Tokyo Olympics: 41 ఏళ్లకు పతకం.. కొవిడ్‌ యోధులకు అంకితం

ఒలింపిక్స్‌లో సాధించిన కాంస్య పతకాన్ని కొవిడ్‌ యోధులైన వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి అంకితం ఇస్తున్నామని హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నాడు. 41 ఏళ్ల కల నెరవేరడంతో మాటలు రావడం లేదన్నాడు. ...

Published : 05 Aug 2021 12:08 IST

ప్రాణం పెట్టాలని నిర్ణయించుకున్నాం:  మన్‌ప్రీత్‌ 

టోక్యో: ఒలింపిక్స్‌లో సాధించిన కాంస్య పతకాన్ని కొవిడ్‌ యోధులైన వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి అంకితం ఇస్తున్నామని హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నాడు. 41 ఏళ్ల కల నెరవేరడంతో మాటలు రావడం లేదని చెప్పాడు. ఆనందంతో భావోద్వేగానికి గురయ్యానని వెల్లడించాడు.

జర్మనీతో గురువారం జరిగిన కాంస్య పోరులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. హోరాహోరీగా జరిగిన మ్యాచులో 5-4 తేడాతో ప్రత్యర్థిని ఓడించింది. 1980లో భారత్‌ చివరి సారిగా స్వర్ణం గెలిచింది. ఆ తర్వాత పతకమే లేదు. 41 ఏళ్ల తర్వాత టోక్యోలో భారత కల నెరవేరింది.

‘ఏం చెప్పాలో తెలియడం లేదు. ఇదో అద్భుతం. మేం శ్రమించాం. మొదట 3-1తో వెనకబడ్డాం. పోరాడి గెలిచాం. ఈ పతకానికి మేం అర్హులం. చివరి 15 నెలలు మాక్కూడా కఠినంగానే గడిచాయి. మేం బెంగళూరు శిబిరంలో ఉన్నాం. మాలోనూ కొందరికి కొవిడ్‌ సోకింది. భారత్‌లో ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్న వైద్యులు, మొదటి వరుసలోని యోధులకు ఈ పతకం అంకితం’ అని మన్‌ప్రీత్‌ అన్నాడు.

‘జర్మనీకి ఆఖరి 6 సెకన్లలో పెనాల్టీ కార్నర్‌ రావడంతో మాకు కష్టమైంది. ప్రాణాలు పణంగా పెట్టైనా దానిని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నాం. అదెంతో కష్టమైంది. ప్రస్తుతానికి నా వద్ద మాటల్లేవ్‌. మనకు పతకం రాక చాలా కాలమైంది. ఇప్పుడు మాకు మరింత ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఒలింపిక్స్‌లో మేం పోడియంపై నిలబడ్డామంటే ఇంకెక్కడైనా గెలవలం’ అని మన్‌ప్రీత్‌ తెలిపాడు.

బెల్జియంపై ఓడిపోయినప్పుడు కోచ్‌ గ్రాహమ్‌ రీడ్‌ అండగా నిలిచాడని మన్‌ప్రీత్‌ అన్నాడు. ఆటగాళ్లను నిరాశలోంచి బయట పడేశారని తెలిపాడు. ప్లేఆఫ్‌ మ్యాచుపై దృష్టి సారించేలా చేశాడన్నాడు. ‘మేం ఆశలు వదులుకోలేదు. మేం పోరాడుతూనే ఉన్నాం. ఇదో అద్భుతమైన అనుభూతి. మేమిక్కడికి స్వర్ణం కోసం వచ్చాం. కాంస్యం గెలిచాం. ఇదీ గొప్పదే. హాకీ అభిమానులు అందరికీ ఇదో గొప్ప సందర్భం’ అని వెల్లడించాడు. ఇది ఆరంభమేనని తెలిపాడు.

‘భారత్‌లో ప్రజలు హాకీని మర్చిపోయారు. నిజానికి వారు హాకీని ప్రేమిస్తారు. కానీ మేం గెలుస్తామని నమ్మడం మానేశారు. కానీ మేమీ రోజు గెలిచాం. భవిష్యత్తులో వారు మా నుంచి మరింత ఆశిస్తారు. మమ్మల్ని నమ్ముతారు’ అని డ్రాగ్‌ ఫ్లికర్‌ రూపిందర్‌ పాల్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని