ప్రైవేటుకు మరింత పవర్‌

విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించే ప్రక్రియలో కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. ప్రాంతాల మధ్య విద్యుత్‌ సరఫరా(ట్రాన్స్‌మిషన్‌) చేసే పెద్ద లైన్లనూ ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

Updated : 05 Oct 2022 05:55 IST

విద్యుత్‌ లైన్లు లీజుకిచ్చి ఆదాయం పెంచుకోండి
పీపీపీ విధానాన్ని అనుసరించండి
రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ కేంద్ర విద్యుత్‌శాఖ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించే ప్రక్రియలో కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. ప్రాంతాల మధ్య విద్యుత్‌ సరఫరా(ట్రాన్స్‌మిషన్‌) చేసే పెద్ద లైన్లనూ ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ ఆస్తులను అమ్మేయడం లేదా లీజుకిచ్చే విధానంలో పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకోవచ్చనేది కేంద్రం ఆలోచన. ఇందులో భాగంగానే విద్యుత్‌ సంస్థల ఆస్తులనూ ప్రైవేటు సంస్థలకు అప్పగించే కార్యాచరణను కేంద్ర విద్యుత్‌శాఖ అమలుచేస్తోంది. ఈ క్రమంలో వినియోగదారులకు కరెంటు కనెక్షన్లు ఇచ్చి బిల్లులు వసూలు చేసుకునే పంపిణీ సంస్థ(డిస్కం)లను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలంటూ ఇటీవల గెజిట్‌ జారీచేసింది. తాజాగా డిస్కంలకు కరెంటు సరఫరా చేసే రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో) లైన్లనూ ప్రైవేటు సంస్థలకు లీజుకివ్వాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయా ఆస్తులను ప్రైవేటు సంస్థలు లేదా ట్రస్టులకు ఎలా లీజుకివ్వాలనే మార్గదర్శకాలనూ ఆ ఉత్తర్వుల్లో వివరించింది. జాతీయ రహదారులు, టెలికం తదితర ఇతర రంగాల్లో అనుసరిస్తున్న ‘ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం’(పీపీపీ) విధానం కింద విద్యుత్‌ పంపిణీ, సరఫరా వ్యవస్థల్లోని ఆస్తులను లీజుకిస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని వివరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, విద్యుత్‌ సంస్థల సీఎండీలకు ఉత్తర్వులు పంపింది. ఇది అమల్లోకి వస్తే భవిష్యత్తులో విద్యుత్‌ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ముగిసిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎలా అప్పగిస్తారంటే

ఉదాహరణకు నల్గొండ జిల్లా దామెరచర్ల వద్ద కొత్తగా యాదాద్రి విద్యుత్కేంద్రాన్ని నాలుగు వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇక్కడ ఉత్పత్తి చేసే కరెంటును హైదరాబాద్‌, వరంగల్‌ వంటి సబ్‌స్టేషన్ల వరకూ సరఫరా చేసేందుకు వీలుగా 400 కేవీ లేదా 132కేవీ సామర్థ్యం గల లైన్లను ట్రాన్స్‌కో రూ.వందల కోట్లు వెచ్చించి నిర్మించాల్సి ఉంటుంది. తాజా మార్గదర్శకాల ప్రకారం ఇలాంటి లైన్లను ఇకపై ట్రాన్స్‌కో నిర్మించకూడదు. అందుకోసం టెండర్లు పిలవాలి. ప్రైవేటు సంస్థ లేదా ట్రస్టు టెండరు ద్వారా కాంట్రాక్టు పొంది పీపీపీ విధానంలో లైన్లను నిర్మించి..గడువు ఉన్నంతకాలం విద్యుత్తు సరఫరా చేసుకోవచ్చు. అందుకుగానూ యూనిట్‌కు కొంత చొప్పున రవాణా వ్యయాన్ని(ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీ) డిస్కంలు చెల్లించాలి. ఈ ఛార్జీ ఎంత ఉండాలనేది రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి నిర్ణయించాలని మార్గదర్శకాల్లో కేంద్రం తెలిపింది.

గడువు తీరిన తరవాత లైన్లను ట్రాన్స్‌కోకు బదిలీచేయాల్సి ఉంటుంది. ఈ గడువు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కనీసం ఐదేళ్ల నుంచి ఎంతయినా ఉండొచ్చు. ‘‘ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పవర్‌ గ్రిడ్‌ సంస్థ ఆధ్వర్యంలోని లైన్లను కేంద్రం ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తోంది. తెలంగాణలో నిజామాబాద్‌-శంకర్‌పల్లి, మహేశ్వరం-వెల్టూరు మధ్య ఉన్న లైన్లను గతంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. ట్రాన్స్‌కో కూడా ఇదే తరహాలో విద్యుత్‌ సరఫరా లైన్లను ప్రైవేటుపరం చేయాలనేది తాజా ఉత్తర్వులు సారాంశం’’ అని ఓ సీనియర్‌ ఉన్నతాధికారి తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts