రాజకీయ భాష్యాలు

‘స్వామీ అబద్ధం అంటే ఏమిటి?’ ‘నిజం కానిదంతా అబద్ధమే?’ ‘మరి నిజం అంటే...? అబద్ధం కానిది అని అడ్డదిడ్డంగా సమాధానం చెప్పకండి. సరిగ్గా వివరించండి’ ‘అసందర్భ, అశాస్త్రీయ, బూటకపు మాటలు... ఇలాంటివన్నీ అబద్ధాలే నాయనా’

Published : 16 Apr 2024 00:41 IST

‘స్వామీ అబద్ధం అంటే ఏమిటి?’
‘నిజం కానిదంతా అబద్ధమే?’
‘మరి నిజం అంటే...? అబద్ధం కానిది అని అడ్డదిడ్డంగా సమాధానం చెప్పకండి. సరిగ్గా వివరించండి’
‘అసందర్భ, అశాస్త్రీయ, బూటకపు మాటలు... ఇలాంటివన్నీ అబద్ధాలే నాయనా’
‘ఒక్క ముక్కలో రాజకీయ నాయకుల మాటలు, హామీలు అని చెప్పవచ్చుగా స్వామీ’
‘ఆ సంగతి అందరికీ తెలిసిందే కదా?’
‘ముఖ్యంగా ఆ నాయకుడి గురించి చెప్పుకోవాలి! మాట తప్పను... మడమ తిప్పను అన్నాడు. ఒక్క మాట నిలబెట్టుకోలేదు. మద్యం నిషేధించకుండా మళ్ళీ ఓటు అడగను అన్నాడు. అడ్డమైన బ్రాండ్లను వదిలి పేదల ప్రాణాలు తీస్తున్నాడు. ఇది ఆడి తప్పడం, మడమ తిప్పడమే కదా... అంటే అబద్ధమేగా స్వామీ?’
‘అందులో సందేహం ఏముంది?’
‘మరి మోసం అంటే ఏమిటి స్వామీ?’
‘అబద్ధాన్ని నిజమని నమ్మించాలనుకోవడం, నిరూపించాలనుకోవడం మోసం నాయనా’
‘త్రివిక్రమ్‌ సినిమాలు మేమూ చూశాంగానీ, తిన్నగా చెప్పండి స్వామీ’
‘బూటకపు మాటలతో బోల్తా కొట్టించడమే కాకుండా, బురిడీ కొట్టినట్లు తెలియకుండా దాన్నే నమ్మించాలనుకోవడం... అంటే- మేనేజ్‌ చేయడం అనుకోవచ్చు’
‘అడ్డగోలుగా అప్పులు చేసి అరకొరగా జనానికి పంచేసి, మిగిలినదంతా మింగేసి, అదే అద్భుతమైన అభివృద్ధి అని ఊదరగొట్టడం... అబద్ధాన్ని నిజమని నిరూపించాలనుకోవడమేగా... అంటే మోసమేగా?’
‘అంతేగా... అంతేగా’
‘ద్రోహం అంటే ఏమిటి స్వామీ?’
‘ఏమిటి నాయనా ఈ రోజు అన్నీ ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావ్‌. స్వార్థానికి అయినవారిని వాడుకొని వదిలేయడం...’
‘ఆపదలో ఉన్న సమయంలో అండగా నిలబడిన అయిన వారిని అవసరం తీరాక పక్కకు తరిమేయడం, అధికారం కోసం బంధువులను బలిపెట్టడం ద్రోహమే... నమ్మక ద్రోహమే. మరి భ్రాంతి అంటే ఏమిటి స్వామీ?’
‘ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. మనకు కలిగే భ్రాంతి, మరొకరు కలిగించే భ్రాంతి’
‘నిజమే స్వామీ! ఎంతటి పచ్చి తాగుబోతైనా మన అన్న తయారు చేయించే మద్యం తాగితే తప్పకుండా గుర్తుతెలియని భ్రాంతికి గురవుతాడు. అప్పుడప్పుడూ ప్రాణాలూ వాయుసంలీనం చెందవచ్చు. ఇది మొదటి రకం భ్రాంతి. రోడ్లు లేకపోయినా, పరిశ్రమలు రాకపోయినా, ఆరోగ్య వసతులు అడుగంటి పోయినా, చదువులు పాడైనా, చెత్త పన్నులతో జేబులు ఖాళీ అయిపోయినా, కరెంటు బిల్లులతో ఎడాపెడా బాదేస్తున్నా... బటన్‌ నొక్కుళ్లతో బతుకులు వెలిగిపోతున్నాయని ఊదరగొడుతుంటే అదే అభివృద్ధి అనుకోవడం రెండో రకం భ్రాంతి. రాష్ట్రం మొత్తాన్ని ఈ రెండు రకాల భ్రాంతుల్లోనే ముంచెత్తుతున్నారు స్వామీ’
‘నీ మాటలు వింటుంటే ఆ అవస్థల కంటే సన్యాసమే నయం అనిపిస్తోంది. ఆ మధ్య సినిమాను మించిన సెట్టింగులు వేసి నీళ్లు వదిలారటగా... అదీ రెండో రకం భ్రాంతి కిందకే వస్తుంది’
‘అవునవును... ఇక ఎప్పుడూ వార్తల్లో ఉంటూ ఎప్పటికీ పూర్తిగా అర్థం కాని ఒక పదం ఉంది. అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో రకంగా అనిపిస్తూ ఉంటుంది. అదే అవినీతి. దాని సంగతేమిటో చెప్పండి’
‘అక్రమం, అధర్మం, అన్యాయం, దుష్కర్మాచరణ... ఇలాంటివన్నీ అవినీతి కిందకే వస్తాయి’
‘అబ్బే... ఆ పదాలు చాలా తేలిగ్గా అనిపిస్తున్నాయి స్వామీ. మన నాయకుడి అకృత్యాలను వర్ణించాలంటే డోసు బాగా పెంచి కొత్త పదాలు కనిపెట్టాల్సిందే. భూములు, ఇసుక, మైనింగ్‌... ఒకటేమిటి- జాతి సంపద మొత్తం దోచేశారు. జనాన్ని మద్యంలో, గంజాయిలో ముంచేశారు. హత్యలు జరిగిపోతున్నాయి. ఏకంగా కుటుంబాలే ఆత్మహత్యలకు పాల్పడే విధంగా చేస్తున్నారు. పైగా ప్రతి మీటింగులోనూ అవినీతి రహిత పాలన అందించామని అన్న అరచి మరీ చెబుతున్నాడు. మొత్తానికి అవినీతికీ¨ కొత్త భాష్యాలు సృష్టించాడు. ఇక వ్యామోహం అంటే ఏమిటో కూడా సెలవివ్వండి స్వామీ’
‘నీ రాజకీయ భాషలోనే చెబుతా విను. తన మన భేదం లేకుండా అందరినీ ముంచేసి, వీలైనంతమందిని బెదిరించి, అక్రమంగా లోపలేసి, అవసరమైతే అడ్రస్‌ గల్లంతు చేసి, అధికార కుర్చీకి అంటకాగాలనుకోవడమే వ్యామోహం... రాజకీయ వ్యామోహం నాయనా!’
‘ఆహా... మహ బాగా చెప్పారు. మీకూ రాజకీయం ఒంటపట్టింది. సరే... చివరిగా అదృష్టం అంటే ఏమిటో బోధపరచండి’
‘లక్షల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు, వేల కోట్ల రూపాయల అక్రమాల చార్జిషీట్లు, పదుల సంఖ్యలో కేసులు ఉన్నా... పదేళ్లుగా బెయిలుపై రాజుగా ఉండటం కంటే మించిన అదృష్టం ఏముంటుంది నాయనా’
‘మహ బాగా చెప్పారు... చిట్టచివరిగా దురదృష్టం గురించీ చెప్పేయండి’
‘అలాంటి నాయకుడి పాలనలో ఉండటాన్ని మించిన దురదృష్టం ఏముంటుంది. నిన్న ఆయన యాత్ర ఇటువైపు వెళ్ళిందట కదా... పచ్చని చెట్లు ఎలా నరికేశారో చూడు. త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి కదా... ఆ నాయకుడి సంగతి అందరూ ఆలోచించాలి మరి!’

ఎమ్మెస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.