ఉదాసీనత అసలే వద్దు

ఒక ప్రైవేటు ఉద్యోగి(40)కి రెండురోజులు జ్వరం వచ్చింది. 101-102 డిగ్రీలకు తగ్గడం లేదు. యాంటిజెన్‌తో పాటు ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష కూడా చేయించుకున్నాడు. రెండింటిలోనూ ‘నెగెటివ్‌’ అనే ఫలితం వచ్చింది. హమ్మయ్య.. కొవిడ్‌ లేదని ఊపిరి పీల్చుకున్నాడు. సాధారణ జ్వరం మాత్రలు వాడుతూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నాడు.

Updated : 27 Apr 2021 07:45 IST

ఆర్‌టీపీసీఆర్‌ సామర్థ్యం 70-80 శాతమే
లక్షణాలు ఉన్నా నెగెటివ్‌ వస్తే వైరస్‌ లేదని భావించొద్దు
వారంలోనే పరిస్థితి తీవ్రం కావచ్చు
ఆ పరీక్షను పూర్తిస్థాయిలో నమ్మడానికి వీల్లేదంటున్న నిపుణులు

ఒక ప్రైవేటు ఉద్యోగి(40)కి రెండురోజులు జ్వరం వచ్చింది. 101-102 డిగ్రీలకు తగ్గడం లేదు. యాంటిజెన్‌తో పాటు ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష కూడా చేయించుకున్నాడు. రెండింటిలోనూ ‘నెగెటివ్‌’ అనే ఫలితం వచ్చింది. హమ్మయ్య.. కొవిడ్‌ లేదని ఊపిరి పీల్చుకున్నాడు. సాధారణ జ్వరం మాత్రలు వాడుతూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నాడు. వారం గడిచేసరికి జ్వరం తగ్గకపోగా.. ఊపిరి తీసుకోవడం కష్టమైంది. వెంటనే ఆసుపత్రిలో చేరాడు. అక్కడ పరీక్షిస్తే రక్తంలో ఆక్సిజన్‌ 87-90 శాతం మధ్య చూపిస్తోంది. అక్కడ కూడా ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష చేయగా నెగెటివ్‌గానే తేలింది. అనుమానం వచ్చి సీటీ స్కాన్‌ చేయగా.. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ బయటపడింది.

ఆర్‌టీ పీసీఆర్‌.. కొవిడ్‌ నిర్ధారణకు నమ్మకమైన, ఉత్తమమైన పరీక్ష ఇది. అందులో అనుమానం అక్కర్లేదు. ఈ పరీక్ష చేస్తే కరోనా వైరస్‌ సోకిందా? లేదా? అనేది స్పష్టమవుతోంది. అయితే కేవలం ఆర్‌టీ పీసీఆర్‌ చేసినంత మాత్రాన అన్నిసార్లూ కొవిడ్‌ పూర్తిగా తెలిసిపోతుందనుకోవడానికి వీల్లేదంటున్నారు నిపుణులు. ఇందులో నెగెటివ్‌ వస్తే.. ఇక వైరస్‌ సోకలేదని కచ్చితంగా చెప్పలేమంటున్నారు. ఎందుకంటే ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష సామర్థ్యం 70-80 శాతం మాత్రమే. మిగిలిన 20-30 శాతంలో వైరస్‌ను గుర్తించలేకపోవచ్చు. జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తున్నా.. ఆర్‌టీ పీసీఆర్‌లో నెగెటివ్‌ వచ్చిందనే కారణంతో ఎక్కువమంది ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. తమకు వైరస్‌ సోకలేదని భావిస్తూ.. లక్షణాలున్నా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యం మరింత క్షీణించిన తర్వాత అప్పుడు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ఇటువంటి వారిలో 5 నుంచి 7 రోజుల్లోనే వైరస్‌ తీవ్ర రూపం దాల్చుతోంది. అందుకే లక్షణాలు కనిపిస్తున్నప్పుడు.. ఆర్‌టీ పీసీఆర్‌ నెగెటివ్‌ను పూర్తిస్థాయిలో విశ్వసించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. సీటీ స్కాన్‌కు వెళ్లడం మంచిదని చెబుతున్నారు.

ఆర్‌టీ పీసీఆర్‌ నెగెటివ్‌ వచ్చినా.. ఎప్పుడు ప్రమాదకరం?
* జ్వరం: మూడు రోజులకు పైగా జ్వరం తీవ్రంగా వస్తుంటే అనుమానించాలి. అంటే పారాసెటమాల్‌ వేసుకుంటున్నా కూడా శరీరం స్పందించకుండా.. 101 డిగ్రీలు ఆపైన జ్వరం కనిపిస్తుంటే వెంటనే ఆసుపత్రిలో చేరాల్సిందే.

 

* ఆక్సిజన్‌: పల్స్‌ ఆక్సీమీటర్‌లో రక్తంలో ఆక్సిజన్‌ శాతం 94 శాతం కంటే తక్కువగా చూపిస్తుంటే కొవిడ్‌ కావచ్చేమోనని సందేహించాలి. రెండు మూడు గంటల్లో వేర్వేరుగా పరిశీలించినా కూడా.. 94 శాతం కంటే తక్కువగా చూపిస్తుంటే అది ప్రమాదానికి సంకేతమే. అది కొవిడా? కాదా? అనేది తర్వాత సంగతి. ముందు అత్యవసరంగా వైద్యసేవల కోసం ఆసుపత్రికి వెళ్లాల్సిందే.
 

*రక్త పరీక్షలు: జ్వరం తగ్గడం లేదు. రక్తంలో ఆక్సిజన్‌ శాతం మాత్రం 94 కంటే పైనే చూపిస్తుంది. ఇలాంటి సమయాల్లో ఎల్‌డీహెచ్‌, ఫెరిటిన్‌, సీఆర్‌పీ తదితర కొన్ని రక్తపరీక్షలు చేయించాలి. ఇవి రక్తంలో ఇన్‌ఫ్లేమటరీని సూచిస్తాయి. ఈ మూడింటిలో ఫలితాలు సాధారణం కంటే రెట్టింపు గనుక నమోదైతే.. వెంటనే అత్యవసరంగా వైద్యసేవలు పొందాలి.


*ఇటువంటి సమయాల్లో ఎవరో ఇచ్చిన సలహా మేరకు ఇంట్లోనే ఉండిపోవద్దు. సొంతంగా చికిత్స కూడా పొందొద్దు. ఈ పరిస్థితుల్లో వైద్యుని పాత్ర చాలా ముఖ్యమనేది గుర్తుంచుకోవాలి.

సీటీ స్కాన్‌  ఎప్పుడు అవసరం?

తక్కువ కాలంలో.. ఎక్కువ జ్వరం ఉండి, ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్‌కు గురిచేసే రోగం కొవిడ్‌. జ్వరం ఉండి కూడా ఆర్‌టీపీసీఆర్‌ నెగెటివ్‌ వచ్చి, కొవిడ్‌ కావచ్చనే సందేహం ఉన్నప్పుడు నిర్ధారణ కోసం సీటీ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ సోకిందా? లేదా? అనేది తెలిసిపోతుంది. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఆక్సిజన్‌ శాతం బాగా పడిపోతున్నప్పుడు.. శ్వాసకోశాలు ఎంత ఎక్కువ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాయనే అంచనాకు ఉపయోగపడుతుంది. ఆర్‌టీ పీసీఆర్‌ పాజిటివ్‌ ఉన్నప్పుడు వైద్యుని సలహా లేకుండా సీటీ స్కాన్‌ చేయొద్దు. ఎందుకంటే అవసరం లేకున్నా సీటీ స్కాన్‌ చేయించుకుంటే.. ఆర్థిక భారంతో పాటు 100-800 ఎక్స్‌రేలకు సమానమైన రేడియేషన్‌ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకే ఇది అవసరమో కాదో వైద్యుడే నిర్ణయించాలి. కొవిడ్‌కు సీటీ స్కాన్‌పై ఆధారపడి ఏ వైద్యుడు కూడా చికిత్స అందించరని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఫలితాలపై ఆందోళన అనవసరం

ఆర్‌టీ పీసీఆర్‌, సీటీ స్కాన్‌ చేయించిన తర్వాత వచ్చే ఫలితంపైనా ఎక్కువమంది రోగులు ఆందోళన చెందుతుంటారు. వీటి గురించి అసలు భయాందోళనలు చెందొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఆ ఫలితాలు ఏం చెబుతున్నాయో చూద్దాం...
 

* ఆర్‌టీ పీసీఆర్‌లో సీటీ వాల్యూ: ‘సైకిల్‌ థ్రెషోల్డ్‌’ (సీటీ). ఇది మన శరీరంలోని వైరల్‌ లోడ్‌ గురించి చెబుతుంది. లోడ్‌ ఎక్కువుంటే సీటీ వ్యాల్యూ తక్కువగా ఉంటుంది. లోడ్‌ తక్కువగా ఉంటే సీటీ వ్యాల్యూ ఎక్కువగా ఉంటుంది. అయితే వైద్యులు సీటీ వ్యాల్యూను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించరని చెబుతున్నారు నిపుణులు. చికిత్సకు కావాల్సింది.. పాజిటివ్‌, నెగెటివ్‌ అంతే!
* సీటీ స్కాన్‌లో కొరాడ్స్‌లో గణాంకాలు: ఊపిరితిత్తుల్లో వచ్చిన ఇన్‌ఫెక్షన్‌కు స్కోరింగ్‌ ఇవ్వడం లాంటిది ఈ ‘కొరాడ్‌’. శ్వాసకోశాల్లో ఇన్‌ఫెక్షన్‌ మచ్చ (షేడ్‌) బట్టి అది కొవిడ్‌ కావచ్చా? కాదా? అనేది అంచనా వేసి చెబుతారు.
* సీటీ సివియారిటీ స్కోర్‌ ఇన్‌ సీటీ స్కాన్‌ (సీటీ ఎస్‌ఎస్‌): ఇది అన్నింటి కంటే ముఖ్యమైంది. ఇది వైరస్‌ తీవ్రతను సూచిస్తుంది. చికిత్స మొదలు పెట్టిన తర్వాత 5-7 రోజుల వరకూ తీవ్రత ఉంటుంది. చికిత్స అనంతరం కొంత పెరుగుతుంది. అది సీటీ స్కాన్‌లో కనిపిస్తుంది. అయితే సీటీ స్కాన్‌లో తగ్గే వరకూ ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు.

లక్షణాలు కనిపిస్తుంటే ఆలస్యం చేయొద్దు
-డాక్టర్‌ వి.జగదీశ్‌కుమార్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌, ఏఐజీ

ఆర్‌టీ పీసీఆర్‌ నెగెటివ్‌ వచ్చినా కొవిడ్‌ బారినపడిన వారి ఆరోగ్యం త్వరగా క్షీణిస్తోంది. ఎందుకంటే నెగెటివ్‌ అనే కారణంతో వారు చికిత్సలో జాప్యం చేస్తుంటారు. ఆర్‌టీ పీసీఆర్‌ నెగెటివ్‌ వచ్చి, లక్షణాలు కనిపిస్తుంటే దాన్ని పూర్తి నెగెటివ్‌గా భావించకూడదు. వెంటనే వైద్యసేవలకు సంప్రదించాల్సిందే. అలాగే సీటీ స్కాన్‌ గణాంకాలపైనా అనవసర ఆందోళన అక్కర్లేదు. ఆర్‌టీ పీసీఆర్‌ పాజిటివ్‌ ఉంటే సీటీ స్కాన్‌తో పని లేదు.
 

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని