇక డిసెంబర్ చివరి వారంలో జరిగిన రెండు సంఘటనలు భారత క్రికెట్‌ను పతాక శీర్షికల్లో నిలిపేలా చేసింది. ఒకటేమో ఐపీఎల్ మినీ వేలం కాగా.. రెండోది యువ బ్యాటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయాలపాలు కావడం. అయితే ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్య బృందం ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకొన్నారు. దిల్లీ నుంచి సొంత ఊరు రూర్కీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
కొత్త సంవత్సరంలో సాధించాల్సిందివే..
ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు టీమ్‌ఇండియా ఎదురు చూస్తోంది. అయితే 2023లో రెండు మెగా టోర్నీల్లో తలపడాల్సి ఉంది. ఆసియా కప్‌తో పాటు వన్డే ప్రపంచకప్‌ను ఆడనుంది. పాకిస్థాన్ వేదికగా ఆసియా కప్ జరగడంపై సందిగ్ధత నెలకొంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్‌కు భారత్ వెళ్లడం దాదాపు అసాధ్యమే. అదే జరిగితే తటస్థ వేదికకు టోర్నీ మారే అవకాశం లేకపోలేదు. ఇక భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌ను గెలిచి 12 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలకాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఆ దిశగా జట్టును సన్నద్ధం చేయడంలో రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ కీలక నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇకనైనా చేసిన పొరపాట్లను సరిచేసుకొని కొత్త సంవత్సరంలో విజయాలు నమోదు చేసి భారత క్రికెట్‌ను ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలి. కేవలం సంపదతోనే కాకుండా ఆటపరంగానూ ఆధిపత్యం కొనసాగించాలి. మెగా టోర్నీల్లో విఫలమయ్యే అలవాటును త్యజించాలి.. ఇదే సగటు క్రికెట్ అభిమాని టీమ్‌ఇండియా నుంచి కోరుకొనేది. గుడ్ బై 2022..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
Crime News
Crime News: బాగా చదివి లాయర్ కావాలనుకుని.. ఉన్మాది చేతిలో కత్తి పోట్లకు బలైపోయింది
-
Movies News
Chinmayi: స్టాలిన్ సార్.. వైరముత్తుపై చర్యలు తీసుకోండి: గాయని చిన్మయి
-
Politics News
Congress: ఆ ఒక్క ఎమ్మెల్యే తృణమూల్‌లో చేరిక.. బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ మళ్లీ ఖాళీ!