నియంత్రణ లేని కాలుష్య మండళ్లు

దేశవ్యాప్తంగా జల, వాయు కాలుష్యం అంతకంతకు అధికమవుతోంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు పెచ్చుమీరుతుండటంతో ఎన్నో విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. కాలుష్య కట్టడి ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రభుత్వాలకు పెను సవాలుగా మారింది. దేశంలో కాలుష్యం అధికమవుతుండటంతో వాతావరణ మార్పులు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని అనేక సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

Published : 10 Apr 2024 00:44 IST

దేశవ్యాప్తంగా జల, వాయు కాలుష్యం అంతకంతకు అధికమవుతోంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు పెచ్చుమీరుతుండటంతో ఎన్నో విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. కాలుష్య కట్టడి ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రభుత్వాలకు పెను సవాలుగా మారింది.

దేశంలో కాలుష్యం అధికమవుతుండటంతో వాతావరణ మార్పులు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయని అనేక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అయినప్పటికీ, కాలుష్య నియంత్రణ మండళ్ల పనితీరు ఏమాత్రం మెరుగుపడటం లేదు. ఉద్గారాల కట్టడికి పటిష్ఠ చట్టాలెన్నో ఉన్నప్పటికీ అలసత్వం వహించడమేమిటని తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలిని సుప్రీంకోర్టు కొద్దిరోజుల క్రితం తీవ్రంగా ఆక్షేపించింది. కాలుష్య నియంత్రణకు జిల్లా యంత్రాంగాలు సమాన బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది.

జల కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం-1974 ద్వారా పర్యావరణ పరిరక్షణే ప్రథమ కర్తవ్యంగా కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో కాలుష్య నియంత్రణ మండళ్లను (సీపీసీబీ/పీసీబీలను) కొలువుతీర్చారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ కమిటీ (పీసీసీ)లకు అధికారాలు దఖలుపరచారు. వాయు కాలుష్య నివారణ, నియంత్రణ చట్టం-1981 ద్వారా గాలి నాణ్యతను మెరుగుపరచే బాధ్యతలను కూడా వాటికి అప్పగించారు. ఆ తరవాత పర్యావరణ పరిరక్షణ చట్టం-1986తోపాటు అటవీ, జీవ వైవిధ్యం, వన్యప్రాణుల సంరక్షణ వంటి చట్టాల అమలును సైతం పీసీబీ, పీసీసీలు పర్యవేక్షించాల్సి రావడంతో వాటి బాధ్యత మరింత పెరిగింది. ముఖ్యంగా అవి ఎలెక్ట్రానిక్‌, ప్లాస్టిక్‌, రసాయన, బ్యాటరీ, బయో మెడికల్‌, నిర్మాణ, ఘన వ్యర్థాలతో పాటు శబ్ద కాలుష్యానికి సంబంధించిన నియమ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాల్సి ఉంటుంది. బాధ్యతలకు తగ్గట్లు కాలుష్య నియంత్రణ మండళ్లను బలోపేతం చేయడంలేదు. తగిన వసతులు, ఆర్థిక వనరులు లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు కొరవడటం, నిపుణ సిబ్బంది లేమికి తోడు పనిభారం అధికంగా ఉండటంతో అవి పేలవమైన పనితీరును కనబరుస్తున్నాయి. కాలుష్య నియంత్రణ సంస్థల పటిష్ఠతకు భట్టాచార్య, బెల్లియప్ప, మీనన్‌ కమిటీలు నిర్దిష్టమైన సూచనలు చేసినప్పటికీ ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడంలేదని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీసీబీ, పీసీసీల పనితీరుపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన ‘ఆడిట్‌ నివేదిక-2020’ పలు కీలక విషయాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న పీసీబీ, పీసీసీల్లో 46శాతం ఉద్యోగాలు ఖాళీగానే ఉంటున్నాయని... ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని సిబ్బంది అత్యవసర పనులకు మాత్రమే పరిమితమవుతున్నారని ఆ నివేదిక తెలిపింది. అండమాన్‌ నికోబార్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, మిజోరం, నాగాలాండ్‌,  సిక్కిం తదితర చోట్ల మాత్రమే సిబ్బంది ఖాళీలను పూర్తిస్థాయిలో భర్తీ చేశారు. కొన్ని బోర్డుల్లో సాంకేతిక సిబ్బంది కంటే పాలనా విభాగం ఉద్యోగులే ఎక్కువ! కాలుష్య నియంత్రణ, పరిశోధనల కోసం ప్రయోగశాలలు అత్యంత కీలకం. దేశంలో ఆరు కేంద్ర, మూడు ప్రాంతీయ ప్రయోగశాలలకు మాత్రమే అన్నిరకాల అనుమతులు ఉన్నాయి. అన్ని పీసీబీ, పీసీసీలు తగినంతమంది విశ్లేషకులను    నోటిఫై చేయాల్సి ఉంటుంది. కానీ 13 కాలుష్య నియంత్రణ సంస్థలు ఒక్క విశ్లేషకుణ్నీ నోటిఫై చేయలేదు. చాలా రాష్ట్రాలు కనీసం తమకంటూ ప్రత్యేకంగా పర్యావరణ విధానాలనుగాని, నివేదికలనుగాని రూపొందించలేదు. పలు రాష్ట్రాలకు సమగ్రమైన పారిశ్రామిక విధానమే లేదు. అన్నిచోట్లా బయో మెడికల్‌ వ్యర్థాల నిర్వహణ నియమాలు మాత్రం కొంతవరకు అమలవుతున్నాయి. బ్యాటరీ నిర్వహణ నియమాలను 2001లోనే అమలులోకి తెచ్చినప్పటికీ, చాలా సంస్థలకు తగినంత అవగాహన ఉండటంలేదని ఆడిట్‌ నివేదిక విశ్లేషించింది.

కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు, కమిటీల పనితీరును మెరుగు పరచడానికి వాటిలో విద్యావేత్తలతోపాటు న్యాయ, ఆరోగ్య, సాంకేతిక నిపుణులకు భాగస్వామ్యం కల్పించాలి. సిబ్బందికి నిరంతరం శిక్షణ ఇస్తూ, వారి సామర్థ్యాలను మెరుగుపరచాలి. పీసీబీ, పీసీసీల ఛైర్మన్‌, కార్యదర్శులను కనీసం మూడేళ్లపాటు పదవుల్లో కొనసాగించాలి. కాలుష్య నియంత్రణ చర్యలను సమర్థంగా పర్యవేక్షించడం కోసం కృత్రిమ మేధ(ఏఐ), యంత్ర భాష(ఎంఎల్‌) వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించడం మేలు. అన్ని జోన్లలోనూ నమూనాలను పరీక్షించేందుకు ప్రయోగశాలలను నెలకొల్పాలి. కాలుష్య నియంత్రణ సంస్థల్లో పరిపాలన, సాంకేతిక విభాగాల సిబ్బంది బాధ్యతలను విభజించి, క్షేత్రస్థాయి తనిఖీలను జోరెత్తించాలి. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడమూ ఎంతో కీలకం. దేశాభివృద్ధికి పర్యావరణహితకరమైన విధానాలనే అనుసరించాలి. ఆ దిశగా ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు, ప్రజలు కలిసికట్టుగా కృషి చేయాలి.

ఎ.శ్యామ్‌కుమార్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.