Virender Sehwag: కోహ్లీతో పోటీపడ్డ సచిన్‌.. మాస్టర్‌బ్లాస్టర్‌ విజయ రహస్యం అదే..: సెహ్వాగ్‌

సచిన్‌ విజయ రహస్యాన్ని మాజీ డ్యాషింగ్‌ బ్యాటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ వివరించాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌లో  అద్భుతమైన పోటీతత్వం ఉందన్నాడు. ఓ దశలో కోహ్లీతో కూడా పోటీపడ్డాడని తెలిపాడు.

Updated : 19 Mar 2023 14:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత క్రికెట్‌ మారథాన్‌ కెరీర్‌లో అద్భుతమైన రికార్డులు సొంతం చేసుకొన్న ఏకైక ఆటగాడు సచిన్‌ తెందూల్కర్‌(Sachin Tendulkar).. మెక్‌గ్రాత్‌, ఆంబ్రోస్‌, షేన్‌వార్న్‌, ముత్తయ్య మురళీధరన్‌ వంటి ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బౌలర్లను అలవోకగా ఎదుర్కొని రికార్డుల వరద పారించాడు. సచిన్‌ 25ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌ కొనసాగడం వెనకున్న విజయ రహస్యాన్ని మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌(Virender Sehwag) అభిమానులతో పంచుకున్నాడు. ఆటలో మెరుగుదల గురించి నిరంతరం ఆలోచించి.. ఆ దిశగా కృషి చేయడమే సచిన్‌ను 1989-2013 వరకు మైదానంలో క్రికెట్‌ గాడ్‌గా నిలిపిందని అభిప్రాయపడ్డాడు. గంటల కొద్దీ సచిన్‌ ట్రెయినింగ్‌లో గడిపేవాడని.. అప్పట్లో కొత్తగా వచ్చిన విరాట్‌ కోహ్లీ(Virat Kohli)తో కూడా పోటీపడే వాడని వెల్లడించాడు.

‘‘సచిన్‌ మరికొన్నాళ్లు క్రికెట్‌ ఆడేవాడని ఎందుకనుకునేవారో తెలుసా..? తన బ్యాటింగ్‌ను లేదా ఆటతీరును మెరుగుపర్చుకోవడం గురించి ఆలోచించేవాడు. ఒక వేళ బ్యాటింగ్‌ విభాగంలో కొత్తగా మెరుగుపర్చుకొనేది ఏమీ లేకపోతే.. శతకాలను ద్విశతకాలుగా మార్చేందుకు అవసరమైన ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టేవాడు. 2000లో నా కెరీర్‌ ప్రారభించాను. అప్పట్లో సచిన్‌ మా కంటే ఎక్కువగా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాడు. 2008 తర్వాత విరాట్‌ జట్టులోకి వచ్చాడు. సచిన్‌ అతడితో పోటీపడ్డాడు. అతడికంటే ఎక్కువగా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాడు’’ అని సెహ్వాగ్‌ ఓ యూట్యూబ్‌ ఛానల్‌తో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు.

2013లో అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికిన సచిన్‌..  గొప్ప రికార్డులు తన ఖాతాలో వేసుకొన్నాడు. వీటిల్లో అంతర్జాతీయ కెరీర్‌లో 100 శతకాల రికార్డు అపూర్వమైంది. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో మరే క్రీడాకారుడు ఇప్పటి వరకు దాని వద్దకు చేరలేదు. ఒక్క టెస్టు క్రికెట్‌లోనే 51 శతకాలు ఉన్నాయి. ఇక వన్డే చరిత్రలో తొలి ద్విశతకం సచిన్‌ పేరిటే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని