నిలువెల్లా నీచ రాజకీయం

‘జగమే మాయ... బతుకే మాయ...’ ‘అదేంటి సార్‌... జనాలు ఈ పాటను మీ పేరుతో మార్చి పాడుకుంటుంటే మీరు మళ్ళీ అసలు పాట పాడుతూ తెగ బాధపడిపోతున్నారు?’ ‘నీకు తెలియంది ఏముందయ్యా సెక్రటరీ... ఐపీఎల్‌ టికెట్‌ దొరకని ఫ్యాన్‌లా అయిపోయిందనుకో నా పరిస్థితి’ ‘మరీ అంత కష్టం ఏమొచ్చింది సార్‌?’ ‘ఈ ఎన్నికలు ఎలా గట్టెక్కాలో తెలీడం లేదు!’

Published : 10 Apr 2024 00:44 IST

‘జగమే మాయ... బతుకే మాయ...’

‘అదేంటి సార్‌... జనాలు ఈ పాటను మీ పేరుతో మార్చి పాడుకుంటుంటే మీరు మళ్ళీ అసలు పాట పాడుతూ తెగ బాధపడిపోతున్నారు?’

‘నీకు తెలియంది ఏముందయ్యా సెక్రటరీ... ఐపీఎల్‌ టికెట్‌ దొరకని ఫ్యాన్‌లా అయిపోయిందనుకో నా పరిస్థితి’
‘మరీ అంత కష్టం ఏమొచ్చింది సార్‌?’
‘ఈ ఎన్నికలు ఎలా గట్టెక్కాలో తెలీడం లేదు!’

‘ఛ ఊరుకోండి సార్‌... నీచ రాజకీయాల నీరో చక్రవర్తి మీరు... శవ రాజకీయాలకు శ్రీకారం చుట్టిందే మీరు... అలాంటి మీకు తెలియకపోవడం ఏమిటి?’

‘అదేనయ్యా అందరూ అంటున్నారు... కానీ ఎంతకాలం అని జనం కళ్లకు గంతలు కట్టగలను చెప్పు? నిజాలు తెలుసుకుని కొరడాలాంటి ఓటుతో కొట్టడానికి రెడీ అయిపోతున్నారు’
‘మీరు ఎన్నయినా చెప్పండి... ‘అడ్డగోలు గెలుపునకు అరవై సూత్రాలు’, ‘బటన్‌ నొక్కుడు వీరుడు’, ‘బాత్రూంలో బాబాయ్‌- అటక మీద అబ్బాయ్‌’, ‘పంచుతా నోట్లు... పడతా ఓట్లు’... ఇలాంటి ఎన్నో జగన్మాయలకు కొబ్బరికాయ కొట్టిన రాజకీయ పిశాచి- సారీ... పిపాసి మీరు... మీకు తెలియదంటే నేను నమ్మను!’  

‘వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకొరిగిందని... ఒక సమయం వచ్చాక ఎన్ని చేసినా, ఎంత తెలిసినా ఉపయోగం ఉండదయ్యా... కాలంతో కొట్టుకుపోతాం! ఇప్పుడు గెలిచేందుకు ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పవచ్చు కదా!’

‘అయ్యో మీ స్థాయిలో నేను ఎక్కడ ఆలోచించగలను సార్‌... అసలే మీది పైశాచికత్వంలో పీహెచ్‌డీ!’
‘అసలే జనం విసిరే చెప్పులు, ఇబ్బడిముబ్బడి అప్పులతో ఊపిరి ఆడటం లేదు... నువ్వే ఏదైనా చెప్పి పుణ్యం కట్టుకో’

‘లేదు సార్‌... దిగజారడం మొదలుపెడితే మీకంటే బాగా ఎవరూ దిగిపోలేరు! ఆలోచించండి... గుండె లోతుల్లోకి వెళ్ళి, కళ్లు మూసుకుని, కుదిరితే ముక్కు కూడా మూసుకుని ఆలోచించండి! ఒక మెరుపులాంటి ఐడియా ఆ బురదబుర్రలో పుట్టకమానదు’

‘హా, ఊ, అదీ... వచ్చిందయ్యా! భూత ప్రేత పిశాచాల పనులన్నీ చేసి, ప్రజలను పిచ్చిపిచ్చిగా పీడించి ‘ఇది ముమ్మాటికీ ప్రతిపక్షాల కుట్ర’ అని సినిమాల్లోలాగా డైలాగులు కొడదాం, ఏమంటావ్‌?’
‘చెప్పానుగా సార్‌ మీకు మీరే సాటి అని... మీ అంత దుర్మార్గంగా ఆలోచించే పాలకుడు ఈ ప్రపంచంలో మరొకడు లేడంటే నమ్మండి, ఒక హిట్లర్‌... ఒక కిమ్‌... ఒక...’

‘చాలుచాలు నువ్వలా పొగుడుతుంటే నాకు సిగ్గుగా ఉంది... ఇంతకీ జనాలను ఎలా హింసిద్దాం?’
‘అది కూడా మీరే చెప్పి నా జ్ఞానజ్యోతిని వెలిగించండి మహాప్రభో!’

‘తప్పకుండా... పింఛన్ల మీదే ఆధారపడి బతుకీడిస్తున్న వృద్ధులకు ఆ పెన్షన్లు ఆపేసి వారికి నరకం చూపిద్దాం’
‘అద్భుతం!’
‘గర్భిణులు, రోగులకు సరైన వైద్యం అందకుండా చేసి ప్రతిపక్షాల వల్లే అందాం’
‘అమోఘం!’
‘ఎవరు ఎక్కడ ఏ కారణంతో మరణించినా... ప్రతిపక్షాల కుట్ర, అధికారపక్షం మీద ప్రేమతో అని ప్రచారం చేసుకుందాం’
‘సార్‌... అర్జెంటుగా మీ రెండు కాళ్లూ ఎత్తి ఈ టేబుల్‌పైన పెట్టండి, మీకు పాదపూజ చేసినా తప్పు లేదు’
‘ఊరుకోవయ్యా... అలాగే ఎక్కడికక్కడ ప్రతిపక్షాల కార్యకర్తలపై దాడులు చేసి, తిరిగి వారే మమ్మల్ని వేధిస్తున్నారంటూ కేసులు పెడదాం’
‘ఈ పని అయితే మీరు ఎప్పటినుంచో చేయిస్తున్నారు కదా’

‘ఇంకా క్రేజీగా ఏం చేయొచ్చు చెప్మా...??’

‘చిన్నపిల్లల చేతిలో చాక్లెట్‌ తీసేసుకోవడం, అపార్ట్‌మెంట్లలో కాలింగ్‌బెల్స్‌ నొక్కి పారిపోవడం, పక్కింట్లో చెత్త తెచ్చి ఎదురింట్లో వేయడం... ఇలాంటివి చేసి ఇది కూడా ప్రతిపక్షాల కుట్రే అందాం సార్‌! వారి వల్లే ఈ ఐదేళ్లు రాష్ట్రం అభివృద్ధిలో కుంటువడిందని, ఖజానాకి గంటు పడిందని... ఇలా ఎడాపెడా విమర్శలు చేద్దాం!’

‘పర్లేదయ్యా... నువ్వు కూడా బానే ముదిరావ్‌’
‘హ్హిహ్హిహ్హి... ఏదో మీ శిష్యరికంలో అలా అలా... ఇంతకీ ఇవన్నీ ప్రజలు నమ్ముతారంటారా సార్‌?’
‘నమ్మితే మన అదృష్టం’
‘నమ్మకపోతే వాళ్ల అదృష్టం కదా సార్‌’
‘ఛ... అదేంటయ్యా అపశకునం మాటలు?’
‘ఏమో సార్‌... పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్టు, మీరు కళ్లు మూసుకుని ఏకంగా కూల్‌డ్రింక్‌ తాగుతున్నారేమోనని అనుమానంగా ఉంది!’
‘అంటే...’
‘అంటే ఏముంది.. పిల్లికి కర్ర దెబ్బ, మీకు కూటమి దెబ్బ... దెబ్బకు మీరు, అబ్బా అనాలి!!’
‘ఆఁ..!!’

చంద్రమౌళిక సాపిరెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.