Updated : 14/09/2021 09:32 IST

అక్రమంగా వాడారా.. లేదా?

అదే తెలుసుకోవాలనుకుంటున్నాం
పెగాసస్‌పై సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం స్పష్టీకరణ
మధ్యంతర ఉత్తర్వులను రిజర్వ్‌ చేసిన సుప్రీం
సవివర అఫిడవిట్‌ సమర్పించలేం
ప్రభుత్వేతర నిపుణులతో కమిటీ నియమిస్తాం: కేంద్రం
ఈనాడు, దిల్లీ

ఫిడవిట్‌ దాఖలు చేయమని చెప్పడం వెనుక ప్రధాన ఉద్దేశం మనం ఎక్కడున్నామన్నది తెలుసుకోవడానికే. ఇందులో భిన్నమైన అంశాలున్నాయి. ఫోన్‌ను సాంకేతికంగా పరీక్షించకుండా దానిపై నిఘా ఉంచినట్లు చెప్పడం కష్టం, అందువల్ల దాన్ని నిపుణులు పరీక్షించాలంటున్నారు. మరోచోట ఇలాంటి సేవలు (నిఘా) అందరికీ అన్ని కాలాల్లో బహిరంగంగా అందుబాటులో ఉన్నట్లు ఎన్‌ఎస్‌ఓ సంస్థ చెప్పినట్లు పేర్కొన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అవి అందుబాటులో ఉన్నాయని అర్థం. అలాగే దేశంలో నిఘా కోసం చట్టబద్ధమైన ప్రక్రియ ఉందని పేర్కొన్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలుచేసి ఉంటే మనం ఎక్కడున్నామో తెలుస్తుందని మేం భావించాం. మీ మంత్రి చేసిన ప్రకటన ప్రకారం మూడు అంశాలను పరీక్షించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ప్రయోగించిందా? లేదంటే ఇంకెవరైనా ఆ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారా? అన్నది చూడాలి. ఒకవేళ ప్రభుత్వమే చేసి ఉంటే నిబంధనలను అనుసరించారా? లేదా? అన్నది పరీక్షించాల్సి ఉంటుంది. మీరు అఫిడవిట్‌ దాఖలుచేసి ఉంటే విషయం ఏ స్థాయిలో ఉందన్నది తెలిసి ఉండేది. కానీ ఇప్పుడు పిటిషనర్లు సమర్పించిన సమాచారం ఆధారంగా ఈ మూడు అంశాలను పరిశీలించాల్సి వస్తోంది.

- సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ (సొలిసిటర్‌ జనరల్‌ మెహతాను ఉద్దేశించి)


ట్టప్రకారం అనుమతించే మార్గాల్లో కాకుండా, ఇతర మార్గాల్లో ఎవరిపైనైనా నిఘా సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించారా? లేదా? అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జాతీయ భద్రత, దేశ ప్రయోజనాలు, రక్షణ అంశాలకు సంబంధించిన ఏ విషయాన్నీ తాము కోరడం లేదని, ఒకవేళ పిటిషనర్లు అలాంటి విషయాలు అడిగినా తాము అంగీకరించబోమని న్యాయమూర్తులు పేర్కొన్నారు. పలువురి ఫోన్లపై నిఘాపెట్టి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న పెగాసస్‌ వ్యవహారం మీద దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ నిర్వహించి, ఉత్తర్వులను రిజర్వు చేసింది. కోర్టు ఆదేశిస్తే నిపుణుల కమిటీతో విచారణ చేయిస్తాం తప్పితే, ఫోన్లపై నిఘా ఉంచడానికి పెగాసస్‌ కానీ, ఇతరత్రా ఏదైనా సాఫ్ట్‌వేర్‌ కానీ ఉపయోగిస్తోందా? లేదా? అని చెప్పే అఫిడవిట్‌ దాఖలుకు కేంద్రం సుముఖంగా లేదని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మరోసారి తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో తదుపరి ఏం చేయాలన్న దానిపై 2-3 రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని సీజేఐ జస్టిస్‌ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమాకోహ్లిల ధర్మాసనం స్పష్టంచేసింది. ఒకవేళ ఈలోపు అఫిడవిట్‌ దాఖలుచేసే విషయంలో కేంద్రం మనసు మార్చుకుంటే ఆ విషయాన్ని ముందస్తుగా తెలియజేయాలని సూచిస్తూ విచారణను ముగించింది. ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించే అంశాన్ని ఒక్కటే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు.

ఆ అంశాలను కోరబోం
‘జాతీయ భద్రతాంశాల విషయంలో ఎలాంటి ఆసక్తీ లేదని మేం పదేపదే చెబుతున్నాం. చట్టప్రకారం అనుమతించే మార్గాల్లో కాకుండా, ఇతర మార్గాల్లో నిఘా సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించారా? లేదా? అన్నది తెలుసుకోవడం వరకే మేం పరిమితం. కొన్ని స్పైవేర్‌, మాల్‌వేర్లు వాట్సప్‌ వినియోగదారులపై ప్రభావం చూపిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు కేంద్రమంత్రే 2019 నవంబర్‌లో పార్లమెంటుకు చెప్పారు’ అని సొలిసిటర్‌ జనరల్‌(ఎస్‌జీ)కి జస్టిస్‌ రమణ గుర్తుచేశారు. ‘‘ఈ విషయాలను ప్రజా బాహుళ్యంలో పెట్టకూడదనుకుంటున్నట్లు మీరు పదేపదే చెబుతున్నారు. ఆ విషయంపై మాకూ ఆసక్తిలేదని ఇదివరకే మీకు విస్పష్టంగా చెప్పాం. నిపుణుల కమిటీ ఏర్పాటుచేస్తే అదికూడా ఈ విషయాలన్నీ పరీక్షించాల్సి ఉంటుంది. నివేదికను మా ముందుంచాల్సి వస్తుంది. అప్పుడైనా అది ప్రజా బాహుళ్యంలోకి వస్తుంది కదా? దాన్ని మనం దాచిపెట్టలేం కదా’’ అని జస్టిస్‌ రమణ అన్నారు. 

సుప్రీం జడ్జీతో విచారణ జరపాలి
పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ- ప్రభుత్వ వాదనతో ఏకీభవించకుండా మొత్తం వ్యవహారంపై సిట్‌ ద్వారా గానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో గానీ విచారణ జరిపించాలని కోరారు. సుమారు 1.40 గంటలపాటు జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌సిబల్‌, శ్యాం దివాన్‌, రాకేష్‌ ద్వివేది, మీనాక్షి అరోరా, కొలిన్‌ గొన్‌సాల్వెస్‌లు వాదనలు వినిపించారు. ‘‘అనుమానాల నివృత్తి కోసం ప్రభుత్వానికి అతీతమైన నిపుణులతో కమిటీ ఏర్పాటుచేసి విచారించడానికి సిద్ధంగా ఉన్నాం. ఫోన్లు ట్యాప్‌ అయ్యాయని ఆరోపించేవారు ఆ కమిటీ ముందుకెళ్లి ఫిర్యాదుచేసి వివరాలు అందించవచ్చు. అది పూర్తి పారదర్శకంగా విచారణ జరిపి కోర్టుకు నివేదిక అందిస్తుంది. ఒకవేళ మేం ఫలానా సాఫ్ట్‌వేర్‌ వాడుతున్నామని చెబితే దానిని ఎదుర్కొనేలా ఉగ్రవాదులు అప్రమత్తమవుతారు’’ అని సొలిసిటర్‌ జనరల్‌  తుషార్‌ మెహతా విన్నవించారు.

గోప్యత వరకు స్పష్టత ఇవ్వొచ్చు
‘‘రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత గోప్యత హక్కులోకి ప్రభుత్వం చొరబడినట్లు పౌరులు ఆరోపిస్తున్నారు. అంతవరకు మీరు స్పష్టత ఇవ్వొచ్చు’’ అని మెహతాను ఉద్దేశించి జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. ఎస్‌జీ స్పందిస్తూ.. ‘‘అనధికార నిఘా ఉండదు. ఎవరికైనా అనుమానం ఉంటే కేంద్రం ఏర్పాటుచేసే నిపుణుల కమిటీకి చెప్పొచ్చు. కమిటీ అధ్యయనం చేసి నివేదికను సుప్రీంకోర్టు ముందుంచుతుంది. ఎవరి వ్యక్తిగత గోప్యతకైనా భంగం కలిగి ఉంటే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ఇందుకోసమే కమిటీ ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది’’ అని పునరుద్ఘాటించారు.

..అనుమతించకూడని కార్యం కాదు
ప్రభుత్వం నియమించే కమిటీని అనుమానించేందుకు కారణాల్లేవని మెహతా అన్నారు. ‘‘ప్రజల హక్కుల సంరక్షణ, జాతీయ భద్రతాంశాల్లో జోక్యం చేసుకోవడం మధ్య స్వల్పతేడా మాత్రమే ఉంది. నిఘా ఉంచడం అన్నది అనుమతించకూడని కార్యమేమీ కాదు. అన్ని సాంకేతిక పరిజ్ఞానాలనూ సద్వినియోగం, దుర్వినియోగం చేయొచ్చు. ఎవరికైనా అనుమానాలు ఉంటే కమిటీకి చెప్పండి. అందులోని నిపుణులకు ప్రభుత్వంతో సంబంధాలేమీ ఉండవు. నివేదిక నేరుగా కోర్టు ముందుకే వస్తుంది’’ అని పేర్కొన్నారు.


ప్రభుత్వ ప్రవర్తనే ప్రశ్నార్థకమన్న పిటిషనర్లు

పిటిషనర్లు ఎన్‌.రామ్‌, శశికుమార్‌ల తరఫున కపిల్‌సిబల్‌ వాదనలు వినిపించారు. ‘ఏ అంశంలోనైనా కోర్టుకు వాస్తవాలను వెల్లడించడం ప్రభుత్వ విధి అని 2011లో రాంజెఠ్మలానీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చట్టవిరుద్ధంగా ప్రజలపై నిఘా ఉంచినట్లు తెలిసినా చర్యలు తీసుకోకపోవడాన్ని బట్టి ఇక్కడ ప్రభుత్వ ప్రవర్తనే ప్రశ్నార్థకంగా ఉంది’ అని చెప్పారు. ప్రభుత్వమే తప్పు చేస్తున్నట్లు ఆరోపణలున్నప్పుడు అది ఏర్పాటుచేసే కమిటీని ఎందుకు అనుమతించాలని ప్రశ్నించారు. ఇతర పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ- ఫోన్ల నిఘాను ప్రభుత్వం విస్పష్టంగా ఖండించడం లేదన్నారు. నిఘా వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలగడమే కాకుండా భావ ప్రకటన స్వేచ్ఛపై దారుణమైన ప్రభావం చూపుతుందన్నది విస్పష్టమని పేర్కొన్నారు. ఫోన్లు ట్యాప్‌ అయినట్లు అనుమానం ఉన్నవారు తమ పరికరాలను నిపుణుల కమిటీకి అప్పగించవచ్చని చెప్పడం అనుమానాస్పదమైన ప్రక్రియ అని చెప్పారు. కమిటీ వేసుకొని, విచారించుకోవడానికి ప్రభుత్వాన్ని అనుమతించకూడదన్నారు.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని