ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రైతులకు ఉరితాడే

రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్‌ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు.

Published : 08 May 2024 06:01 IST

తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్‌ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. దాని కోసమే ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం తీసుకొచ్చారని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన జగన్‌.. ప్రజల ఒరిజినల్‌ పత్రాలను తాకట్టుపెడితే వారి పరిస్థితి ఏంటి? ఈ చట్టం రైతులకు ఉరితాడే. భూములు వివాదాస్పద రిజిస్టర్‌లో నమోదైతే పేదలకు న్యాయం జరుగుతుందా’ అని ప్రశ్నించారు. ‘చట్టంపై మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అజేయ కల్లంలు పొంతన లేకుండా సమాధానం చెబుతున్నారు. దీంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. నిజంగా ఇది మేలు చేసే చట్టమే అయితే దాచడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మన ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా, తాకట్టు పెట్టుకోవాలన్నా టీఆర్‌ఓల చుట్టూ తిరగాలి. ఆస్తులను దోచుకోవడానికే ఇలాంటి విశేష అధికారాలను వారికి కట్టబెట్టారు. ఒక్కసారి వివాదాస్పద రిజిస్టర్‌లోకి నమోదైతే అమ్మడానికి, కొనడానికి వీలు లేదు. పరిష్కారం కోసం నేరుగా హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ వేసుకోవాల్సిందే. కనీసం అప్పీల్‌కు కూడా అవకాశం లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు