రైతులు చట్టసభల్లోకి రావాలి

ఎన్నికల్లో పార్టీలు గెలుస్తున్నాయి. నాయకులు గెలుస్తున్నారు. ఎన్నికల తర్వాత ప్రజలు ఓడిపోతున్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు రావాల్సి ఉంది. ఎన్నికల్లో పార్టీలు, నాయకులు కాదు ప్రజలు గెలవాలి. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన గెలుపు

Published : 28 Jan 2023 05:33 IST

నాగలితో పాటు కలం పట్టడం నేర్చుకోవాలి
దేశంలో గుణాత్మక మార్పు కోసమే భారాస
ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి
సీఎం సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌

ఎన్నికల్లో పార్టీలు గెలుస్తున్నాయి. నాయకులు గెలుస్తున్నారు. ఎన్నికల తర్వాత ప్రజలు ఓడిపోతున్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు రావాల్సి ఉంది. ఎన్నికల్లో పార్టీలు, నాయకులు కాదు ప్రజలు గెలవాలి. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన గెలుపు

సీఎం కేసీఆర్‌

ఈనాడు- హైదరాబాద్‌: ‘‘దేశ రైతులు ఎంపీలు, ఎమ్మెల్యేలు కావాలి..చట్టసభల్లోకి పోవాలి..నాగలితో పాటు కలం కూడా పట్టడం నేర్చుకోవాలి’’అని భారాస అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. దేశ రైతులు వారి హక్కుల కోసం దేశ రాజధాని దిల్లీలో 13 నెలల పాటు ఆందోళన చేపట్టినా ఫలితం శూన్యమని, అందుకే ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అనే నినాదంతో భారాస ఆవిర్భవించిందని ఉద్ఘాటించారు. తెలంగాణభవన్‌లో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌తో పాటు ఆయన భార్య హేమ గమాంగ్‌, కుమారుడు శిశిర్‌ గమాంగ్‌, నవనిర్మాణ్‌ కిసాన్‌ సంఘటన్‌ కన్వీనర్‌ అక్షయ్‌ కుమార్‌, ఆ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రైతు సంఘాల నేతలు తెలంగాణభవన్‌లో కేసీఆర్‌ సమక్షంలో శుక్రవారం భారాసలో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘దేశంలో కోట్ల మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తేవడానికి బలమైన రాజకీయ అంకితభావం ఉండాలి. అది భారాస వద్ద పుష్కలంగా ఉంది. తెలంగాణలో ఇప్పుడు వ్యవసాయం బాగుపడింది. రైతు ఆత్మహత్యలు లేవు. ఇక్కడ సాధ్యమైనప్పుడు ఒడిశాలో.. దేశంలో ఎందుకు కాదు? ఇది ధన్‌ కి బాత్‌ కాదు... మన్‌ కీ బాత్‌. దేశ భవిష్యత్తును మార్చేందుకు, దేశ ఆలోచన, భావజాలంలో మార్పు తీసుకురావాలనే ఒక బృహత్తర సంకల్పంతో భారత్‌ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. ఈ ప్రస్థానంలో, మహాయుద్ధంలో భాగస్వాములయ్యేందుకు ఒడిశా నుంచి వ్యయప్రయాసలకోర్చి వచ్చిన మీ అందరికీ స్వాగతం. ఒడిశా రాష్ట్ర రాజకీయాల్లో భీష్మాచార్యుడులాంటి గిరిధర్‌ గమాంగ్‌, ఇతర నేతలు భారాసలో చేరడంతో నాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయింది. మన కంటే ముందు, తర్వాత ఎన్నో దేశాలు స్వాతంత్య్రాన్ని పొందాయి. వీటిని బేరీజు వేసుకుంటే మన దేశ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

చిచ్చు పెడుతున్నారు.. విభజిస్తున్నారు

రాజకీయ కుట్రదారులు అధికారమే పరమావధిగా ఎన్నో నినాదాలిచ్చారు. ఎన్నో హామీలిచ్చారు. తర్వాత ఏం జరిగిందో తెలుసు. నేడు మన దేశం లక్ష్యాన్ని కోల్పోయింది. ఏం చేసైనా ఎన్నికల్లో గెలవాలనదే లక్ష్యమైంది. జాతి, మతం పేరిట ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. విభజిస్తున్నారు. ఇప్పుడు దేశంలో కేంద్ర ప్రభుత్వం లాభాలను ప్రైవేటుపరం చేస్తూ అంబానీ, అదానీ, టాటా, బిర్లా వంటి బడా కార్పోరేట్లకు దోచిపెడుతోంది. నష్టాలు వస్తే మాత్రం పేద ప్రజల నెత్తిన రుద్దుతోంది. గెలిచిన పార్టీలు ప్రజాసేవ లక్ష్యంగా పనిచేయాలి ఆ దిశగా పాటుపడాలి. కానీ నేడు ఏం జరుగుతోంది? ఒడిశాలోని మహానదిలో మన అవసరాలకు మించి నీటి లభ్యత ఉంది. కానీ మనం 25-30 శాతం మాత్రమే వినియోగించుకుంటున్నాం. మహానదితో పాటు బ్రాహ్మణి, వైతరణి నదులు కూడా ప్రవహిస్తున్నాయి. కానీ తాగడానికి నీరు లేదు. కానీ ప్రసంగాలు మాత్రం ఘనం. మానవ హక్కులు భిక్షగా కాకుండా హక్కుగా సాధించాలి’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. తమ ఒడిశాలో రూ.500 పింఛను మాత్రమే ఇస్తున్నారని, తెలంగాణలో రూ.2000 ఇస్తున్నారనేది కూడా చెప్పాలని ఒడిశా నేత కోరగా.. ఆ విషయాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. భారాస అధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశమంతటికీ 24 గంటల నాణ్యమైన విద్యుత్తు, వ్యవసాయానికి ఉచితంగా ఇస్తామన్నారు. రైతుబంధు, దళితబంధును అమలు చేస్తామని తెలిపారు. శుద్ధి చేసిన నీరును తెలంగాణ మాదిరే దేశవ్యాప్తంగా అందిస్తామని ప్రకటించారు. దేశంలోని 83 కోట్ల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమిని సాధ్యమైనంత ఎక్కువగా సాగులోకి తెస్తామన్నారు.


మన వద్ద వనరులున్నా కూడా అమెరికా వద్ద చేతులు చాచడం ఎందుకు? భారత్‌లో అమెరికా, చైనా కంటే.. ప్రపంచంలోని మిగతా అన్ని దేశాల కంటే ఎక్కువ సంపద కేంద్రీకృతమై ఉంది. అభివృద్ధిలో ఆ దేశాలెక్కడ? మనమెక్కడ? మన యువత అమెరికా వెళ్లడానికి ఎందుకు ఉవ్విళ్లూరుతున్నారు? భారతీయులకు అమెరికాలో గ్రీన్‌కార్డు లభిస్తే.. అది గౌరవంగా భావించి, వారి తల్లిదండ్రులు ఇక్కడ బంధుమిత్రులతో దావత్‌లు ఎందుకు చేసుకుంటున్నారు?ఇది దేనికి సంకేతం? దీన్ని అర్థం చేసుకుంటే మనం ఎక్కడున్నామో తెలిసిపోతుంది?’’   

 సీఎం కేసీఆర్‌


ఒడిశా నేతలకు ఘన స్వాగతం

అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌ నేతృత్వంలో ఒడిశా నుంచి రెండు బస్సుల్లో ముఖ్య నేతలు తరలివచ్చారు. ఇందులో కాంగ్రెస్‌, భాజాపా పార్టీల నుంచి భారాసలో చేరుతున్న వారితో పాటు రైతు సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, బార్‌ కౌన్సెల్‌ సభ్యులు, వేర్వేరు పార్టీల జిల్లా అధ్యక్షులు కూడా ఉన్నారు. వీరందరికీ భారాస నేతలు తెలంగాణ భవన్‌ వద్ద ఘనస్వాగతం పలికారు. ఏర్పాట్లను మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వేణుగోపాలచారి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్‌ అంజనేయగౌడ్‌, భారాస నాయకులు దాసోజు శ్రవణ్‌ తదితరులు పర్యవేక్షించారు. ఒడిశా నుంచి వచ్చిన నేతలు హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని సీఎం కోరడంతో.. అందుకు అనుగుణంగా భారాస నేతలు ఏర్పాట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని