ఆర్టీసీ ఉద్యోగుల వయోపరిమితి 61 !

ఆర్టీసీ ఉద్యోగుల వయో పరిమితి 61 సంవత్సరాలకు పెరిగే అవకాశం ఉంది. సంస్థలో ప్రస్తుతం రిటైర్‌మెంట్‌ వయసు 60గా ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం బిల్లును శాసనసభ, మండలి ఆమోదించిన విషయం తెలిసిందే.

Updated : 09 Aug 2023 05:49 IST

ప్రభుత్వంలో విలీనంతో పెరిగే అవకాశం
వచ్చే నెలలో ప్రత్యేక శాఖ ఏర్పాటు..
కమిషనర్‌ నియామకం

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగుల వయో పరిమితి 61 సంవత్సరాలకు పెరిగే అవకాశం ఉంది. సంస్థలో ప్రస్తుతం రిటైర్‌మెంట్‌ వయసు 60గా ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం బిల్లును శాసనసభ, మండలి ఆమోదించిన విషయం తెలిసిందే. గవర్నర్‌ ఆమోదంతో చట్టరూపం దాల్చనుంది.
అనంతరం వారంతా ప్రభుత్వ ఉద్యోగులవుతారు. ఈక్రమంలో వారి పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెరగనుంది. దీంతో సంస్థకు ఆర్థికంగా కొంత ప్రయోజనం కలగనుంది. రిటైర్‌ అయ్యే ఉద్యోగులకు చేయాల్సిన చెల్లింపులకు సంబంధించి మరో ఏడాది సమయం వెసులుబాటు లభిస్తుంది. ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారనుండగా, కార్పొరేషన్‌ యథాతథంగా కొనసాగుతుంది.

వీసీ సజ్జనార్‌కే కమిషనర్‌ పదవి?

ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనంతో ఏర్పాటుచేసే శాఖకు ప్రజారవాణా లేదా మరో పేరు పెట్టనున్నారు. సెప్టెంబరులో కొత్త శాఖను ఏర్పాటుచేసి, కమిషనర్‌ను నియమించనుంది. సంస్థకు ప్రస్తుతం వైస్‌ ఛైర్మన్‌, ఎండీగా వీసీ సజ్జనార్‌ ఉన్నారు. అటు కొత్త శాఖకు, ఇటు కార్పొరేషన్‌కు మధ్య సమన్వయం కోసం రెండు బాధ్యతలనూ ఒకరికే అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ప్రస్తుత వైస్‌ ఛైర్మన్‌, ఎండీ సజ్జనార్‌కే కమిషనర్‌ బాధ్యతలూ ఇచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీలో మొత్తం 43,055 మంది ఉద్యోగులు ఉన్నారు.

వేతనాలపై ఆర్టీసీలో చర్చ

ప్రభుత్వంలో విలీనంతో వేతనాలపై ఆర్టీసీ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. డ్రైవర్లు, కండక్టర్లు వంటి ఉద్యోగులకు వేతనాలు పెరుగుతాయని, అధికారులు, ఉన్నతాధికారులకు పెరగవని చెబుతున్నారు. ఆర్టీసీలో ప్రస్తుతం అధికారులు, ఉన్నతాధికారుల వేతనాలు భారీగా ఉండటమే ఇందుకు కారణం. కార్మికులు సమ్మెలు చేసిన సందర్భాల్లో అలవెన్సులు, ఇతరత్రా రూపంలో అధికారులకు భారీగా వేతనాలు పెరిగాయి. ‘ప్రభుత్వంలో విలీనం తర్వాత సాంకేతికంగా మా వేతనాలు తగ్గుతాయి. జీతాలు తగ్గించకుండా.. ప్రస్తుతం వస్తున్న దానిని కొనసాగించి భవిష్యత్తులో పెరిగే మొత్తాన్ని సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి. తద్వారా కొన్నేళ్లవరకు ప్రస్తుత వేతనమే ఉంటుందని భావిస్తున్నాం’ అని ఓ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) తెలిపారు. అదనపు పని గంటలతో ఒత్తిడి, వయసు కారణాలతో కొందరు డ్రైవర్లు పదవీ విరమణ తీసుకుంటున్నారు. ప్రభుత్వంలో విలీనం తర్వాత 61 ఏళ్ల వరకు పనిచేయడం డ్రైవర్లు, మెకానిక్‌లకు ఇబ్బందేనని ఆ అధికారి పేర్కొన్నారు.

చెల్లింపు బాధ్యత కార్పొరేషన్‌దే

ఆర్టీసీకి ఏటా రూ.1,500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయిస్తోంది. మరో రూ,1,500 కోట్లు కలిపి ఏటా రూ.3,000 కోట్లు ఇస్తే సంస్థ నిలబడుతుందన్న ప్రతిపాదనకు సీఎం అంగీకరించారు. ఉద్యోగులకు వేతనాల రూపంలో ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఇవ్వనుంది. మరోవైపు బ్యాంకులకు రూ.2,446 కోట్లు, ఉద్యోగులకు రూ.3,620 కోట్ల బకాయిలు ఆర్టీసీ  తీర్చాల్సి ఉంది. ఆర్టీసీ తనకు వచ్చే ఆదాయాన్ని ఖర్చులు పోను.. బ్యాంకు రుణాలు, ఉద్యోగులకు సీసీఎస్‌, పీఎఫ్‌ వంటి బకాయిలు తీర్చుకోవడానికి ఉపయోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండేళ్ల వరకూ పూర్తి ఆదాయాన్ని సంస్థ వాడుకునే వెసులుబాటును కల్పించింది.


ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులతో భేటీ

ఈనాడు, అమరావతి: టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై అధ్యయనం చేసేందుకు సంస్థ అధికారులు ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులతో మంగళవారం విజయవాడలో భేటీ అయ్యారు. 2020 జనవరి 1నే ఏపీఎస్‌ఆర్టీసీ విలీనం జరిగింది. ఆ ప్రక్రియ ఎలా చేపట్టారనేది తెలుసుకునేందుకు అధికారుల బృందం వచ్చింది. ఎండీ సీహెచ్‌.ద్వారకా తిరుమలరావు వారికి వివరించారు. ఇందులో టీఎస్‌ ఆర్టీసీ ఈడీలు కృష్ణకాంత్‌ (పరిపాలన), మునిశేఖర్‌ (ఆపరేషన్స్‌), చీఫ్‌ ఫైనాన్షియల్‌ మేనేజర్‌ విజయ పుష్పకుమారి పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని