ఇక త్వరత్వరగా ధాన్యం తూకం!

అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడుస్తుండటం.. లారీల కొరత, హమాలీల సమస్యతో రవాణాలో, తూకం వేయడంలో జాప్యమవుతున్న నేపథ్యంలో పౌరసరఫరాల సంస్థ దృష్టి సారించింది.

Published : 09 May 2024 06:36 IST

తడిసిన ధాన్యం.. బాయిల్డ్‌ బియ్యం కోటాలోకి మార్పిడి
పౌరసరఫరాల సంస్థ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడుస్తుండటం.. లారీల కొరత, హమాలీల సమస్యతో రవాణాలో, తూకం వేయడంలో జాప్యమవుతున్న నేపథ్యంలో పౌరసరఫరాల సంస్థ దృష్టి సారించింది. కొనుగోలు కేంద్రాల్లో కాటాల సంఖ్యను పెంచాలని.. రైతుల ధాన్యాన్ని వెంటనే బస్తాల్లో నింపి తూకం వేయాలని అధికారుల్ని ఆదేశించింది. తడిసిన ధాన్యం బస్తాలతో తూకం విషయంలో మిల్లర్లు, రైతుల మధ్య సమస్యల్లేకుండా వాటిని బాయిల్డ్‌ కోటాలోకి మార్చాలని నిర్ణయించింది. పలు జిల్లాల్లో మంగళవారం కురిసిన వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం భారీగా తడిసింది. అనేక కొనుగోలు కేంద్రాల్లో కాటా వేసిన బస్తాలు సైతం తడిశాయి. ఈ నేపథ్యంలో రైతులకు అండగా కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టినట్లు పౌరసరఫరాలశాఖ వర్గాలు తెలిపాయి. లారీ రాకపోకలతో సంబంధం లేకుండా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని తూకం వేసి బస్తాలను సీలు వేసి పెట్టాలని.. బస్తాలపై టార్పాలిన్లు కప్పాలని.. అవికూడా ఎక్కువ పొరలున్నవి వాడాలని అధికారులు స్పష్టం చేశారు.

తడిసినా తంటాలు లేకుండా!

ధాన్యం కొనుగోలులో వేగం పెంచేందుకు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు మంగళ, బుధవారాల్లో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ వివిధ జిల్లాల్లో పర్యటించారు. మంగళవారం సిద్దిపేట జిల్లాలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అక్కడ దుద్దేడ వంటి కేంద్రాల్లో కాటాల సంఖ్యను పెంచారు. బుధవారం జగిత్యాలలో మిల్లర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. తడిసిన ధాన్యం తూకం సమయంలో ఎక్కువ బరువు, తర్వాత బరువు తగ్గి తక్కువ బియ్యం వస్తాయన్న ఆందోళన అక్కర్లేదన్నారు. తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్‌ కోటాలోకి మారుస్తామని హామీ ఇచ్చారు. ఎఫ్‌సీఐ(భారత ఆహార సంస్థ) ఈసారి రాష్ట్రానికి అత్యధికంగా 30 లక్షల టన్నుల బాయిల్డ్‌ కోటా ఇచ్చింది. అకాలవర్షాలతో తడిసిన వడ్లను బాయిల్డ్‌ కోటాలోకి మార్చాలని నిర్ణయించారు. కరీంనగర్‌, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ధాన్యం సేకరణలో వేగం పెంచాలని అధికారుల్ని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని