Virat Kohli: నిబంధనలు ఉల్లంఘించి దూసుకొచ్చిన అభిమాని.. కోహ్లీ ఏం చేశాడంటే..?

భారత మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగే వేరు. స్వదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ విరాట్‌కు వీరాభిమానులున్నారు.........

Published : 01 Sep 2022 08:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భారత మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగే వేరు. స్వదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ విరాట్‌కు వీరాభిమానులున్నారు. ఆసియా కప్‌ సందర్భంగా  ఆ విషయం మరోసారి రుజువైంది. కోహ్లీతో మాట్లాడేందుకు, అతడు సంతకం చేసిన జెర్సీని పొందేందుకు పాకిస్థాన్‌కు చెందిన పలువురు ఆటగాళ్లు ఆసక్తిచూపిన విషయం తెలిసిందే. ఇంకొందరు అభిమానులు కోహ్లీని కలిసి అతడితో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. విరాట్‌ సైతం వారితో స్నేహపూర్వకంగా మెలిగాడు. అభిమానులకు ఎంతో ప్రాధాన్యతనిచ్చే ఈ మాజీ కెప్టెన్‌ తాజాగా మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరలవుతోంది.

దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో బుధవారం భారత్‌, హాంకాంగ్‌ జట్లు తలపడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత జట్టు స్టేడియంలోకి వెళుతుండగా.. కోహ్లీ వీరాభిమాని అయిన ఓ బాలుడు నిబంధనలు ఉల్లంఘించి అక్కడకు దూసుకొచ్చాడు. అయితే, అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు అతడిని ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్నాడు. దీన్ని గమనించిన కోహ్లీ.. ఆ బాలుడిని వదిలేయాల్సిందిగా సూచించడంతో సెక్యూరిటీ గార్డు అతడిని విడిచిపెట్టాడు. దీంతో కోహ్లీ వద్దకు పరుగున వెళ్లిన బాలుడు.. తాను ఎంతగానో అభిమానించే అతడి వద్ద ఆటోగ్రాఫ్‌ తీసుకొని, సెల్ఫీలు దిగి సంబురపడిపోయాడు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. దీంతో కోహ్లీ చర్య పట్ల అభిమానులు, ఇతరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ ఆ బాలుడి పట్ల విరాట్‌ ప్రేమగా వ్యవహరించాడని, ఓపిగ్గా ఉన్నాడని ప్రశంసించారు. అందుకే అతడిని ‘కింగ్‌’ అంటారని మరికొందరు కొనియాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని