
IND vs ENG: భారత్ x ఇంగ్లాండ్ ఆటగాళ్లను భయపెడుతున్న జార్వో 69
మరోసారి సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి..
లండన్: టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్ ఆటగాళ్ల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గత రెండు టెస్టుల్లో మైదానంలోకి ప్రవేశించి ఆటకు అంతరాయం కలిగించిన జార్వో 69 అనే యూట్యూబర్ తాజాగా జరుగుతున్న నాలుగో టెస్టులోనూ అదే పనిచేశాడు. దీంతో ఆటగాళ్ల భద్రతా లోపాలపై ఆందోళనలు నెలకొన్నాయి. రెండో రోజు తొలి సెషన్‌లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుండగా ఉమేశ్ యాదవ్ 34వ ఓవర్‌లో బౌలింగ్ చేయడానికి వచ్చాడు. మూడు బంతులు వేయగానే జార్వో ఒక్కసారిగా మైదానంలోకి దూసుకొచ్చాడు. అతడు నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బెయిర్‌స్టో దగ్గరికి వెళ్లి గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అతడిని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు.
జార్వో ఇలా వరుస మ్యాచ్‌ల్లో మైదానాల్లోకి ప్రవేశిస్తున్నా భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారంటూ నెటిజెన్లు, పలువురు క్రికెటర్లు సామాజిక మాధ్యమాల ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇతరులు ఇలా మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లకు ముట్టుకోవడం మంచిది కాదని అంటున్నారు. మరోవైపు జార్వో లీడ్స్ టెస్టులోనూ ఇలాగే చేయడంతో అతడిపై జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయినా, ఇప్పుడు మరోసారి అలా చేయడంతో ఆటగాళ్ల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు రెండో టెస్టులోనూ టీమ్‌ఇండియా దుస్తులు ధరించిన అతడు మైదానంలోకి ప్రవేశించి ఫీల్డర్లను మోహరించాడు. జడ్డూ, సిరాజ్ అతడిని నిజంగానే టీమ్‌ఇండియా సభ్యుడని భావించారు. ఇక మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఔటైన తర్వాత కూడా బ్యాట్ పట్టుకొని క్రీజు వద్దకు వెళ్లాడు. అప్పుడు గుర్తించిన భద్రతా సిబ్బంది అతడిని బయటకు పంపించారు.