IPL - 2022 : కోహ్లీ మళ్లీ పగ్గాలు చేపట్టడం అంత సులభం కాదు : డేనియల్ వెటోరీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ పగ్గాలు చేపట్టడం అంత సులభం కాదని ఆర్సీబీ మాజీ కోచ్‌ డేనియల్ వెటోరీ అన్నాడు. డు ప్లెసిస్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌..

Published : 08 Mar 2022 01:16 IST

(Photo : RCB Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ పగ్గాలు చేపట్టడం అంత సులభం కాదని ఆర్సీబీ మాజీ కోచ్‌ డేనియల్ వెటోరీ అన్నాడు. డు ప్లెసిస్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ ఇద్దరూ కెప్టెన్సీ రేసులో ముందున్నారని అతడు పేర్కొన్నాడు. గత సీజన్‌ వరకు బెంగళూరు జట్టుకు కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

‘బెంగళూరు జట్టుకు విరాట్‌ కోహ్లీ మరోసారి సారథ్యం వహిస్తాడనుకోవడం లేదు. ఐపీఎల్‌లో గానీ, అంతర్జాతీయ క్రికెట్లో గానీ ఒకసారి జట్టు పగ్గాలు వదిలేశాక మళ్లీ బాధ్యతలు చేపట్టడం అంత సులభం కాదు. ఒకసారి నాయకత్వ బాధ్యతలు వదిలేశాక.. సాధారణ ఆటగాడిగా ముందుకు సాగడమే సరైన నిర్ణయం’ అని వెటోరీ అభిప్రాయపడ్డాడు. 

‘బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, డు ప్లెసిస్‌, దినేశ్‌ కార్తిక్‌లను జట్టు యాజమాన్యం పరిగణనలోకి తీసుకోవచ్చు. అయితే, మాక్స్‌వెల్ కంటే ముందు డు ప్లెసిస్‌కి ఆర్సీబీ యాజమాన్యం ఓ అవకాశం ఇవ్వొచ్చు. ఒక వేళ మొదటి మూడు మ్యాచుల్లో జట్టును గెలిపిస్తే.. అతడినే కెప్టెన్‌గా కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు, ఐపీఎల్‌లో మ్యాక్స్‌వెల్‌కి మూడేళ్ల అనుభవం ఉంది. పొట్టి ఫార్మాట్లో మూడేళ్లు అంటే దీర్ఘకాలం కిందే లెక్క. మ్యాక్స్‌వెల్‌ గత ఐపీఎల్‌లో రాణించినట్లే.. ఈ సీజన్‌లో మెరుగ్గా రాణిస్తే అతడిని నాయకుడిగా నియమించే అవకాశం ఉంది’ అని వెటోరీ అంచనా వేశాడు.

మార్చి 26 నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆ లోపు జట్టు యాజమాన్యం ఆర్సీబీ తదుపరి కెప్టెన్‌ ఎవరనే విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. మార్చి 27న బెంగళూరు జట్టు.. పంజాబ్‌ కింగ్స్ జట్టుతో తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని