Andhra News: అగ్నికీలల్లో అమలాపురం

అడుగడుగునా ఉద్రిక్తత.. అంతటా ఉత్కంఠ.. ఓవైపు లాఠీలు ఝుళిపించిన పోలీసులు.. ప్రతిగా రాళ్ల దాడులకు దిగిన ఆందోళనకారులు.. మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే సతీష్‌ నివాసాలకు నిప్పు... ఏపీలోని కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా రణరంగంగా మారింది

Updated : 25 May 2022 14:44 IST

కోనసీమ జిల్లా పేరు మార్చొద్దంటూ  చేపట్టిన ఆందోళన హింసాత్మకం
ఏపీ మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే సతీష్‌ నివాసాలకు నిప్పు
పోలీసుల లాఠీఛార్జి..నిరసనకారుల రాళ్ల దాడి
ఎస్పీ సహా వందల మందికి గాయాలు  
గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు

ఈనాడు, అమలాపురం

అడుగడుగునా ఉద్రిక్తత.. అంతటా ఉత్కంఠ.. ఓవైపు లాఠీలు ఝుళిపించిన పోలీసులు.. ప్రతిగా రాళ్ల దాడులకు దిగిన ఆందోళనకారులు.. మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే సతీష్‌ నివాసాలకు నిప్పు... ఏపీలోని కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా రణరంగంగా మారింది. జిల్లా పేరును డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చొద్దంటూ ‘కోనసీమ జిల్లా సాధన సమితి’ చేపట్టిన ఆందోళన హింసకు దారితీసింది. సెక్షన్‌ 144, 30 పోలీస్‌ యాక్టు ఆంక్షలను లెక్కచేయని ఆందోళనకారులు నిరసన తెలపడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అమలాపురం వీధులు ఆందోళనకారులతో నిండి పరిస్థితి చేయిదాటింది. సామాన్యులు, ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉరుకులు పరుగులు తీశారు.

అదుపు తప్పిందిలా...
నెలన్నర కిందట జిల్లాల విభజనలో భాగంగా కోనసీమ జిల్లాను ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కోనసీమ పేరును కొనసాగించాలనే డిమాండ్లు మళ్లీ తెరమీదకొచ్చాయి. ఇప్పటికే వందల సంఖ్యలో వినతులు కలెక్టరు కార్యాలయానికి చేరాయి. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ ‘కోనసీమ జిల్లా సాధన సమితి’ చలో అమలాపురానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచే భారీగా మోహరించిన పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. వీటిని ఛేదించుకుని ఆందోళనకారులు భారీ సంఖ్యలో గడియార స్తంభం దగ్గరకు చేరుకున్నారు. ‘కోనసీమ పేరే ముద్దు.. మరే పేరూ వద్దు’ అని నినదిస్తూ కలెక్టరేట్‌ వైపు దూసుకెళ్లారు. వారిని నియంత్రించే క్రమంలో పోలీసులు లాఠీలు ఝుళిపించారు. రెచ్చిపోయిన ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వారు. రాళ్ల దాడి నుంచి తప్పించుకోవడానికి పోలీసులు పరుగులు పెట్టారు. ఉదయం నుంచి పరిస్థితి పోలీసుల అదుపులోనే ఉన్నట్లు కనిపించినా మధ్యాహ్నానికి అదుపుతప్పింది.

* నిరసనకారులు కలెక్టరేట్‌కు రాకుండా కట్టడి చేయడంలో పోలీసుల ప్రయత్నాలు ఫలించలేదు. లాఠీఛార్జి, రాళ్లు రువ్వుకునే క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. ఎస్పీ సుబ్బారెడ్డి, మరో పోలీసు అధికారి, ఓ గన్‌మెన్‌, మహిళా కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. డీఎస్పీ వై.మాధవరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు, ఆందోళనకారులు 100 మందికి పైగా గాయపడ్డారు. కొందరు మీడియా ప్రతినిధులకూ గాయాలయ్యాయి.

భారీగా మోహరించినా...
కోనసీమ జిల్లా పేరును డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రభుత్వం అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు నెలరోజుల గడువిచ్చింది. వినతులు కలెక్టర్‌ కార్యాలయానికి అందించే వెసులుబాటు కల్పించింది. ఆందోళనలు నిర్వహించకుండా 144 సెక్షన్‌, 30 పోలీసు యాక్టు అమల్లోకి తెచ్చారు. వాస్తవానికి సోమవారం నాటి స్పందన కార్యక్రమం రోజునే ఉద్రిక్తతకు అవకాశం ఉందని భావించిన పోలీసులు భారీగా మోహరించారు. ఆంక్షల మధ్య కలెక్టరేట్‌ లోపలికి సందర్శకులను పరిమితంగా అనుమతించారు. మంగళవారం కోనసీమ ఉద్యమ సమితి చలో అమలాపురానికి సిద్ధమైంది. దీనిని ముందే గ్రహించిన పోలీసులు ప్రధాన కూడళ్లలో మోహరించారు. ఉదయంనుంచి తనిఖీలు ముమ్మరం చేశారు. అమలాపురంలోని ఎర్రవంతెన, నల్లవంతెన, ఈదరపల్లి, కొంకాపల్లి, గడియార స్తంభం, హైస్కూల్‌ సెంటర్‌ తదితర ప్రాంతాల్లో పోలీస్‌ పికెట్లు ఏర్పాటు చేశారు. కోనసీమ ఎస్పీ సుబ్బారెడ్డి, ఏఎస్పీ లతామాధురి, డీఎస్పీ మాధవరెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు చేశారు. ఆందోళనకారులు వచ్చే మార్గాలను నిలువరించే ప్రయత్నం చేశారు.  


 

మేం ఉగ్రవాదులం కాదు...
ఆందోళనను నిలువరించేందుకు పోలీసులు నల్లవంతెనపై రహదారికి అడ్డంగా లారీలు, ట్రాక్టర్లను పెట్టారు. అడ్డు తొలగించకపోవడంతో ఆందోళనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మేమేమీ ఉగ్రవాదులం, మావోయిస్టులం కాదు.. ప్రభుత్వ నిబంధనలకు లోబడే అభ్యంతరాలను తెలిపేందుకు కలెక్టరేట్‌కు వెళుతున్నామనీ, ఇదెక్కడి న్యాయమంటూ నిలదీశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.


మంటల్లో మంత్రి, ఎమ్మెల్యే నివాసాలు

ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని తరలించడానికి సిద్ధంగా ఉంచిన వాహనాలపై పలువురు దాడికి దిగారు. కలెక్టరేట్‌ ఆవరణలో ఆందోళనకారులను తరలించేందుకు తెచ్చిన ప్రైవేటు కళాశాల బస్సును ధ్వంసం చేసి.. నిప్పంటించారు. కొందరు కలెక్టరేట్‌ లోపలికి దూసుకెళ్లారు. మరోవైపు ఎర్రవంతెన దగ్గర పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఆగ్రహించిన ఆందోళనకారులు రెండు ఆర్టీసీ బస్సులకు నిప్పంటించారు. అమలాపురంలో ఎస్బీఐ కాలనీలో మంత్రి పినిపే విశ్వరూప్‌ క్యాంపు కార్యాలయం, నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టి నిప్పంటించారు. ముఖ్యమంత్రి డౌన్‌డౌన్‌.. మంత్రి డౌన్‌ డౌన్‌.. జై కోనసీమ.. జైజై కోనసీమ అంటూ నినదించారు. మంత్రి భార్య, పిల్లలను ఆందోళనకారులు వచ్చేకంటే ముందే పోలీసులు సురక్షితంగా వేరే వాహనంలో పంపించారు. అమలాపురంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఉన్న ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ నివాసం దగ్గరకు చేరుకున్న ఆందోళనకారులు రాళ్లు రువ్వి.. ధ్వంసం చేసి నిప్పంటించారు. అక్కడా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆ సమయంలో సతీష్‌ కుమార్‌, కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నారు. వారిని రక్షించే క్రమంలో పోలీసులు ఐదు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు. మరోవైపు భట్నవిల్లిలో నిర్మాణంలో ఉన్న మంత్రికి చెందిన మరో ఇంటికి నిప్పుపెట్టారు.


పోలీసులకు ముచ్చెమటలు...

* నిరసనకారులు క్షణక్షణానికీ తమ వ్యూహాలు మారుస్తూ పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పోలీసులు వ్యవహరించిన తీరు, వారి ఏర్పాట్లను నిశితంగా పరిశీలించిన ఆందోళనకారులు మధ్యాహ్నం దాకా స్తబ్దుగా ఉండి ఒక్కసారిగా వివిధ మార్గాల నుంచి వేలాదిగా రహదారులపైకి వచ్చారు.
* మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్‌ వైపు నుంచి వేల మంది యువత ప్రదర్శనగా గడియార స్తంభం కూడలికి చేరుకున్నారు. వీరిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆందోళనకారులను నిలువరించేందుకు కొందరు పోలీసులు లాఠీఛార్జికి దిగారు. గడియార స్తంభం కూడలి నుంచి నల్లవంతెన.. అక్కడి నుంచి కలెక్టరేట్‌ వైపు ఆందోళనకారులు దూసుకెళ్లారు. ఈక్రమంలో అమలాపురం పట్టణం రణరంగాన్ని తలపించింది. మంగళవారం రాత్రి అమలాపురం చేరుకున్న... ఏలూరు రేంజీ డీఐజీ పాలరాజు, కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నుంచి కోనసీమకు హుటాహుటిన అదనపు బలగాల్ని రప్పించారు.

 


కొందరు వెనుక ఉండి నడిపిస్తున్నారు
అమలాపురం ఘటనపై హోంమంత్రి తానేటి వనిత

ఈనాడు, అమరావతి: కోనసీమలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు... కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నిస్తున్నాయని హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ‘20 మంది పోలీసులను దారుణంగా రాళ్లతో కొట్టి గాయపరిచారు. ప్రైవేటు స్కూల్‌ బస్సును తగలబెట్టారు. పోలీసులపై దాడిని ఖండిస్తున్నాం. వెనుక కొంత మంది ఉండి ఇదంతా నడిపిస్తున్నట్లు అక్కడి చర్యలు కనిపిస్తున్నాయి. వారు పార్టీల మనుషులైనా, సంఘ విద్రోహశక్తులైనా చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు. ‘కోనసీమ జిల్లాను అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చాలని అక్కడి ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలూ చేసిన డిమాండు మేరకే పేరు మార్చాం. దీన్ని వ్యతిరేకించడం, అల్లర్లు చేయడం బాధాకరం’ అని వ్యాఖ్యానించారు.


ముమ్మాటికీ పోలీసు, ప్రభుత్వ వైఫల్యమే
తెదేపా అధినేత చంద్రబాబు

కోనసీమలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు.. ముమ్మాటికీ పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమే అని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సున్నితమైన ఈ అంశంలో హోంమంత్రి తెదేపాపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని ఆయన ఖండించారు. ప్రశాంతమైన కోనసీమలో హింసాత్మక ఘటనలు దురదృష్టకరమని, ప్రజలు సంయమనం పాటించాలని, ప్రశాంతత నెలకొల్పేందుకు సహకరించాలని ఒక ప్రకటనలో కోరారు.


బీజం వేసిందెవరో అందరికీ తెలుసు
జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌

అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసిందెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. బాధ్యత కలిగిన హోం మంత్రి ప్రకటన చేస్తూ.. జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నానని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘వైకాపా ప్రభుత్వ లోపాలను, శాంతిభద్రతల పరిరక్షణలో అసమర్థత, వైకాపా వైఫల్యాలను జనసేనపై రుద్దకండి’ అని సూచించారు. ‘అమలాపురంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. మహనీయుడు అంబేడ్కర్‌ పేరును వివాదాల్లోకి తీసుకొచ్చినందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అమలాపురం ఘటనను ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో ఖండించాలి. ప్రజలందరూ సంయమనం పాటించి శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాలి’ అని కోరారు.


అంబేడ్కర్‌ పేరును వ్యతిరేకించడం సిగ్గుచేటు
ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

ఈనాడు, హైదరాబాద్‌: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్‌ అంబేడ్కర్‌ పేరును ఏపీలోని కోనసీమ జిల్లాకు పెడితే వ్యతిరేకించడం సిగ్గుచేటని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే సతీష్‌ ఇళ్ల మీద దాడి హేయమని తెలిపారు. కోనసీమలో విధ్వంస ఘటనల వెనుక ఉన్న అరాచక శక్తులను కఠినంగా శిక్షించాలని ఆయన మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ‘మహనీయుడైన అంబేడ్కర్‌ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడాన్ని సహించలేని వారు విధ్వంసాలు సృష్టించడం దారుణం. ఆయన పేరు పెట్టాలని అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు కోరిన మీదటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని వ్యతిరేకించడం, ఉద్యమాలు చేయడం వెనక భయంకరమైన కుట్ర ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు.



 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని