Namita: కన్నా.. నీ రాక కోసమే ఎదురుచూస్తున్నా!

పెళ్లైన ప్రతి స్త్రీ అమ్మతనం కోసం ఆరాటపడుతుంది. ఈ మధుర క్షణం కోసం ఏళ్లుగా వేచి చూస్తుంది.

Published : 12 May 2022 12:46 IST

పెళ్లైన ప్రతి స్త్రీ అమ్మతనం కోసం ఆరాటపడుతుంది. ఈ మధుర క్షణం కోసం ఏళ్లుగా వేచి చూస్తుంది. ఇక ఈ ఎదురుచూపులు ఫలించిన వేళ ఆమె ఆనందానికి అవధులుండవు. ప్రస్తుతం ఇలాంటి మధురానుభూతినే ఆస్వాదిస్తోంది టాలీవుడ్‌ ముద్దుగుమ్మ నమిత. తాను త్వరలో అమ్మ కాబోతున్నట్లు ఇన్‌స్టా వేదికగా ప్రకటించిందీ అందాల తార. బ్లాక్‌ డ్రస్‌లో బేబీ బంప్‌ని చూపిస్తూ తీయించుకున్న ఫొటోల్ని తన పుట్టిన రోజు సందర్భంగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఈ గుజరాతీ బ్యూటీ.. కాబోయే తల్లిగా తన అనుభూతుల్ని క్యాప్షన్‌గా జోడించింది.

‘సొంతం’, ‘జెమిని’, ‘బిల్లా’.. వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నమిత.. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ సినిమాలతో బిజీగా మారిపోయింది. తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌ - 1లో పాల్గొని బుల్లితెర పైనా అలరించింది. 2017లో సహ నటుడు వీరేంద్ర చౌధరిని ప్రేమ వివాహం చేసుకున్న ఆమె.. తన జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది.

పుట్టిన రోజు కానుక!

మే 10న నమిత పుట్టినరోజు. ఈ సందర్భంగా తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించి తన ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తిందీ చిన్నది. బ్లాక్‌ డ్రస్‌లో బేబీ బంప్‌ కనిపిస్తోన్న ఫొటోల్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఈ ముద్దుగుమ్మ.. కాబోయే తల్లిగా తన మధురానుభూతుల్ని క్యాప్షన్‌గా రాసుకొచ్చింది.

‘అమ్మతనం.. నా జీవితంలో ఓ సరికొత్త అధ్యాయం మొదలైంది. నన్ను మరింత ప్రేమగా, ఆప్యాయంగా మార్చింది. కన్నా.. ఇన్నాళ్లూ నీ కోసమే ఎదురుచూశా.. నీ రాక కోసమే ప్రార్థనలు చేశా. కడుపులో నీ కదలికలు నన్ను అమితమైన ఆనందంలో ముంచెత్తుతున్నాయి. నువ్వు నన్ను ముందెన్నడూ లేనంత కొత్తగా, ప్రత్యేకంగా, సంతోషంగా మార్చేశావు..’ అంటూ కాబోయే తల్లిగా తన మనసులోని భావాల్ని అక్షరీకరించిందీ చక్కనమ్మ. ఇలా నమిత పెట్టిన పోస్ట్‌కు అటు సెలబ్రిటీల దగ్గర్నుంచి ఇటు సామాన్యుల దాకా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

అందుకే ఆఫర్లు తగ్గాయేమో అనేవారు!

నటించింది కొన్ని సినిమాలే అయినా తన అందం, అభినయంతో తెలుగువారిని ఆకట్టుకుంది నమిత. అయితే కెరీర్‌లో నిలదొక్కుకుంటున్న సమయంలోనే విపరీతంగా బరువు పెరిగిపోయిందీ అందాల తార. దాంతో లావవడం వల్లే కెరీర్‌లో ఆఫర్లు తగ్గిపోయాయేమోనని అందరూ ఆమెను ఆడిపోసుకున్నారు. ఇలాంటి సమయంలో విపరీతమైన ఒత్తిడికి గురయ్యానని, అది నా అధిక బరువుపై మరింత ప్రతికూల ప్రభావం చూపిందని ఓ సందర్భంలో తన ఫ్యాట్‌ టు ఫిట్‌ జర్నీని పంచుకుందీ సొగసరి.

మూడు నెలలు.. 20 కిలోలు!

‘బరువు తగ్గాలని వ్యాయామాలు చేశా.. చికిత్సలు తీసుకున్నా.. నాకిష్టమైన ఐస్‌క్రీమ్స్‌, పిజ్జాలు కూడా వదులుకున్నా. అయినా లాభం లేకపోవడంతో ఫిట్‌నెస్‌ సెంటర్‌లో చేరా.. నిరాశతోనే అందులో చేరినా.. అక్కడి నిపుణులు సూచించిన వ్యాయామాలు, డైట్‌ ఛార్ట్‌ని ఫాలో అయ్యేసరికి కొన్ని రోజుల్లోనే నా బరువు విషయంలో మార్పు కనిపించింది. దాంతో నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఫాస్ట్‌ ఫుడ్‌/ప్రాసెస్డ్‌ ఫుడ్‌ పక్కన పెట్టి.. రోటీ, పప్పు, సబ్జీ (కాయగూరలన్నీ కలిపి తయారుచేసే కర్రీ), సూప్స్‌, సలాడ్స్‌, నట్స్‌.. వంటివే ఎక్కువగా తీసుకున్నా. వీటితో పాటు నిరంతరం శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం అలవాటు చేసుకున్నా. బరువులెత్తడం, పిలాటిస్‌, పుషప్స్‌, బైసెప్స్‌, యోగా.. వంటి వ్యాయామాలు నాకు సత్ఫలితాలను అందించాయి. తద్వారా మూడు నెలల్లోనే 20 కిలోలు తగ్గా.. ఇప్పటికీ ఈ నియమాలతో పాటు న్యూట్రిషనిస్ట్‌ రుజుతా దివేకర్‌ టిప్స్‌ కూడా పాటిస్తున్నా..’ అంటూ చెప్పుకొచ్చింది నమిత.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్