దడ పుట్టిస్తున్న ధరలు

ఇటీవల టమాట ధర చూసి సామాన్యులకు నోట మాట రాలేదు.. ప్రస్తుతం కందిపప్పు, బియ్యం, జీలకర్ర, పాలు వంటి నిత్యావసరాల ధరలు చూసి హడలిపోతున్నారు.

Published : 04 Sep 2023 05:34 IST

కొన్ని నిత్యావసరాలు 50 శాతం పెరుగుదల
వేసవిలో అకాల వర్షాలతో  పంట దిగుబడులపై ప్రభావం
ఈనాడు - హైదరాబాద్‌

టీవల టమాట ధర చూసి సామాన్యులకు నోట మాట రాలేదు.. ప్రస్తుతం కందిపప్పు, బియ్యం, జీలకర్ర, పాలు వంటి నిత్యావసరాల ధరలు చూసి హడలిపోతున్నారు. ఇలా అయితే అయిదు వేళ్లు నోట్లోకెళ్లేదెలా అంటూ ఆందోళన చెందుతున్నారు. వేసవిలో అకాలవర్షాలు, ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ కారణంగానే ప్రస్తుతంధరలు మండిపోతున్నాయని వర్తకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రొటీన్‌ అధికంగా లభించే కందిపప్పును తెలుగిళ్లలో నిత్యం వినియోగిస్తుంటారు. దీని కిలో ధర ఆరు నెలల్లోనే దాదాపు 50శాతం పెరిగింది. ఫిబ్రవరిలో రూ.110-120 ఉంటే ప్రస్తుతం రూ.170కి చేరింది. తెలంగాణకు మహారాష్ట్ర నుంచి ఎక్కువగా కందిపప్పు వస్తుంది. అక్కడ వర్షాల్లేక దిగుబడి తగ్గిందని మలక్‌పేట మార్కెట్‌లోని వర్తకులు చెబుతున్నారు. దీంతో సామాన్యులు కందికి ప్రత్యామ్నాయంగా పెసర, ఎర్రపప్పులను వినియోగిస్తున్నారు. మినపపప్పు ధర కిలో రూ.110 నుంచి నెల రోజుల్లోనే రూ.130కి పెరిగింది.

జీలకర్ర లేకుండానే పోపు

జీలకర్ర కిలో రూ.700కుపైగా పలుకుతోంది. అయిదారు నెలల క్రితం రూ.300లోపే ఉండేది. సెనగపప్పు రూ.65 నుంచి రూ.75-80కి చేరింది. పాలు లీటర్‌కు రూ.5 చొప్పున పెంచారు. నాణ్యమైనవైతే రూ.80-100 వరకు తీసుకుంటున్నారు. చింతపండు ధర కిలో రూ.120 నుంచి రూ.150కి పెరిగింది. సూపర్‌మార్కెట్లలో అయితే రూ.180-190 వరకు అమ్ముతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చింతచెట్లు గతంలో మాదిరిగా లేకపోవడంతోపాటు కోతులతో సమస్యతో ఉన్న వాటిని కూడా కొట్టేస్తున్నారు. దీంతో ఏటికేడు దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. వంట నూనెలు, అల్లం, వెల్లుల్లి ధరలు కాస్త అందుబాటులోకి రావడం ప్రజలకు ఉపశమనంగా ఉంది. వారం క్రితం వరకు అల్లంవెల్లుల్లి పేస్టు కిలో రూ.280 వరకు పలికింది. ఇప్పుడు రూ.180కి దిగివచ్చింది. 2019లో లీటర్‌ రూ.90గా ఉన్న మంచినూనె ధర ఆ తర్వాత ఓ దశలో రూ.190 వరకు వెళ్లింది. ప్రస్తుతం రూ.110కి విక్రయిస్తున్నారు.


బియ్యం బస్తా మరింత ‘బరువు’

బియ్యం ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. సన్నబియ్యం 25 కిలోల బస్తా రూ.1,250 నుంచి రూ.1,500 అయ్యింది. నాణ్యమైనవి కిలో రూ.54 నుంచి రూ.64కి చేరాయి. విదేశాలకు సన్నబియ్యం ఎగుమతులపై నిషేధం విధించకపోతే ధర మరింత పెరిగేదని బండ్లగూడకు చెందిన వ్యాపారి నాగరాజు చెబుతున్నారు. అకాల వర్షాలతో పంట నష్టం, రైతులు దొడ్డు రకం వరి సాగుకే ప్రాధాన్యమిస్తుండటం వంటి అంశాలు ఈ పెరుగుదలకు కారణాలుగా కనిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని