Yash Thakur: ఐపీఎల్‌ 2024.. యశ్‌ ఠాకూర్ సెన్సేషనల్‌ రికార్డు

లఖ్‌నవూ తరఫున యువ బౌలర్ల హవా కొనసాగుతోంది. మయాంక్‌ యాదవ్‌ అత్యధిక ఫాస్ట్‌ వేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించగా.. తాజాగా యశ్ ఠాకూర్‌ మరో ఘనత సాధించాడు.

Published : 08 Apr 2024 08:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో గుజరాత్‌ను లఖ్‌నవూ 33 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో హ్యాట్రిక్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్‌ పతనంలో కీలక పాత్ర యువ బౌలర్ యశ్‌ ఠాకూర్‌దే (Yash Thakur). ఐదు వికెట్ల (5/30) ప్రదర్శన చేసిన అతడు.. ప్రత్యర్థి జట్టును చావుదెబ్బ కొట్టాడు. ఈ క్రమంలో ఈ ఐపీఎల్‌లో అరుదైన ఘనతను తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి (ఇన్నింగ్స్‌ 15వ ఓవర్) మెయిడిన్‌ చేసిన బౌలర్‌గా అవతరించాడు. దీంతోపాటు ఈ సీజన్‌లో తొలి ఫైఫర్ (ఐదు వికెట్లు) తీసిన బౌలర్‌గానూ నిలిచాడు. అతడికే ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

గిల్‌ వికెట్‌ స్పెషల్: యశ్

‘‘ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం ఆనందంగా ఉంది. శుభ్‌మన్‌ గిల్‌ను ఔట్‌ చేసేందుకు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగా. దానిని అమలు చేయమని కేఎల్ రాహుల్‌ సూచించాడు. అది విజయవంతమైంది. దురదృష్టవశాత్తూ మయాంక్‌ గాయపడ్డాడు. ఈ మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకోమని కేఎల్ మద్దతుగా నిలిచాడు. ఐపీఎల్‌లో తొలిసారి గుజరాత్‌పై మేం విజయం సాధించాం. గిల్‌ను ఔట్‌ చేయడమే గుర్తుండిపోతుంది’’ అని యశ్‌ ఠాకూర్ వెల్లడించాడు. 

డిఫెండ్‌ చేయొచ్చని భావించాం: కృనాల్ పాండ్య

గుజరాత్‌పై కృనాల్ పాండ్య అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ.. ‘‘బ్యాటింగ్‌ సమయంలో నేను రెండు బంతులను మాత్రమే ఎదుర్కొన్నా. ఆ సమయంలో పూరన్‌తో పిచ్‌ గురించి మాట్లాడా. మేం 15 పరుగుల వరకు తక్కువ చేసినట్లు అనిపించింది. కానీ, చివరికి ఆ స్కోరును డిఫెండ్‌ చేయగలిగాం. పిచ్‌ అలా మారిపోయింది. బ్యాటర్ల బలాలు, బలహీనతలను తెలుసుకోవడం నాకిష్టం. దానికి అనుగుణంగానే బంతులను సంధించేందుకు ప్రయత్నిస్తా. మళ్లీ బౌలింగ్‌లో లయను అందుకోవడం సంతోషంగా ఉంది. మయాంక్‌ గాయం పరిస్థితి ఏంటో తెలియదు.  అతడి పరిస్థితి బాగానే ఉందనిపించింది. నెట్స్‌లోనూ తూటాల్లాంటి బంతులను సంధిస్తాడు.. మంచి భవిష్యత్తు ఉంది’’ అని కృనాల్‌ పాండ్య అన్నాడు. 

మ్యాచ్‌లో మరికొన్ని విశేషాలు..

  • ఐపీఎల్‌లో గుజరాత్‌ చేసిన రెండో అత్యల్ప స్కోరు ఇదే.  లఖ్‌నవూపై 130 పరుగులకు ఆలౌటైంది. గతేడాది దిల్లీపై 125/6 స్కోరు మాత్రమే చేయగలిగింది.
  • ఐపీఎల్‌లో గుజరాత్‌ రెండోసారి మాత్రమే ఆలౌట్‌ అయింది. గతేడాది తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో చెన్నైపై 157 పరుగులకు పది వికెట్లను కోల్పోయింది.
  • లఖ్‌నవూ తరఫున అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన రెండో బౌలర్ యశ్ ఠాకూర్. గుజరాత్‌పై 30 పరుగులకు ఐదు వికెట్లు తీశాడు. గతేడాది దిల్లీపై మార్క్‌వుడ్ 14 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు.
  • గుజరాత్‌పై ఐదు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా యశ్‌ ఠాకూర్‌ నిలిచాడు. అంతకుముందు ఉమ్రాన్‌ మాలిక్ (5/25), భువనేశ్వర్ కుమార్‌ (5/30) ఈ ఘనత సాధించారు. వీరిద్దరూ హైదరాబాద్‌ బౌలర్లే కావడం విశేషం.
  • లఖ్‌నవూ తరఫున అత్యుత్తమ ఎకానమీతో బౌలింగ్‌ చేసిన టాప్ బౌలర్ కృనాల్‌ పాండ్య. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్ల కోటాలో 11 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు.
  • ఐపీఎల్‌లో లఖ్‌నవూ తొలుత బ్యాటింగ్‌ చేసిన 18 మ్యాచుల్లో 15 విజయాలను నమోదు చేసింది. రెండింట్లో మాత్రమే ఓటమిపాలైంది. ఒక మ్యాచ్‌లో ఎలాంటి ఫలితం రాలేదు. కనీసం 160+ స్కోరు చేసిన 13 మ్యాచుల్లోనూ లఖ్‌నవూ విజయం సాధించడం విశేషం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని