Virat Kohli: కోహ్లీ అంటే భయమేసి.. బ్యాటర్ల వద్దకు వెళ్లేవాడిని: చాహల్

టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ ఎప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తుంటాడు. ఏ క్రికెటర్‌నైనా ఇట్టే ఆటపట్టిస్తాడు....

Published : 04 Feb 2022 12:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ ఎప్పుడూ సరదాగా నవ్వుతూ నవ్విస్తుంటాడు. ఏ క్రికెటర్‌నైనా ఇట్టే ఆటపట్టిస్తాడు. దీంతో సామాజిక మాధ్యమాల్లోనూ అతడికి మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. అలాంటి చాహల్‌ సైతం ఒకానొక సందర్భంలో తన సారథి విరాట్‌ కోహ్లీకి భయపడ్డానని అంటున్నాడు. చాహల్‌ ఈసారి ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున కాకుండా వేరే జట్టులో ఆడే అవకాశం ఉంది. ఆ ఫ్రాంఛైజీ అతడిని వదిలేయడంతో ఇప్పుడు మెగా వేలంలో పాల్గొనబోతున్నాడు. అయితే, తాజాగా అశ్విన్‌తో యూట్యూబ్‌లో మాట్లాడుతూ ఆర్సీబీలో తన తొలినాళ్ల అనుభవాల గురించి ప్రస్తావించాడు. ఈ సందర్భంగా అప్పుడు కెప్టెన్‌ కోహ్లీ అంటే భయపడేవాడినని గుర్తు చేసుకున్నాడు.

‘నేను 2014లో తొలిసారి ఆర్సీబీ జట్టులోకి వెళ్లినప్పుడు చాలా ఆందోళనగా ఉండేది. మైదానంలో కోహ్లీని చూస్తే భయమేసేది. నేను బౌలింగ్‌ చేసేటప్పుడు అతడు కవర్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ చాలా అగ్రెసివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండేవాడు. అప్పుడు నేను యవకుడిగా ఉండటంతో ఒక్కోసారి వికెట్లు తీయకపోతే నాపై ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. అయితే, నేను వికెట్లు తీసినప్పుడు నా కోపాన్ని ప్రదర్శించడానికి అతడివైపు వెళ్లకుండా బ్యాట్స్‌మెన్‌ వద్దకెళ్లేవాడిని. అలా రెండుమూడు సార్లు జరగడంతో మ్యాచ్‌ రిఫరీ నా గురించి అప్పటి ఆర్సీబీ కోచ్‌ డానియల్‌ వెట్టోరీకి చెప్పాడు. ఆ సమయంలోనే నేనొక మ్యాచ్‌లో ఒక మాట తూలాను. ఆరోజు వెట్టోరీ నా వద్దకొచ్చి ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించాడు. నాలో మంచి నైపుణ్యం ఉన్నా ఇలా చేయడం బాగోలేదన్నాడు. వికెట్లు తీసినప్పుడు నాకు పరిగెత్తాలనిపిస్తే కవర్స్‌వైపు పరిగెత్తమని సలహా ఇచ్చాడు. అక్కడ కెప్టెన్‌ విరాట్‌ ఉంటాడని, దాంతో అతడి వద్దకెళ్లి ఏం చెప్పాలనిపిస్తే అది అతడికే చెప్పమని చెప్పాడు. కోహ్లీ ఏం అనుకోడని నాకు వివరించాడు’ అని చాహల్‌ తన పాత రోజుల్ని గుర్తు చేసుకొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని