Yuzvendra Chahal : ధోనీ ముందుకు వచ్చే సరికి.. నా నోరు మూతపడుతుంది: చాహల్‌

ధోనీ(MS Dhoni)తో తనకున్న అనుబంధాన్ని స్పిన్నర్‌ చాహల్‌ (Yuzvendra Chahal) గుర్తుచేసుకున్నాడు. కష్ట సమయాల్లో అతడు ఆటగాళ్లకు ఎలా మద్దతుగా ఉంటాడో వివరించాడు.

Updated : 17 Jul 2023 11:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India) మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ (MS Dhoni).. సారథ్య బాధ్యతలు నిర్వహించడంలో ఎంత కూల్‌గా ఉంటాడో.. సహచర ఆటగాళ్లతోనూ అంతే సరదాగా ఉంటాడు. అందుకే ఇతర జట్లలోని ఆటగాళ్లు కూడా అతడిని ఆరాదిస్తూ ఉంటారు. ఇక అవకాశం దొరికినప్పుడల్లా.. ధోనీ వారికి ఆట మెరుగుపరచుకోవడంలో సూచనలు, సలహాలు ఇస్తుంటాడు. ఇక మహీ సారథ్యంలో ఎదిగిన స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ (Yuzvendra Chahal).. అతడితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు.

ఆన్‌ ఫీల్డ్‌, ఆఫ్‌ ఫీల్డ్‌లో తన చేష్టలతో సహచరులను ఆటపట్టించే చాహల్‌.. ధోనీ ఎదురుపడితే మాత్రం సైలెంట్‌ అవుతాడట. ఈ విషయాన్ని చాహల్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘కేవలం ధోనీ ముందు మాత్రమే నేను సైలెంట్‌గా ఉంటాను. అతడు నా ముందుకు వచ్చేసరికి నా నోరు ఆటోమేటిక్‌గా మూతపడుతుంది. అనవసర విషయాలు మాట్లాడను. మహీ భాయ్‌ ముందు కూర్చుని.. అతడు అడిగిన వాటికి మాత్రమే సమాధానమిస్తాను. లేకపోతే నిశ్శబ్దంగా ఉంటాను’ అంటూ చాహల్‌ వివరించాడు.

అప్పటికి చాహల్‌ ఎవరో తెలియదు..! ధనశ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు

గతంలో సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి 64 పరుగులు సమర్పించుకున్నప్పటికీ ధోనీ తనపై ఎంతో నమ్మకముంచాడని చాహల్‌ తెలిపాడు. ‘దక్షిణాఫ్రికాతో టీ20 ఆడుతున్నాం. నేను వేసిన 4 ఓవర్లలో 64 పరుగులు బాదారు. హెన్రిక్‌ క్లాసెన్‌ నా బౌలింగ్‌లో దంచికొడుతున్నాడు. వెంటనే ధోనీ నా వద్దకు వచ్చి రౌండ్‌ ది వికెట్‌ వేస్తావా.. అంటూ అడిగాడు. నేను అలానే చేశాను. అయినా.. క్లాసెన్‌ సిక్స్‌ బాదాడు. మళ్లీ ధోనీ నా వద్దకు వచ్చాడు. ‘ఈరోజు నీది కాదు.. అయినా ఫర్లేదు’ అంటూ నా భుజం తట్టాడు. మిగిలిన ఐదు బంతుల్లో బౌండరీలు ఇవ్వకుండా చూసుకో.. అది జట్టుకు ఉపయోగపడుతుంది అని చెప్పి వెళ్లాడు. అప్పుడు తెలిసింది.. నాది కాని రోజున కూడా నాకు జట్టు నుంచి మద్దతు లభిస్తుంది అని’ అంటూ ధోనీ కెప్టెన్సీపై పొగడ్తల వర్షం కురిపించాడు.

చాహల్‌ ఇప్పటి వరకూ 72 వన్డేలు ఆడి 121 వికెట్లు పడగొట్టగా.. 75 టీ20లు ఆడి 91 వికెట్లు సాధించాడు. ఐపీఎల్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని