IPL 2021: అనుకున్నదానికి భిన్నంగా: మోర్గాన్‌.. 150 పరుగులైతే సరిపోయేది: విలియమ్సన్‌

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మరో అడుగు ముందుకేసింది. ఆదివారం రాత్రి సన్‌రైజర్స్‌పై ఆరో విజయం సాధించి 12 పాయింట్లతో నిలిచింది. దీంతో నాలుగో స్థానానికి మరింత చేరువైంది...

Updated : 10 Oct 2022 11:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మరో అడుగు ముందుకేసింది. ఆదివారం రాత్రి సన్‌రైజర్స్‌పై ఆరో విజయం సాధించి 12 పాయింట్లతో నిలిచింది. దీంతో నాలుగో స్థానానికి మరింత చేరువైంది. అయితే, 116 పరుగులు స్వల్ప లక్ష్య ఛేదనను కూడా ఆ జట్టు చివరి వరకూ తీసుకెళ్లింది. ఈ విషయంపై స్పందించిన కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ తాము అనుకున్న దాని కన్నా ఈ వికెట్‌ చాలా నెమ్మదించిందని చెప్పాడు. సహజంగా దుబాయ్‌ పిచ్‌ పవర్‌ప్లేలో స్వింగ్‌ అవుతుందని, కానీ ఈ మ్యాచ్‌లో అలా జరగలేదని అన్నాడు.

‘మేం బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మంచిగా రాణించాం. ఛేదనలో శుభ్‌మన్‌ (57) బాగా ఆడటమే కాకుండా ముందుండి నడింపించాడు. మరోవైపు మాకు బలమైన రిజర్వ్‌బెంచ్‌ ఉంది. అందులోంచి షకీబ్‌ ఉల్‌ హసన్‌ను తుది జట్టులోకి తీసుకోవడం కష్టమైంది. కానీ అతడు మంచి ప్రభావం చూపాడు. అలాగే రెండో దశ యూఏఈలో ఉంటుందని మాకు తెలియదు. అయితే, ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడి బాగా ఆడుతున్నాం. ఎలాగైనా విజయాలు సాధించాలనే కసితో ఉన్నాం. డ్రెస్సింగ్‌ రూమ్‌లో మా ప్రణాళికలు కూడా ఆటపై మంచి ప్రభావం చూపుతున్నాయి. మా ఆటగాళ్లు బాధ్యత తీసుకుంటూ మ్యాచ్‌లు గెలిపిస్తున్నారు. ప్రత్యేకించి ఈ స్లో పిచ్‌ పరిస్థితులకు అలవాటు పడటం చాలా సంతోషంగా ఉంది’ అని మోర్గాన్‌ అన్నాడు.

150 పరుగులైతే బాగుండేది: విలియ్సన్‌

ఇక సన్‌రైజర్స్‌ ఓటమిపై స్పందించిన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌.. తాము ఈ మ్యాచ్‌లో 150 పరుగులు చేసుంటే బాగుండేదని చెప్పాడు. ‘మాకు లక్ష్యాన్ని కాపాడుకునే అవకాశం ఉన్నా ఇలా తక్కువ స్కోరును కాపాడుకోవడం ఎప్పుడైనా కష్టం. అలాగే ఈ సీజన్‌ మొత్తంలో మేం సరైన స్కోర్‌ సాధించలేకపోయాం. మా పరిస్థితులను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ మ్యాచ్‌లోనూ సరైన భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. ఇంకొన్ని పరుగులు చేసుంటే కోల్‌కతాతో పోటీపడేందుకు బాగుండేది. ఇప్పుడు మేం ఎలాగో పోటీలో లేనందున కొత్త ఆటగాళ్లకు అవకాశాలిస్తున్నాం’ అని విలియమ్సన్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని