IPL 2021: ఈరోజు మనం నిరాశపడొచ్చు కానీ.. ఎవరూ బాధపడలేదు: కోహ్లీ

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథిగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తొమ్మిదేళ్లు పనిచేశాడు. సోమవారం రాత్రి కోల్‌కతాతో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓడిపోయాక ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు...

Updated : 20 Sep 2022 15:30 IST

(Photo: RCB Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథిగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తొమ్మిదేళ్లు పనిచేశాడు. సోమవారం రాత్రి కోల్‌కతాతో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓడిపోయాక ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో మ్యాచ్‌ అనంతరం తన జట్టు ఆటగాళ్లతో మాట్లాడాడు. ఆర్సీబీ ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. 2016 తర్వాత ఈ సీజనే తాను అత్యంతంగా ఆస్వాదించినట్లు చెప్పాడు. ఈ ఓటమితో ఆటగాళ్లు నిరాశ చెందినా తమ పోరాటపటిమతో ఆకట్టుకున్నారన్నాడు.

‘నిజం చెప్పాలంటే మాకు 2016 టోర్నీ ఎంతో ప్రత్యేకమైంది. ఆ సీజన్‌ తర్వాత మళ్లీ ఇప్పుడే అంత బాగా ఆస్వాదించాను. ఈ బృందంతో కలిసి ఆడటం. గెలుపోటములు సమానంగా స్వీకరించడం లాంటివన్నీ నా కెంతో ప్రత్యేకం. కప్పు సాధించేందుకు ప్రతి ఒక్కరం చాలా కష్టపడ్డాం. ఈ ఓటమితో మనం నిరాశ చెందామనేది నిజమే అయినా ఎవరూ మనసు విరిగేంతగా బాధపడినట్లు కనిపించలేదు. దీన్ని జీర్ణించుకోవడం కష్టమే అయినా మనం ఆడిన తీరుకు గర్వంగా ఉంది. ఈ ఫ్రాంఛైజీలో మనం ప్రతిసారీ ఇదే ప్రయత్నిస్తామని అనుకుంటా’ అని కోహ్లీ స్పందించాడు. ఇక ఇన్నాళ్లూ కెప్టెన్‌గా తాను పూర్తి అంకిత భావంతో పనిచేశానని, ఇకపైనా కెప్టెన్‌గా అన్ని నిర్ణయాలు తీసుకోకపోయినా నాయకుడిలా అవసరమైన సలహాలు, సూచనలు చేస్తానని చెప్పాడు. ఇక చివరగా ఈ సీజన్‌ను గుర్తుండిపోయేలా చేసిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా’ అని కోహ్లీ ముగించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని