దలైలామాకు పీవీ స్మారక పురస్కారం

ప్రపంచ శాంతి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు పీవీ నరసింహారావు మెమోరియల్‌ ఫౌండేషన్‌ ‘భారతరత్న పీవీ నరసింహారావు స్మారక పురస్కారా’న్ని అందించింది.

Published : 09 May 2024 06:36 IST

ఈనాడు, దిల్లీ: ప్రపంచ శాంతి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు పీవీ నరసింహారావు మెమోరియల్‌ ఫౌండేషన్‌ ‘భారతరత్న పీవీ నరసింహారావు స్మారక పురస్కారా’న్ని అందించింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలోని దలైలామా నివాసంలో బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్‌ ప్రతినిధులు ఆయనకు పురస్కారాన్ని అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆల్‌ ఇండియా యాంటీ టెర్రరిస్ట్‌ ఫ్రంట్‌ ఛైర్మన్‌, పీవీ నరసింహారావు మెమోరియల్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు మణీందర్‌జిత్‌ సింగ్‌ బిట్టా, పీవీ మనుమడు పీవీఆర్‌ కశ్యప్‌, సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీ డైరెక్టర్‌ బాలాలత మల్లవరపు, ఫౌండేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎం.అనిల్‌కుమార్‌లు పాల్గొన్నారు. మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని అందుకోవడం పట్ల దలైలామా హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతి కోసం చేసిన పీవీ చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఆధునిక భారత్‌కు పీవీ నరసింహారావు వేసిన బాటను అందరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. సామాజిక అభ్యున్నతి కోసం మానవతా దృక్పథంతో నిర్విరామంగా పనిచేస్తున్న సంస్థలు, వ్యక్తులకు పీవీ ఫౌండేషన్‌ ఏటా ఈ అవార్డు అందిస్తూ వస్తోంది. గతంలో సబర్మతి ఆశ్రమం, టాటా ట్రస్ట్స్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటాకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఇప్పుడు దలైలామాకు అందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని