ఉపాధి వేతనం... కూలీలకు ఊతం!

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాపనుల కార్యక్రమంగా పేరొందిన గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. సార్వత్రిక ఎన్నికల వేళ వారి దినసరి వేతనాలను పది శాతం వరకు పెంచింది. ఈ పెంపు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి వర్తిస్తుంది.

Published : 16 Apr 2024 00:42 IST

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాపనుల కార్యక్రమంగా పేరొందిన గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. సార్వత్రిక ఎన్నికల వేళ వారి దినసరి వేతనాలను పది శాతం వరకు పెంచింది. ఈ పెంపు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి వర్తిస్తుంది.

యూపీఏ హయాంలో చట్టరూపం దాల్చిన ‘గ్రామీణ ఉపాధి హామీ పథకం’ కొవిడ్‌-19 కష్టకాలంలో కోట్లాది గ్రామీణ కుటుంబాలను ఎంతగానో ఆదుకొంది. ఈ పథకం కురిపిస్తున్న సత్ఫలితాలను చూసి పట్టణ ప్రాంతాల్లోనూ ఇటువంటి పథకాన్ని అమలు చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అందుకు శ్రీకారం చుట్టాయి. నిరుద్యోగం తాండవిస్తున్న నేటి రోజుల్లో ఉపాధి హామీ పథకం గ్రామీణులకు పెద్దదిక్కవుతోంది. గ్రామాల్లో సామాజిక ఆస్తుల కల్పనకూ దోహదపడుతోంది. ఉన్నచోటే పనులు లభిస్తుండటంవల్ల పల్లెల నుంచి పట్టణాలకు వలసలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు కూలీల జీవన ప్రమాణాలు కొంతవరకు మెరుగయ్యాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపుతుండటంతో గ్రామీణ అక్షరాస్యత పెరిగింది.

ఒక్కో ప్రాంతంలో...

నరేంద్ర మోదీ నేతృత్వాన కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం కొలువుదీరిన తరవాత ఉపాధి హామీ పథకానికి మంగళం పాడాలని భావించారు. దాంతో అనేక వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. పథకాన్ని పూర్తిగా ఎత్తివేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని భావించిన ఎన్‌డీఏ సర్కారు- కొన్ని మార్పులు చేర్పులతో దాన్ని కొనసాగిస్తోంది. ఉపాధి పనుల కోసం 2020-21లో మొదట రూ.61,500 కోట్లు కేటాయించింది. అయితే అదే ఏడాది కొవిడ్‌ మూలంగా పలు ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో కుటుంబాలు తిరిగి తమ స్వగ్రామాలు చేరుకొన్నాయి. దాంతో వారందర్నీ ఉపాధి పనుల ద్వారా ఆదుకోవడానికి కేంద్రం మరో రూ.50,000 కోట్లు వెచ్చించింది. దాంతో ఆ ఏడాది మొత్తం రూ.1,11,500 కోట్లు ప్రత్యేకించినట్లయింది. పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి  వరకు అదే అత్యధిక కేటాయింపు. కరోనా కష్టకాలంలో గ్రామీణ కుటుంబాలను ఉపాధి హామీ పథకం బాగా ఆదుకొంది. కాబట్టి, భవిష్యత్తులో ఏ ప్రభుత్వమూ దీన్ని పూర్తిగా ఎత్తివేసే సాహసం చేయలేదనే చెప్పాలి.

కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన ఉపాధి కూలీల వేతనాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా గోవాలో 10.56 శాతం, కర్ణాటకలో 10.40 శాతం మేర వేతనాలు పెరిగాయి. కేవలం మూడు శాతం వేతనాల పెరుగుదలతో ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లు చివరి వరసలో నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ పెంపుదల సరిసమానంగా 10.29 శాతం! దేశవ్యాప్తంగా చూస్తే రోజువారీ సగటు వేతనం రూ.28 మేర పెరిగినట్లు చెబుతున్నారు. 2023-24లో సగటు దినసరి వేతనం రూ.261. ఇప్పుడు అది రూ.289కు పెరిగింది. తాజా పెంపుతో హరియాణా అత్యధికంగా లాభపడింది. అక్కడి ఉపాధి కూలీల దినసరి వేతనం రూ.374కు చేరుకొంది. అతి తక్కువ పెరుగుదలతో అరుణాచల్‌ప్రదేశ్‌, నికోబార్‌ దీవులు చివరి స్థానంలో ఉన్నాయి.

గత ఆర్థిక సంవత్సరం ఆరంభంలో గ్రామీణాభివృద్ధిపై పార్లమెంటు నియమించిన స్థాయీ సంఘం- ఉపాధి కూలీల వేతనాలు చాలా తక్కువగా ఉంటున్నాయని, పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా లేవని నివేదించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చెల్లిస్తున్న వేతనాల మధ్య వ్యత్యాసం ఉంటోందని కూడా విశ్లేషించింది. ప్రస్తుతం వేతనాలను నిర్ణయించడానికి పరిగణనలోకి తీసుకుంటున్న 2009-10 బేస్‌ ఏడాదిని పునఃపరిశీలించాలని సూచించింది. కూలీల వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోందని, దాన్ని నివారించాలని స్థాయీ సంఘం పేర్కొంది. తదనుగుణంగా కేంద్రం ఉపాధి హామీ కూలీలకు వేతనాలను పెంచింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమవంతుగా ఈ పెంపునకు కొంత మొత్తాన్ని కలిపి కొత్త వేతనాలను నిర్ణయించే అవకాశముంది. అటువంటి పెంపును బట్టి ఆయా రాష్ట్రాల్లో ఉపాధి కూలీల వేతనాలు ఉంటాయి. 2019-25 మధ్యకాలంలో ఉపాధి కూలీల దినసరి వేతనాలు కేవలం 30శాతమే పెరిగాయి.

గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు లభిస్తున్న వేతనాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఈ ఆరేళ్ల కాలంలో మహారాష్ట్ర 44శాతం పెరుగుదలతో మొదటిస్థానాన్ని ఆక్రమించింది. 28శాతం పెరుగుదలతో కేరళ, 26శాతంతో త్రిపుర చివరి రెండు స్థానాల్లో నిలిచాయి. పార్లమెంటు స్థాయీ సంఘం వ్యవసాయ కూలీల వేతనాలకు దీటుగా ఉపాధి కూలీల వేతనాలు ఉండాలని సూచించింది. దేశంలో వ్యవసాయ కూలీల కనీస దినసరి వేతనం రూ.375గా ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. కానీ, ఏ రాష్ట్రంలోనూ ‘నరేగా’ వేతనాలు ఆ స్థాయిలో ఉండటంలేదు. పెంపు తరవాత రూ.374 దినసరి వేతనంతో హరియాణా మొదటి స్థానంలో నిలిచినప్పటికీ, అది కనీస వేతనం కన్నా ఒక రూపాయి తక్కువే! పెంపు తరవాత హరియాణా(రూ.374), గోవా(రూ.359), కర్ణాటక (రూ.349), కేరళ(రూ.346), పంజాబ్‌(రూ.322), తమిళనాడు(రూ.319) రాష్ట్రాల్లో మాత్రమే ఉపాధి కూలీల దినసరి వేతనాలు రూ.300 మార్కును దాటాయి. ఏపీ, తెలంగాణల్లో పెరిగిన దినసరి వేతనం రూ.300.

భారీ వ్యత్యాసాలు

వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ, ఉపాధి కూలీల వేతనాల మధ్య భారీ వ్యత్యాసాలు ఉంటున్నాయి. కేరళలో ఉపాధి కూలీల వేతనం కన్నా వ్యవసాయ కూలీల వేతనం 431 రూపాయలు అధికం. దేశంలోనే అత్యధికంగా కేరళలో వ్యవసాయ కూలీకి రోజుకు రూ.764 చొప్పున చెల్లిస్తున్నారు. వ్యవసాయ పనులు లేని రోజుల్లో కూలీలకు గ్రామాల్లో ఉపాధి లభించదు. అటువంటి సమయంలో వారికి పని కల్పించడానికి ఉపాధి హామీ పథకం ఎంతగానో తోడ్పడుతోంది. కొవిడ్‌ కాలమైన 2020-21లో దేశవ్యాప్తంగా సుమారు 7.5 కోట్ల కుటుంబాలు ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందడం ఇందుకు నిదర్శనం.


ఎన్నికల సంఘం అనుమతితో...

కేంద్రం సాధారణంగా రాష్ట్రాల వారీగా నిత్యావసర వస్తువుల ధరలు, వ్యవసాయ కూలీల వేతనాలను పరిగణనలోకి తీసుకొని ఉపాధి పనులకు చెల్లించే వేతనాలను పెంచుతుంది. అంటే, పెరిగిన గ్రామీణ ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటుందన్న మాట. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమలవుతోంది. ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎన్నికల సంఘం అనుమతి తీసుకొని ఉపాధి హామీ కూలీల వేతనాలను పెంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.