ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్‌ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు.

Published : 08 May 2024 06:52 IST

నీతిఆయోగ్‌ సిఫారసులకు భిన్నం... లోపభూయిష్టం 
ఎన్డీయే నాయకులు విజయ్‌కుమార్‌, దినకర్‌, శివశంకర్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్‌ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే... నీతిఆయోగ్‌ సిఫారసులకు భిన్నంగా ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని మండిపడ్డారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌, భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌, జనసేన ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్‌ విలేకరులతో మాట్లాడారు.


వారసత్వ ఆస్తులపై ప్రభుత్వ పెత్తనమేంటి?
- నీలాయపాలెం విజయ్‌కుమార్‌, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి

రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకు సీఎం జగన్‌ కుట్ర పన్నారు. వారసత్వ ఆస్తులపై ప్రభుత్వ పెత్తనమేంటి? టైటిలింగ్‌ రిజిస్ట్రేషన్‌ అథారిటీ ప్రకటించే ముసాయిదా నోటిఫికేషన్‌పై యజమానులకు అభ్యంతరాలు ఉంటే రెండేళ్లలోపు ఫిర్యాదు చేయాలని చట్టంలో తీర్మానించారు. నోటిఫికేషన్‌ గురించి సమాచారం లేని యజమానులు హక్కులు కోల్పోవాల్సిందే.


పొంతన లేకుండా మాట్లాడుతున్నారు  
- లంకా దినకర్‌, భాజపా ముఖ్య అధికార ప్రతినిధి

ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంపై సీఎం జగన్‌, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. ఒకరు మంచి చట్టం అంటుంటే, మరొకరు అమలులో లేదంటారు. ఇంకొకరు అమలు చేసేది కేంద్రం అంటారు. రెవెన్యూ, అటవీ, దేవాదాయ శాఖ భూముల దోపిడీ అయిపోయి, వైకాపా నాయకులు ఇప్పుడు ప్రజల భూములపై పడ్డారు. విధి నిర్వహణలో తప్పు చేసిన అధికారులను శిక్షించాల్సి ఉండగా వైకాపా తీసుకొచ్చిన చట్టం వారికి అండగా నిలిచింది.


భూకబ్జాలకు ఊతమిచ్చేలా సవరణలు
- తమ్మిరెడ్డి శివశంకర్‌, జనసేన ప్రధాన కార్యదర్శి

భూ కబ్జాలకు ఊతమిచ్చేలా వైకాపా ప్రభుత్వం ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తెచ్చింది. నీతిఆయోగ్‌ సూచనల్ని పరిగణనలోకి తీసుకోకుండా చట్టంలో సవరణలు చేశారు. రైతుల పాలిట శాపంగా మారిన ఈ నీలి చట్టం కబ్జారాయుళ్లకు అనుకూలంగా తయారైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు