దినదిన గండం... నూరేళ్ల భవిష్యత్తు

పెచ్చులూడుతున్న పైకప్పులు... నెర్రెలిచ్చిన గోడలు... ఎక్కడ చూసినా ఇవే పరిస్థితులు. సర్కారు బడులు శిథిలావస్థకు చేరాయి. అక్కడ చదివే పిల్లలకు గండంగా మారాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో పిల్లలు ఆ భవనాల్లోనే

Updated : 20 Aug 2022 05:39 IST

అధ్వాన స్థితిలో ప్రభుత్వ పాఠశాలలు  
చిన్నారుల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు

ఈనాడు యంత్రాంగం: పెచ్చులూడుతున్న పైకప్పులు... నెర్రెలిచ్చిన గోడలు... ఎక్కడ చూసినా ఇవే పరిస్థితులు. సర్కారు బడులు శిథిలావస్థకు చేరాయి. అక్కడ చదివే పిల్లలకు గండంగా మారాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో పిల్లలు ఆ భవనాల్లోనే బిక్కుబిక్కుమంటూ చదువుకుంటున్నారు. ఇటీవల రోజుల తరబడి వర్షాలు కురవడంతో నాని ఉన్న భవనాలు మరింత ప్రమాదకరంగా తయారయ్యాయి. అయినా ప్రభుత్వ యంత్రాంగంలో ఏమాత్రం కదలిక ఉండడం లేదు. కనీసం జాగ్రత్తలూ తీసుకోవడం లేదు. తాజాగా ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాల వరండా పైకప్పు కూలి ముగ్గురు విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ పాఠశాలలను ‘ఈనాడు’ బృందం పరిశీలించగా వందలాది బడులు శిథిలావస్థకు చేరడం కళ్లకు కట్టింది. ప్రభుత్వం 2021 బడ్జెట్‌లోనే ప్రత్యేక పథకం కింద బడుల రూపురేఖలు మారుస్తామని ప్రకటించినా ఇప్పటివరకు మార్పు కనిపించడం లేదు. ‘మన ఊరు- మన బడి’ పథకం కింద 26,072 పాఠశాలల్లో రూ.7,289 కోట్లతో సౌకర్యాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. శిథిలావస్థలో ఉన్న భవనాల స్థానంలో కొత్తవాటిని నిర్మించాలని నిర్ణయించింది. దీనికోసం మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 9,123 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఎంపిక చేసింది. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు కొద్ది నెలల క్రితం కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేశారు. అయితే సర్కారు నుంచి నిధులు విడుదలవుతాయో లేదోనన్న భయంతో పాఠశాల విద్యాకమిటీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పనులు చేపట్టేందుకు జంకుతున్నారు. దీంతో 6,566 బడుల్లోనే పనులు ప్రారంభమయ్యాయని విద్యాశాఖ చెబుతోంది.


నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పట్టణంలోని ఇందిరాదేవి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పైకప్పు దుస్థితిని చూపుతున్న విద్యార్థులు. 1930లో కొల్లాపూర్‌ రాజా సురభి వంశస్థులు ఈ భవనాన్ని పాఠశాలకు కేటాయించారు. నేటి వరకు దానికి మరమ్మతులు లేవు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని