
IPL 2021: అంతదూరం వెళ్తుందని అస్సలు ఊహించలేదు: రాహుల్ త్రిపాఠి
(Photo: Rahul Tripathi Twitter)
ఇంటర్నెట్‌డెస్క్: దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ చివరి బంతి వరకు వెళ్తుందని అస్సలు ఊహించలేదని కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్ రాహుల్ త్రిపాఠి అన్నాడు. ఆఖరి రెండు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన స్థితిలో అతడు (12; 11 బంతుల్లో 1x6) సిక్సర్‌తో కోల్‌కతాను గెలిపించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఉత్కంఠభరిత పరిస్థితుల్లో జట్టును గెలిపించడం గొప్పగా ఉందన్నాడు. అయితే, సునాయాసంగా గెలుస్తామనుకున్న మ్యాచ్ అంత దూరం వెళ్తుందని ఊహించలేకపోయానన్నాడు.
‘చివర్లో రెండు మూడు ఓవర్లు మాకు కష్టంగా అనిపించింది. మ్యాచ్ అంత దూరం వెళ్తుందని అనుకోలేదు. చివరికి విజయం సాధించడం సంతోషంగా ఉంది. రబాడ 18వ ఓవర్ అత్యద్భుతంగా వేశాడు. ఆ సమయంలో పలు వికెట్లు కోల్పోవడంతో వీలైతే రెండు పరుగులు తీస్తూ బ్యాటింగ్ చేయాలనుకున్నా. సింగిల్ తీస్తే కొత్తగా వచ్చిన బ్యాట్స్‌మన్‌కు ఆడటం కష్టమవుతుందని భావించా. బంతి బ్యాట్ మీదకు రాకపోవడంతో షాట్లు ఆడటం కష్టమైంది. అలాంటప్పుడు కొత్త బ్యాట్స్‌మన్ పరుగులు తీయడం, బౌండరీలు బాదడం అంత తేలిక కాదు. అయితే, ఒక్క షాట్ దూరంలోనే విజయం మా ముంగిట ఉందని తెలుసు. దాంతో నాకు నేను ఆత్మవిశ్వాసం తెచ్చుకొని ఆడాను. తొలి దశ తర్వాత మా జట్టు బలంగా మారింది. సారథి మోర్గాన్, కోచ్ మెక్‌కలమ్ మమ్మల్ని సానుకూల ధోరణిలో ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించారు’ అని త్రిపాఠి వివరించాడు.
ఈ మ్యాచ్‌లో దిల్లీ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా మొదట తేలిగ్గా ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (55; 41 బంతుల్లో 4x4, 3x6), శుభ్‌మన్ గిల్ (46; 46 బంతుల్లో 1x4, 1x6) శుభారంభం చేసి జట్టు విజయానికి బలమైన పునాది వేశారు. తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించారు. రబాడ వేసిన 13వ ఓవర్లో అయ్యార్ ఔటయ్యాక నితీశ్ రాణా (13; 12 బంతుల్లో 1x6) క్రీజులోకి వచ్చి కొద్దిసేపటికే వెనుదిరిగాడు. అప్పటికి ఆ జట్టు స్కోర్ 16 ఓవర్లకు 123/2. మిగిలిన నాలుగు ఓవర్లలో కోల్‌కతా విజయానికి 13 పరుగులే అవసరమయ్యాయి. కానీ, అప్పుడే దిల్లీ బౌలర్లు చెలరేగిపోయారు. వరుస ఓవర్లలో శుభ్‌మన్ గిల్, దినేశ్ కార్తీక్ (0), ఇయాన్ మోర్గాన్ (0)లను ఔట్ చేశారు. దీంతో చివరి ఓవర్లో ఆ జట్టు విజయానికి 7 పరుగులు అవసరమయ్యాయి. ఆ సమయంలో అశ్విన్ బంతి అందుకొని తొలి రెండు బంతుల్లో సింగిల్ ఇచ్చాడు. మూడు, నాలుగు బంతులను షకిబ్ అసల్ హసన్ (0), సునీల్ నరైన్(0)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో మ్యాచ్ దిల్లీవైపు మొగ్గింది. చివరి రెండు బంతుల్లో కోల్‌కతా ఆరు పరుగులు చేయాల్సిన స్థితిలో త్రిపాఠి తర్వాతి బంతిని స్టాండ్స్‌లోకి తరలించాడు. దీంతో ఆ జట్టు ఉత్కంఠభరిత పరిస్థితుల్లో అద్భుత విజయం సాధించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.