Shardul Thakur: ‘బీఫీ’ అంటున్న టీమ్‌ఇండియా.. సంతోషంగా ఉందన్న శార్దూల్‌ ఠాకూర్‌

ఏదేమైనా సరే అప్పగించిన బాధ్యతలను నెరవేర్చాల్సిందేనని టీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ అంటున్నాడు. విజయానికి అవసరమైన తలుపులు మూతపడకుండా చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నాడు....

Published : 03 Sep 2021 12:19 IST

లండన్‌: ఏదేమైనా సరే అప్పగించిన బాధ్యతలను నెరవేర్చాల్సిందేనని టీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ అంటున్నాడు. విజయానికి అవసరమైన తలుపులు మూతపడకుండా చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నాడు. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టులో తొలిరోజు ఆట ముగిశాక అతడు మీడియాతో మాట్లాడాడు.

ఒకవైపు వికెట్లు పడుతున్న తరుణంలో శార్దూల్‌ రెచ్చిపోయాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదేశాడు. కేవలం 31 బంతుల్లోనే అర్ధశతకం సాధించి ఇయాన్‌ బోథమ్‌ 35ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. దాంతో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

‘పేసరైనా, బ్యాటరైనా బాధ్యత తీసుకోవాల్సిందే. టీమ్‌ఇండియాకు ఆడుతున్నప్పుడు ఏదేమైనా అనుకున్న పని పూర్తిచేయాలి. నేనెప్పుడు బ్యాటింగ్‌కు వెళ్లినా నా వరకైతే అది సవాలే. నా జట్టు విజయానికి అవసరమైన తలుపులు తెరిచేలా నేను ప్రభావం చూపించాలి’ అని శార్దూల్‌ అన్నాడు. గతంలో బ్రిస్బేన్‌లోనూ అతడు అర్ధశతకంతో జట్టు గెలుపునకు కృషి చేసిన సంగతి తెలిసిందే.

ఇంగ్లాండ్‌ ఒకప్పటి ఆల్‌రౌండర్‌ ఇయాన్‌ బోథమ్‌ ముద్దుపేరు ‘బీఫీ’. ప్రస్తుతం టీమ్‌ఇండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లోనూ శార్దూల్‌ను అదే పేరుతో పిలుస్తున్నారు. అందుకెంతో సంతోషంగా ఉందని అతడు తెలిపాడు. ‘జట్టు సభ్యులు చూపుతున్న ప్రేమకు ఆనందంగా ఉంది. వారు ఆ ముద్దుపేరుతో పిలవాలని అనుకున్నారు’ అని ఠాకూర్‌ పేర్కొన్నాడు.

కుడి-ఎడమ కూర్పు కోసమే రవీంద్ర జడేజాను ముందుగా పంపించారని శార్దూల్‌ స్పష్టతనిచ్చాడు. ‘ఆ సమయంలో వెళ్లేది రిషభ్ పంతా, జడ్డూనా అన్నది ముఖ్యం కాదు. జడేజా నిలకడగా సహనంతో పరుగులు చేసిన సందర్భాలను మనం చేశాం. కుడి-ఎడమ కూర్పు కోసమే అతడిని ముందుగా పంపించారు’ అని అతడు తెలిపాడు.

కోచింగ్‌ బృందం తనను సాధ్యమైనంత వరకు స్ట్రెయిట్‌గా బంతుల్ని ఆడమని సూచిందని శార్దూల్‌ అన్నాడు. బంతి ఎక్కువగా స్వింగ్‌ అవుతుండటంతో ఆ సలహా ఇచ్చారన్నాడు. తాను బాదిన మూడు సిక్సర్లలో ఫుల్‌షాట్‌ ఎంతగానో నచ్చిందని వెల్లడించాడు. టీమ్‌ఇండియా మరీ ఎక్కువ పరుగులు చేయలేదు కాబట్టి ఇంగ్లాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో త్వరగా ఆలౌట్‌ చేయాల్సి ఉందని శార్దూల్‌ అన్నాడు. అలాగైతే మ్యాచ్‌ మరింత రసవత్తరంగా మారుతుందని పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని