రైతులెవరూ ఆందోళన చెందొద్దు..

ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Published : 09 May 2024 06:37 IST

తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం
తాగునీటికి 2.25 టీఎంసీల నీరు వదిలిన కర్ణాటక
ఇండియా కూటమిదే విజయం
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

ఈనాడు, హైదరాబాద్‌: ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ మీడియా కమిటీ ఇన్‌ఛార్జి సామ రాంమోహన్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యంలో మిల్లర్లు తరుగు ఎక్కువ తీస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఎవరైనా అలా తీస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గతేడాది కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు తెరిచి ఇప్పటికే రెట్టింపు ధాన్యాన్ని కొన్నాం. భాజపా, భారాసలు కలిసి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేసి రైతుభరోసా నిధుల పంపిణీని ఆపించాయి. రాష్ట్రంలో నిమిషం కూడా కరెంట్‌ పోవడం లేదు. సూర్యాపేటలో కేసీఆర్‌ జనరేటర్‌ సాయంతో ప్రెస్‌మీట్‌ పెట్టి కరెంట్‌ పోయిందంటే మేము ఎలా బాధ్యులం అవుతాం?

మేడిగడ్డ ఆనకట్టపై గ్యారంటీ లేదని  కమిటీ చెప్పింది..

కర్ణాటక ప్రభుత్వంతో సీఎం రేవంత్‌రెడ్డి, నేను మాట్లాడటంతో తెలంగాణ ప్రజల తాగునీటి అవసరాల కోసం 2.25 టీఎంసీల నీటిని విడుదల చేసింది. అకాల వర్షాలకు పిడుగులు పడి చనిపోయిన వారి కుటుంబాలను, ఆస్తినష్టం జరిగిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది. 2019లోనే మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిందని జాతీయ డ్యాం సేఫ్టీ అథార్టీ కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో తెలిపింది. అప్పుడే నీళ్లు వదిలి మరమ్మతులు చేస్తే బాగుండేదని వారు నివేదికలో పేర్కొన్నారు. ఇప్పుడు ఏ బ్యారేజీలోనూ నీళ్లు ఉంచకూడదని, వదిలేయమని కమిటీ నిపుణులు చెప్పారు. మేడిగడ్డ ఆనకట్ట భవిష్యత్తుపై గ్యారంటీ లేదని కమిటీ వివరించింది. పూర్తి నివేదిక వారం రోజుల్లో వస్తుంది. అది వచ్చిన తరువాత వివరాలు వెల్లడిస్తాం. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన అన్ని పరీక్షలు చేస్తున్నారు.

భాజపాకు 200 సీట్లు కూడా కష్టమే..

దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. భాజపాకు దేశవ్యాప్తంగా 200 సీట్లు రావడం కూడా కష్టమే. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 14 సీట్లు వస్తాయి. ఇండియాలోనే అత్యధిక మెజార్టీ నల్గొండ నియోజకవర్గంలో వస్తుంది. వచ్చే నెల 9న రాహుల్‌గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని