
T20 World Cup: టీ20 ప్రపంచకప్ జట్టులో శార్దూల్ ఎంపికపై నెటిజెన్ల మిశ్రమ స్పందన
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జట్టులో ఆఖరి నిమిషంలో సెలెక్షన్ కమిటీ అక్షర్ పటేల్‌కు బదులు శార్దూల్ ఠాకూర్‌ని ఎంపిక చేయడంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు అతడి ఎంపికని సరైందిగా భావిస్తే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇందులో బీసీసీఐ తీరును విమర్శిస్తున్నారు. ఇది అక్షర్లాంటి నైపుణ్యమున్న ఆటగాడి మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 14వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న శార్దూల్ 15 మ్యాచ్‌ల్లో.. 8.75 ఎకానమీతో 18 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు దిల్లీ స్పిన్నర్ అక్షర్ పటేల్ 12 మ్యాచ్‌ల్లో ..6.65 ఎకానమీతో 15 వికెట్లు తీశాడు.
శార్దూల్ ఎంపిక సరైందే అయినా అక్షర్‌ను పక్కనపెట్టాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే తొలుత భారత జట్టును ప్రకటించినప్పుడు అశ్విన్, రాహుల్ చాహర్‌ను జట్టులోకి తీసుకున్నారు. వీరిద్దరూ ‘యూఏఈ లెగ్’లో ఏమంత ప్రభావం చూపలేకపోయారు. అక్షర్‌కు బదులు వీరిని తప్పించాల్సిందని అంటున్నారు. కాగా, బీసీసీఐ బుధవారం శార్దూల్‌ను 15 మంది జట్టు సభ్యుల్లో ఒకరిగా ప్రకటించగా అందులో నుంచి అక్షర్‌ను స్టాండ్ బై ఆటగాళ్ల జాబితాలో చేర్చింది. ఇప్పటికే స్టాండ్‌బై ఆటగాళ్లుగా శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్ ఉన్నారు. అయితే, హార్దిక్ పాండ్య లాంటి సీనియర్ ఆల్‌రౌండర్ జట్టులో ఉన్నా పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయలేడనే పరిస్థితుల్లో శార్దూల్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.
భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి
స్టాండ్‌బై ఆటగాళ్లు: శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.