Yashasvi Jaiswal: ఆ సమయంలో దూకుడుగా ఆడేద్దామనేది రోహిత్ ప్లాన్‌: యశస్వి

ఎడమ చేతివాటం బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఏ ఫార్మాట్‌లోనైనా దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టేస్తున్నాడు.

Published : 06 Jan 2024 01:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో భారత్‌ (SA vs IND) కేవలం 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి విజయం సాధించింది. అప్పటికి మూడు వికెట్లను కోల్పోయినప్పటికీ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్ (28: 23 బంతుల్లో 6 ఫోర్లు) వేగంగా ఆడేశాడు. దీంతో తర్వాత వచ్చిన బ్యాటర్లకు లక్ష్యఛేదన తేలికైంది. కొత్త బంతితో సఫారీ బౌలర్లు చెలరేగకుండా దూకుడు మంత్రం పాటించినట్లు యశస్వి తెలిపాడు. రోహిత్ శర్మ వల్లే ఇదంతా సాధ్యమైందని వ్యాఖ్యానించాడు.

‘‘రెండో ఇన్నింగ్స్‌లో సానుకూల దృక్పథంతో ఆడటంలో రోహిత్ భాయ్ సాయం చేశాడు. కొత్త బంతితో సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధిస్తారు. వారి ఏకాగ్రతను చెడగొట్టాలంటే దూకుడుగా ఆడాల్సిందే. మేం లక్ష్య ఛేదనకు దిగినప్పుడు అదే ప్రణాళికతో వచ్చాం. మంచి ఆరంభం ఇస్తే చాలు మ్యాచ్‌ మన సొంతమవుతుందని తెలుసు. క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుంచి అదే నా మనసులో ఉంది. గత మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ ఇదే ఆటతీరును ప్రదర్శించా’’

‘‘ఇలాంటి సుదీర్ఘమైన పర్యటన నుంచి చాలా నేర్చుకున్నా. ప్రతి క్షణం ఆస్వాదిస్తూ ఆడాను. ఇక్కడి వాతావరణంతో పోలిస్తే, మన దేశ పరిస్థితులు చాలా విభిన్నంగా ఉంటాయి. మెరుగుపర్చుకోవడానికి సీనియర్ల నుంచి, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల నుంచి కూడా మరిన్ని పాఠాలు నేర్చుకోగలిగా. పిచ్‌లు చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. నిలకడలేని బౌన్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డా. ఇలాంటి అనుభవం భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుంది. నేను ప్రత్యేకంగా ఎలాంటి బ్యాటింగ్ శైలిని అనుకరించను. కానీ, దూకుడుగా ఆడేందుకు ఇష్టపడతా. అలాగే పరిస్థితులకు అనుగుణంగా నా ఆటతీరును మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటా. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సర్‌ కూడా ఇదే చెబుతుంటారు. సవాళ్లతో కూడిన పిచ్‌లపై ఆడేటప్పుడు నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. లెంగ్త్‌ బంతులను గౌరవించి మిగతా వాటిల్లో పరుగులు రాబట్టాలి’’ అని యశస్వి జైస్వాల్ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని