Chris Gayle : యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌కు నిరీక్షణ తప్పదు!

స్వదేశంలోని కింగ్‌స్టన్ సబీనా పార్క్‌ మైదానంలో అశేష ప్రేక్షకుల మధ్య...

Published : 02 Jan 2022 01:25 IST

సొంతమైదానంలో వీడ్కోలు పలకాలని ఆశ

ఇంటర్నెట్‌ డెస్క్: విండీస్‌ వెటరన్‌ బ్యాటర్‌, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌గేల్‌కు నిరీక్షణ తప్పేలా లేదు. స్వదేశంలోని కింగ్‌స్టన్ సబీనా పార్క్‌ మైదానంలో అశేష ప్రేక్షకుల మధ్య అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుదామని భావించిన క్రిస్‌ గేల్‌కు నిరాశ ఎదురైంది. ఐర్లాండ్‌తో ఏకైక టీ20 మ్యాచ్‌ ప్రకటించిన జట్టులో గేల్‌కు స్థానం దక్కలేదు. సబీనా పార్క్‌ మైదానంలో జనవరి 8 నుంచి 16వ తేదీ వరకు ఐర్లాండ్‌తో మూడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌ ఆడనుంది. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండా క్రీడా కార్యక్రమాలను నిర్వహించుకోవాలని జమైకా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఐర్లాండ్‌తో సిరీస్‌ అనంతరం విండీస్‌ జట్టు ఇంగ్లాండ్‌తో తలపడుతుంది. జనవరి 22 నుంచి 30వ తేదీ వరకు బార్బొడోస్‌ మైదానం వేదికగా ఐదు టీ20లు జరుగుతాయి.

‘‘క్రిస్మస్‌కు ముందు పాకిస్థాన్‌తో సిరీస్‌కు ప్రకటించిన జట్టునే ఇప్పుడూ కొనసాగిస్తున్నాం. అప్పుడు కొవిడ్ కేసులు రావడంతో పాక్‌తో వన్డే సిరీస్‌ వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ సిరీస్‌లకు కెప్టెన్‌ కీరన్ పొలార్డ్‌ సహా ఇతర సీనియర్లు జట్టులోకి వచ్చేస్తున్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంది. అందుకోసం యువకులను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. వారికి అవకాశం కల్పించి నైపుణ్యాలను మెరుగుపరచాలని భావించాం. అంతేకాకుండా పాక్‌తో టీ20 సిరీస్‌లో వారు ప్రదర్శించిన యాటిట్యూడ్‌ను కొనసాగేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని విండీస్‌ ప్రధాన కోచ్‌ సిమన్స్ వివరించాడు.

ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌తో టీ20లకు విండీస్‌ జట్టు

కీరన్‌ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్‌ పూరన్ (వైస్ కెప్టెన్), ఫాబియన్‌ అలెన్, డారెన్ బ్రావో (ఇంగ్లాండ్‌తో టీ20లకు మాత్రమే), రోస్టన్ ఛేజ్, షెల్డన్‌ కాట్రెల్, డొమినిక్‌ డ్రాక్స్, షై హోప్, అకీల్ హుసేన్, జాసన్ హోల్డర్‌, బ్రాండన్‌ కింగ్‌, కైల్ మేయర్స్, రోవ్‌మన్ పావెల్, షెఫెర్డ్‌, స్మిత్, హేడెన్ వాల్ష్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని