Telangana Highcourt: హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం సీజేగా ఉన్న జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మను దిల్లీ హైకోర్టుకు

Updated : 18 May 2022 06:32 IST

ప్రస్తుత సీజే జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ దిల్లీ హైకోర్టుకు బదిలీ

సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు

ఈనాడు, దిల్లీ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం సీజేగా ఉన్న జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మను దిల్లీ హైకోర్టుకు బదిలీచేయాలని ప్రతిపాదించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం దేశంలోని వివిధ హైకోర్టుల్లో సేవలందిస్తున్న అయిదుగురు న్యాయమూర్తులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని, ఒక ప్రధాన న్యాయమూర్తిని బదిలీచేయాలని నిర్ణయించింది. ఆమేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు పంపింది.

దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌ మార్చి 12న పదవీ విరమణ చేయడంతో ఖాళీ అయిన స్థానంలోకి తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మను బదిలీచేయాలని కొలీజియం  ప్రతిపాదించింది. ఆయన స్థానంలో ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో సీనియారిటీ పరంగా రెండోస్థానంలో ఉన్న జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌కు పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది.

గువాహటి మాతృహైకోర్టుగా ఉన్న జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ తెలంగాణ హైకోర్టులో 2021 అక్టోబరు 22 నుంచి సేవలందిస్తున్నారు. 1964 ఆగస్టు 2న గువాహటిలో జన్మించిన ఆయన అక్కడే ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేశారు. 1991 మార్చి 20న న్యాయవాదిగా పేరు నమోదుచేసుకున్నారు. 2010 సెప్టెంబరు 6న సీనియర్‌ అడ్వొకేట్‌ హోదా పొందారు. 2011 జులై 21న అస్సాం అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా నియమితులయ్యారు. 2011 అక్టోబరు 17న గువాహటి హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులై 2013 మార్చి 20న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 అక్టోబరు 3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. తర్వాత 2021 అక్టోబరు 22న తెలంగాణ హైకోర్టుకు వచ్చారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గానూ ఉన్నారు. ఈయన తండ్రి సుచేంద్రనాథ్‌ భూయాన్‌ అస్సాం అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేశారు.

* 2021 అక్టోబరు 11న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు  చేపట్టిన జస్టిస్‌ సతీష్‌చంద్రశర్మ మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో 1961 నవంబరు 30న జన్మించారు. 2008 జనవరి 18 నుంచి 2021 జనవరి 3 వరకు మధ్యప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2021 జనవరి 4 నుంచి ఆగస్టు 30వరకు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. ఆగస్టు 31 నుంచి అక్టోబరు 10 వరకు అదే హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి, ఆ తర్వాత పదోన్నతిపై తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని