అవహేళనలు ఎదురైతే బాపూజీని స్మరించుకునేవాడిని

రక్షించే జవాన్‌ అగ్నిపథ్‌లో నలిగిపోతుంటే.. మద్దతు ధర లేకుండా కిసాన్‌ కుంగిపోతున్నాడు. ఫలితంగా అనేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వీటిని ఆపడం పోయి దుర్మార్గపు ప్రచారం జరుగుతోంది. ఇది శాశ్వతం కాదు.. మేధావి లోకం దీనిని ఖండించి ముందుకు పోవాలని కోరుతున్నా.

Published : 03 Oct 2022 04:34 IST

తెలంగాణ ఉద్యమంలో ఆయనే నాకు స్ఫూర్తి: ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఇప్పుడూ మహాత్ముడి అడుగుజాడల్లో నడుస్తూ అవార్డులు అందుకుంటున్నాం

సికింద్రాబాద్‌లో 16 అడుగుల గాంధీ విగ్రహం ఆవిష్కరణ

రక్షించే జవాన్‌ అగ్నిపథ్‌లో నలిగిపోతుంటే.. మద్దతు ధర లేకుండా కిసాన్‌ కుంగిపోతున్నాడు. ఫలితంగా అనేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వీటిని ఆపడం పోయి దుర్మార్గపు ప్రచారం జరుగుతోంది. ఇది శాశ్వతం కాదు.. మేధావి లోకం దీనిని ఖండించి ముందుకు పోవాలని కోరుతున్నా.

- ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘తెలంగాణ ఏర్పాటు కోసం బయలుదేరిననాడు ఎంతోమంది నన్ను అవహేళన చేశారు. దూషణలు, అవహేళనలు వచ్చిన సమయంలో కళ్లు మూసుకుని మహాత్మాగాంధీని స్మరించుకునేవాడిని. ఆయన స్ఫూర్తితో పయనించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి ఎదుట నిర్మించిన 16 అడుగుల బాపూజీ విగ్రహాన్ని ఆదివారం కేసీఆర్‌ ఆవిష్కరించారు. అంతకుముందు సికింద్రాబాద్‌ ఎంజీరోడ్డులో మహాత్ముని విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడారు. జైజవాన్‌, జైకిసాన్‌ నినాదాన్నిచ్చిన లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతి కూడా గాంధీ జయంతినాడే కావడం విశేషమని అన్నారు. ‘శాంతి, సౌభ్రాతృత్వం విలసిల్లే భారతదేశంలో మహాత్ముడినే కించపరిచే మాటలు వింటుంటే చాలా బాధగా ఉంటోంది. సమాజాన్ని చీల్చే చిల్లర మల్లర శక్తులు, వెకిలి వ్యక్తులు చేసే ప్రయత్నాలతో మహాత్ముడి కృషి, ప్రభ ఏనాటికీ తగ్గదు. మరుగుజ్జులు ఏనాటికీ మహాత్ములు కారు’ అని అన్నారు.

బాపూజీ సిద్ధాంతాలను ఎవరూ తుడిచేయలేరు

మహాత్మాగాంధీ సిద్ధాంతాలు ఎన్నటికీ విశ్వజనీనమైనవని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆయన ప్రతిపాదించిన అహింస, శాంతి, సేవ, త్యాగనిరతి అనే సిద్ధాంతాల్ని ఎవరూ తుడిచేయలేరన్నారు. ‘‘మహాత్ముడి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయడంగొప్పవిషయం. ఈ విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఆయన మిత్రులందరికీ ఈ కీర్తి దక్కుతుంది. కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన సందర్భంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఆనాటి సూపరింటెండెంట్‌ నాయకత్వంలో వైద్య బృందం, సిబ్బంది ధైర్యంగా పనిచేశారు. మంత్రి హరీశ్‌రావు, ఆసుపత్రి సిబ్బందికి సెల్యూట్‌ చేస్తున్నా.

ఆయన ఓ సేనాని..

‘కుల, మత, వర్గ రహితంగా అందర్నీ స్వాతంత్య్రం వైపు నడిపించిన సేనాని మహాత్మాగాంధీ. ఆయన నూలు వడికినా, మురికివాడలు శుభ్రం చేసినా, సత్యాగ్రహం చేసినా ప్రతీదీ ఆచరణాత్మకంగా ఉండేది. నెహ్రూ, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌, వల్లభ్‌భాయ్‌ పటేల్‌ వంటి నాయకులు ధనికులైనప్పటికీ గాంధీ స్ఫూర్తితో స్వాతంత్య్ర   పోరాటంలో భాగస్వాములయ్యారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంలో రాష్ట్రంలో 15 రోజులపాటు ఆ మహనీయుడిని గొప్పగా స్మరించుకున్నాం.

విదేశీయులకూ ఆదర్శప్రాయుడు

మార్టిన్‌లూథర్‌, దలైలామా, ఒబామా వంటి వారికీ మహాత్ముడు ఆదర్శం. ఇలాంటి వ్యక్తి భూమి మీద పుట్టి రక్తమాంసాలతో తిరుగుతాడా అని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ అన్నారు. గాంధీ పుట్టి ఉండకపోతే అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడిని కాదని ఒబామా దిల్లీలో పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి చెప్పారు. ఆ సమయంలో నేను పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నా. మిలీనియం ఆఫ్‌ ది పర్సన్‌ అని ఐరాస ప్రకటించింది’’ అని కేసీఆర్‌ వివరించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని