Hardik Pandya: అతడు ఫామ్‌లో ఉంటే కట్టడి చేయడం ఎవరికైనా కష్టమే: ఇర్ఫాన్‌ పఠాన్‌

భారత్‌ - న్యూజిలాండ్‌ మధ్య జరిగిన మూడో వన్డేలో హార్ధిక్‌ పాండ్య ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రశంసలు కురిపించాడు. 

Published : 25 Jan 2023 20:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ‘‘ఫామ్‌లో ఉన్నప్పుడు హార్దిక్‌ పాండ్యను ఎవరూ కట్టడి చేయలేరు. అతడి షాట్లను గమనిస్తే క్రికెట్‌ మైదానంలో టెన్నిస్‌ ఆడుతున్నాడా అనే సందేహం కలుగుతుంది’’ అని అన్నాడు భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌. న్యూజిలాండ్‌పై మూడో వన్డేలో హార్దిక్‌ పాండ్య ప్రదర్శనపై ఇర్ఫాన్‌ ప్రశంసలు కురిపించాడు. ఇలాంటి ఆటగాళ్లు చాలా అరుదుగా ఉంటారన్న ఇర్ఫాన్‌... పాండ్య బౌలింగ్‌ గురించి, వైవిధ్యం గురించి మాట్లాడాడు.

‘‘భారత జట్టులో పాండ్య కచ్చితంగా కీలకమైన ఆటగాడు. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ సమంగా రాణించే ఆటగాళ్లు జట్టుకు అవసరం. అలాంటి సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు ప్రపంచ క్రికెట్‌లో చాలా తక్కువ మంది ఉన్నారు. పాండ్య లాంటి ప్లేయర్‌ను కనుగొనడం ఏ జట్టుకైనా కష్టమే, కానీ అలాంటి ఆటగాడు ప్రతి జట్టుకు అవసరం. కివీస్‌తో మూడో వన్డేలో సరైన సమయంలో వేగంగా స్కోరు సాధించాడు. పాత బంతితో అటువంటి స్కోర్‌ చేయడం మిగతా బ్యాటర్లకు కష్టం. కానీ పాండ్య సులభంగా సాధించాడు’’ అని పొగిడేశాడు ఇర్ఫాన్‌.

‘‘ఇక బౌలింగ్‌ విషయానికొస్తే పాండ్య ఈ మధ్యే ఇన్‌స్వింగ్‌ కూడా ప్రారంభించాడు. ఇదివరకు అతడు అవుట్‌స్వింగ్‌ బౌలింగ్ చేసేవాడు. ఈ విషయంలో అతడు చాలా మెరుగుపడ్డాడు’’ అని ఇర్ఫాన్‌ పేర్కొన్నాడు. భారత్‌ - న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో పాండ్య 38 బంతుల్లో 54 పరుగులు చేశాడు.  న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌ వేసిన పాండ్య... తన రెండో బంతికే కివీస్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ను ఔట్‌ చేసిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని