మిగిలింది మూడు వేలే

ఎంసెట్‌ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యేసరికి సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత 18 రకాల కోర్సుల్లో 94.40 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.

Updated : 01 Aug 2023 05:42 IST

‘కంప్యూటర్‌’ బ్రాంచీల్లో 94 శాతం సీట్ల భర్తీ
రెండో విడత కౌన్సెలింగ్‌ పూర్తి..
సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు రేపటి వరకు గడువు
ఆగస్టు 9 నుంచి 11 వరకు చివరి విడత కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తయ్యేసరికి సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత 18 రకాల కోర్సుల్లో 94.40 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్‌ కోటా సీట్లు 56,059 ఉండగా.. అందులో 52,922 నిండాయి. 3,137 మాత్రమే మిగిలాయి. ఈ 18 కోర్సులకుగాను ఏడింటిలో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కాకపోతే వాటిలో సీట్ల సంఖ్య 325లోపు ఉంది. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌(సీఎస్‌ఈ)లో 23,513 సీట్లు అందుబాటులో ఉండగా.. 580 మాత్రమే మిగిలిపోయాయి. అత్యధికంగా సీఎస్‌ఈ(ఏఐ అండ్‌ ఎంఎల్‌)లో 1,064 సీట్లు భర్తీ కాలేదు. ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ సోమవారం రెండో విడత కౌన్సెలింగ్‌ సీట్లను కేటాయించింది. ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్స్‌ సంబంధిత ఎనిమిది కోర్సుల్లో 17,320 సీట్లకు గాను 13,515 భర్తీ అయ్యాయి. మెకానికల్‌ సంబంధిత 11 కోర్సుల్లో 8,125కు కేవలం 3,533 నిండాయి. ఇతర కోర్సులు 11 ఉండగా అందులో 1198కి 719 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తానికి 82,702 కన్వీనర్‌ సీట్లలో రెండో విడత సీట్ల కేటాయింపు నాటికి 70,689 మందికి సీట్లు భర్తీ కాగా.. 12,013 మిగిలిపోయాయి. మొత్తం సీట్లు పొందినవారిలో సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల వారే 74.86 శాతం మంది ఉండటం విశేషం. కొత్తగా సీట్లు పొందిన వారితోపాటు రెండో విడతలో మెరుగైన సీట్లు పొందినవారు సైతం ఆగస్టు 2వ తేదీలోపు ఫీజు చెల్లించి... ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. లేకుంటే సీట్లు కోల్పోతారు.

‘సిరిసిల్ల’ టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌లో ఒక్కరూ చేరలే!

జేఎన్‌టీయూ సిరిసిల్ల ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఆ కోర్సులో 60 సీట్లున్నాయి. ఎంసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌లో ఒక్కరు మాత్రమే సీటు పొందగా.. రెండో విడతలో ఒక్కరూ చేరలేదు. అంటే తొలి విడతలో సీటు పొందిన విద్యార్థి కూడా మరో కోర్సులో చేరినట్లు స్పష్టమవుతోంది. అదే కళాశాలలో తొలి విడతలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో 14 మంది సీట్లు పొందగా.. రెండో విడత నాటికి నలుగురే మిగిలారు. సివిల్‌లో 16 మంది సీట్లు పొందారు.

  • జేఎన్‌టీయూ వనపర్తి కళాశాలలో మెకానికల్‌లో ముగ్గురు, సివిల్‌లో ఆరుగురు సీట్లు పొందారు.
  • కొత్తగూడెం ఇంజినీరింగ్‌ కళాశాలలోని మైనింగ్‌ ఇంజినీరింగ్‌ (సెల్ఫ్‌ ఫైనాన్స్‌) కోర్సులో నలుగురు సీట్లు పొందారు. ఈఈఈ బ్రాంచీలో ఒక్క విద్యార్థి, ఈసీఈలో 8 మంది మాత్రమే సీట్లు పొందారు.
  • ఓయూ టెక్నాలజీ కళాశాలలోని టెక్స్‌టైల్‌ టెక్నాలజీ (సెల్ఫ్‌ ఫైనాన్స్‌)లో ఆరుగురు మాత్రమే సీట్లు సాధించారు.

కొత్తగా 7,417 మందికి సీట్లు

మొదటి విడతలో సీట్లు పొందినవారితో కలిపి రెండో విడతకు మొత్తం 53,764 మంది వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. కొత్తగా 7,417 మంది సీట్లు పొందారు.

  • తొలి విడతలో సీట్లు పొందిన 25,148 మంది.. అదే కళాశాలలో మరో బ్రాంచీకి లేదా మరో కళాశాలలోకి మారారు.
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌లో కేవలం 21 సీట్లు ఉండగా.. వాటిలో ఒక్కరూ చేరలేదు.
  • వెబ్‌ ఆప్షన్లు ఇచ్చిన 4,701 మందికి సీట్లు దక్కలేదు. తమ ర్యాంకుకు అనుగుణంగా తగినన్ని ఆప్షన్లు ఇవ్వకపోవడమే అందుకు కారణం.
  • ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద అదనంగా 5,610 మంది సీట్లు పొందారు.
  • నాలుగు వర్సిటీలు, 28 ప్రైవేట్‌ కళాశాలల్లో అన్ని సీట్లు నిండాయి.
  • చివరి విడత కౌన్సెలింగ్‌ ఆగస్టు 9 నుంచి 11వ తేదీ వరకు జరుగుతుంది. ఆ తర్వాత మాత్రమే సీట్లు పొందినవారు స్వయంగా కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాలి. ధ్రువపత్రాల్లో ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌(టీసీ) మాత్రమే కళాశాలలో ఒరిజినల్‌ అప్పగించాలి. మిగిలినవన్నీ జిరాక్స్‌ కాపీలు ఇవ్వాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని