Published : 25 May 2022 00:49 IST

చమురు ధరాభారం... ఉపశమనమెంత?

పెట్రో పన్నులను రాష్ట్రాలూ కుదించే అవకాశం

ట్టకేలకు చమురు మంటల నుంచి దేశ ప్రజానీకానికి కొంతమేర ఉపశమనం లభించింది. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు ఒకపక్క, ఇతర నిత్యావసర సరకుల ధరలు మరోపక్క తారస్థాయికి చేరడంతో ప్రజలు అల్లాడిపోయారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా మే నెల 22 నుంచి మరోసారి లీటరు పెట్రోలుపై ఎనిమిది రూపాయలు, డీజిల్‌పై ఆరు రూపాయల మేర ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. గత ఏడాది నవంబరు నుంచి కేంద్రప్రభుత్వం తొలిసారిగా లీటరు పెట్రోలుపై అయిదు, డీజిల్‌పై పది రూపాయలు తగ్గించినప్పుడు కొన్ని రాష్ట్రాలు కూడా అదే బాట పట్టాయి. రాష్ట్రాలు సైతం సుంకాలు తగ్గించాలంటూ కేంద్రం విమర్శలు చేయగా, ప్రతిగా తగ్గించని రాష్ట్రాలు ఘాటుగా స్పందించడం అందరికీ తెలిసిందే. ఇలాంటి తగ్గింపును ఆశించడం సబబు కాదని తమిళనాడు సహా పలు రాష్ట్రాలు తెగేసి చెప్పాయి. అప్పట్లో ఏపీ, తెలంగాణ, కేరళ, పశ్చిమ్‌ బెంగాల్‌, ఝార్ఖండ్‌, తమిళనాడు వంటి రాష్ట్రాలు చమురుపై తాము వసూలు చేసే వ్యాట్‌ను తగ్గించలేదు. ఇప్పుడు కేంద్రం రెండోసారి తాజాగా తగ్గించింది. ఇప్పుడు తగ్గించిన ఎక్సైజ్‌ సుంకం మూలంగా ఏటా లక్ష కోట్ల రూపాయల ఆదాయం కోల్పోనున్నట్లు, గతంలో తగ్గింపు వల్ల 1.20 లక్షల కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చెబుతున్నారు. కేంద్రం ప్రకటన తరవాత భాజపాయేతర ప్రభుత్వాలున్న మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాలు తమ వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. మిగిలిన రాష్ట్రాలు... ముఖ్యంగా భాజపా పాలిత రాష్ట్రాలూ ఇదే బాట పట్టే అవకాశం ఉంది.

తగ్గిపోయే ఆదాయం

కేంద్రం తగ్గించిన మరునాడే తమ రాష్ట్రంలో తగ్గించే ప్రసక్తే లేదని తెలంగాణ ఆర్థికమంత్రి పేర్కొనడం గమనార్హం. ఎన్‌డీఏ సర్కారు అధికారంలోకి వచ్చిన తరవాత పలుమార్లు ఎక్సైజ్‌ పన్నులను పెంచిందని విమర్శించారు. పెంచుతున్నప్పుడు తమను సంప్రదించని కేంద్రం, తగ్గించమని ఎలా చెబుతుందని తమిళనాడు వంటి రాష్ట్రాలు తప్పుపట్టాయి. ఇప్పటికి రెండుసార్లు కేంద్రం ఎక్సైజ్‌ పన్నులను తగ్గించినా, ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్న పన్ను (పెట్రోలుపై రూ.10.42, డీజిలుపై రూ.12.23) 2014 నాటికి ఉన్నదానికన్నా ఎక్కువేనని చెబుతున్నారు. రాష్ట్రాలు తమ వ్యాట్‌ను ప్రత్యక్షంగా తగ్గించకపోయినా, కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ పన్ను మూలంగా పరోక్షంగా వాటి వ్యాట్‌ ఆదాయం తగ్గిపోతుంది. ఎందుకంటే, రాష్ట్రాల వ్యాట్‌ను శుద్ధి చేసిన ఇంధనం ధర, కేంద్ర ఎక్సైజ్‌ పన్నులు కలిపిన మొత్తంపై లెక్కిస్తారు. కేంద్రం ఇప్పటిదాకా రెండుసార్లు ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడానికి కారణాలు లేకపోలేదు. 2014లో ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లీటరు పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సైజ్‌ సుంకాల శాతం భారీగానే ఉంది. అయితే, రెండుసార్లు తగ్గించిన సుంకం కారణంగా ఇవి కొంతమేర తగ్గవచ్చు. ఇదే సమయంలో కేంద్రానికి పెరిగిన స్థాయిలో రాష్ట్రాలకు పెరగలేదు. భారీ పెంపుదలతో దేశంలో పెట్రోలు, డీజిలుపై పన్నుల్లో కేంద్రం వాటా పెరుగుతూ వస్తోంది. 2021 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకారం, 2013-14లో ఈ వాటాలు కేంద్రం, రాష్ట్రాలకు ఇంచుమించు సమానంగా ఉండేవి. కానీ 2021 నాటికి 68 శాతం కేంద్రానికి పోతుంటే, 32 శాతం మాత్రమే రాష్ట్రాలకు దక్కుతోంది. కేంద్రం వాటా 18 శాతం మేర పెరిగింది. భాజపా కేంద్రంలో అధికారం చేపట్టిన తరవాత దేశం మొత్తం వచ్చే పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42శాతానికి పెంచినట్లు చెబుతున్నా, వాస్తవానికి ఈ వాటా అంతకన్నా తక్కువగానే ఉంటోందనే విమర్శలున్నాయి.

కేంద్ర ఆదాయం రెండు రకాలుగా ఉంటుంది. రాష్ట్రాలతో పంచుకునే ‘డివిజబుల్‌ పూల్‌’ ఆదాయం ఒకటి. రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని ‘నాన్‌- డివిజబుల్‌ పూల్‌’ ఆదాయం మరొకటి. వీటిలో ప్రాథమిక ఎక్సైజ్‌ సుంకం తప్ప మిగిలిన మూడు రకాలూ ఉంటాయి. గతంలో యూపీఏ ప్రభుత్వంగాని, ప్రస్తుత ఎన్‌డీఏగాని తెలివిగా రాష్ట్రాలతో పంచుకునే పన్నుల్ని పెంచకుండా, రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేనివాటినే విధించడం ఆనవాయితీగా మారింది. దీనివల్ల రాష్ట్రాలకు ఇవ్వాల్సిన డివిజబుల్‌ పూల్‌ తగ్గుతుంది. కేంద్రం ఇప్పటిదాకా ఎక్సైజ్‌ సుంకం పేరుతో విధిస్తున్న లీటరు పెట్రోలుపై  పన్నులో రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేనిదే అధికం. ఈ కారణంగానే మొదటి నుంచీ రాష్ట్రాలన్నీ ఈ అంశంపైనే కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. 2019-20 కేంద్ర పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం లేని పన్నులు, సెస్సు, సర్ఛార్జీల వాటా 2020-21 నాటికి మరింతగా పెరిగింది. ఆ మేరకు రాష్ట్రాలకు రావలసిన నిధుల వాటా తగ్గిపోయింది.

భారీగా నష్టం

టోకు, చిల్లర ద్రవ్యోల్బణం స్థాయులు అంతకంతకూ పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలు విలవిల్లాడిపోతున్న నేపథ్యంలో- కేంద్రం ఉపశమన చర్యల్లో భాగంగా రెండోసారి ఎక్సైజ్‌ సుంకాలను తగ్గించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకూ సుంకాలను రెండుసార్లు తగ్గించడం ద్వారా కేంద్రం రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచినట్లయింది. ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, పశ్చిమ్‌ బెంగాల్‌, తెలంగాణ రాష్ట్రాలు మిగిలిన వాటికన్నా అధికంగా వ్యాట్‌ (25శాతంకన్నా ఎక్కువ) వసూలు చేస్తున్నాయి. తాజాగా తగ్గించిన సుంకాల మూలంగా ఇకపై పెట్రోలు లీటరుపై రూ.27.90 నుంచి రూ.19.90, డీజిల్‌పై రూ.21.80 నుంచి రూ.15.80 స్థాయిలో కేంద్ర ఎక్సైజ్‌ సుంకాలు కొనసాగుతాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం తగ్గించిన స్థాయిలో ఈసారి ఎన్ని రాష్ట్రాలు తగ్గిస్తాయో, ఏయే రాష్ట్రాలు ధిక్కార స్వరాలు వినిపిస్తాయో వేచి చూడాలి.


ప్రాథమిక ఎక్సైజ్‌ సుంకం మాత్రమే

ప్రాథమిక ఎక్సైజ్‌ సుంకం, ప్రత్యేక అదనపు సుంకం, రహదారి-మౌలిక సదుపాయాల సుంకం, వ్యవసాయ రంగ అభివృద్ధి సుంకం పేరిట పెట్రో ఉత్పత్తులపై నాలుగు రకాల ఎక్సైజ్‌ సుంకాలను విధిస్తున్నారు. వీటిలో ప్రాథమిక ఎక్సైజ్‌ సుంకాన్ని మాత్రమే రాష్ట్రాలకు పంచుతారు. ఈ విషయంలోనే రాష్ట్రాలన్నీ కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. గతంలో తగ్గించిన దాంతోపాటు, తాజాగా తగ్గించినది పూర్తిగా రహదారి-మౌలిక సదుపాయాల సుంకానికి సంబంధించినది. ఈ రెండు తగ్గింపుల మూలంగా కేంద్రం కోల్పోయే ఆదాయం రూ.2.20 లక్షల కోట్లుగా చెబుతున్నారు.

Read latest Vyakyanam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


సంపాదకీయం

ప్రధాన వ్యాఖ్యానం

ఉప వ్యాఖ్యానం

అంతర్యామి

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని