మా అత్తమ్మలు బంగారం!

అత్తాకోడళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందంటారు.. ఒకే ఇంట్లో ఉంటే ఇద్దరికీ పొసగదంటుంటారు. కానీ అత్తగారితో తమకున్న అనుబంధం ఎంతో అన్యోన్యమైనదని, ప్రత్యేకమైనదని చెబుతున్నారు కొందరు సినీ తారలు. అమ్మగా ప్రేమను పంచడం, స్నేహితురాలిగా మార్గనిర్దేశనం....

Published : 01 Nov 2022 12:44 IST

(Photos: Instagram)

అత్తాకోడళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందంటారు.. ఒకే ఇంట్లో ఉంటే ఇద్దరికీ పొసగదంటుంటారు. కానీ అత్తగారితో తమకున్న అనుబంధం ఎంతో అన్యోన్యమైనదని, ప్రత్యేకమైనదని చెబుతున్నారు కొందరు సినీ తారలు. అమ్మగా ప్రేమను పంచడం, స్నేహితురాలిగా మార్గనిర్దేశనం చేయడం.. అత్తగారంటే ఇలా ఆప్యాయతకు మారుపేరు అంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ముద్దుగుమ్మలు అత్తగారితో తమకున్న అనుబంధం గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం రండి..

‘కిట్టో’ అని పిలుస్తారు!

కొత్తగా మెట్టినింట్లో అడుగుపెట్టిన కోడలికి తమ ఇంటి సంప్రదాయాలు పరిచయం చేయడం, ఆహార పద్ధతులు వివరించడం అత్తగారికి అలవాటే! పెళ్లయ్యాక తనకూ తన అత్తయ్య వీణా కౌశల్‌ పంజాబీ రుచుల్ని పరిచయం చేశారని చెబుతోంది డింపుల్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌. బ్రిటన్‌లో పుట్టి పెరిగినా.. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాక ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాల్ని ఒంటబట్టించుకుందామె. ఇక గతేడాది బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌ను పెళ్లాడాక.. ఇండియానే తన మెట్టినిల్లుగా మారిపోయింది. అప్పట్నుంచి ప్రతి పండగను, ప్రత్యేక సందర్భాన్ని కౌశల్‌ కుటుంబంతో జరుపుకొంటూ ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటుంది క్యాట్‌. ఇక ఇటీవలే ‘కపిల్‌ శర్మ షో’లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. అత్తగారితో తనకున్న అనుబంధాన్ని ఇలా బయటపెట్టింది.
‘పెళ్లి తర్వాత అత్తయ్యే నాకు అమ్మైంది. తన చేతి వంటకాల్ని ప్రేమగా వండి వార్చుతుంటారామె. విక్కీ వాళ్లింట్లో పరాఠాలు ఎక్కువగా తింటుంటారు. అందుకే పెళ్లైన కొత్తలో అత్తమ్మ నా కోసం ఇవి చేసి పెట్టేవారు. కానీ నేను డైట్‌లో ఉండడం వల్ల వీటిని తినేదాన్ని కాదు. అయినా తన మనసు నొప్పించలేక వాటి రుచి చూసేదాన్ని. ఆ తర్వాత్తర్వాత నా కఠిన ఆహార నియమాలు అర్థం చేసుకొని.. చిలగడదుంపలతో వంటకాలు చేసి పెడుతున్నారు. ఇక ఇంట్లో అత్తయ్య, మామయ్య నన్ను ముద్దుగా కిట్టో అని పిలుస్తారు.. విక్కీ గురించి చెప్పాలంటే తనో మంచి గాయకుడు.. నాకు నిద్ర పట్టనప్పుడల్లా ఓ మంచి పాటతో నన్ను నిద్ర పుచ్చుతాడు..’ అంటూ మురిసిపోయిందీ చక్కనమ్మ.


తను నా బెస్ట్‌ ఫ్రెండ్!

అత్తాకోడళ్ల మధ్య స్నేహబంధం చిగురించినప్పుడే ఆ ఇల్లు స్వర్గమవుతుందంటున్నారు ఈ తరం అత్తాకోడళ్లు నీతూ కపూర్‌-ఆలియా భట్‌. ఈ ఏడాది ఏప్రిల్‌లో తన ఇష్టసఖుడు రణ్‌బీర్‌ కపూర్‌ను పెళ్లాడి కపూర్‌ కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టిందీ బాలీవుడ్‌ బ్యూటీ. ఇక పెళ్లికి ముందే తన అత్తగారితో తనకు మంచి స్నేహబంధం ఉందంటోన్న ఆలియా.. ప్రస్తుతం అది రోజురోజుకీ రెట్టింపవుతోందంటూ తామిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ఓ సందర్భంలో ఇలా పంచుకుంది.

‘అత్తయ్య నీతూను మొదటిసారి కలిసినప్పట్నుంచి మా మధ్య అనుబంధం రోజురోజుకీ దృఢంగా మారుతోంది. ప్రతి విషయంలోనూ ప్రోత్సహించే వ్యక్తి తను. అంతకుమించి సానుకూల దృక్పథం, కలుపుగోలుతనం ఎక్కువ. నాతో ఎంతో సరదాగా ఉంటుంది. ఇక మా పెళ్లిలో ఆమెను దగ్గర్నుంచి గమనించిన నా స్నేహితులు.. ‘మీ అత్తగారు చాలా సరదాగా, ఫ్రెండ్లీగా ఉన్నారు.. నువ్వు చాలా అదృష్టవంతురాలివి..’ అన్నారు. అందుకు తగ్గట్లుగానే పెళ్లి తర్వాత అత్తయ్య నాతో ఓ మాట చెప్పారు.. ‘నేను నీకు అత్తయ్యను మాత్రమే కాదు.. అంతకంటే ముందు మంచి ఫ్రెండ్‌ని.. ఏ విషయాన్నైనా నాతో నిర్మొహమాటంగా పంచుకోవచ్చు..’ అని! ఈ మాటలు తనకు నేను మరింత దగ్గరయ్యేలా చేశాయి. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న నన్ను అత్తయ్య ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు.. ఓ స్నేహితురాలిగా నాకు సలహాలిస్తున్నారు.. ఇంత మంచి అత్తగారికి కోడలినవడం నా పూర్వ జన్మ సుకృతం..’ అంటోంది ఆలియా. ప్రతి విషయాన్నీ పాజిటివ్‌గా తీసుకునే నీతూ.. ఎంత చలాకీగా, సరదాగా ఉంటారో ఆలియా-రణ్‌బీర్‌ పెళ్లిలో మనం చూశాం.


ఆ విషయంలో అత్తయ్యే స్ఫూర్తి!

తన వృత్తికి ఎంత ప్రాధాన్యమిస్తుందో.. కుటుంబానికీ అంతే ప్రాముఖ్యతనిస్తుంటుంది టాలీవుడ్‌ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌. ఈ క్రమంలోనే ప్రతి సందర్భంలోనూ తన భర్త-కొడుకు, ఇతర కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోతుంటుంది. అయితే వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ విషయంలో తనలో స్ఫూర్తి నింపిన వ్యక్తుల్లో తన అత్తగారు ధీరా కిచ్లూ ముందు వరుసలో ఉంటారంటోందీ చందమామ. విద్యావేత్త, పిల్లల రచయిత్రి అయిన ధీరా రాసిన పుస్తకాల్ని అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే కాజల్‌.. తన అత్తగారితో తనకున్న అనుబంధాన్ని ఓ సందర్భంలో ఇలా నెమరువేసుకుంది.

‘అత్తయ్య ధీరా రాసిన పుస్తకాలంటే నాకు భలే ఇష్టం. ముఖ్యంగా 2-5 ఏళ్ల పిల్లలకు ఈ పుస్తకాలు బోలెడన్ని విషయాలు నేర్పుతాయి. అందుకే వీటిలో కొన్ని పుస్తకాల్ని నా చెల్లెలు నిషా కొడుకు ఇషాన్‌కు ఇచ్చాను. ఇది తన తెలివితేటల్ని పెంచడానికి ఎంతో ఉపయోగపడడం ప్రత్యక్షంగా చూశాను. అత్తయ్య నిజంగా చాలా టాలెంటెడ్‌. తన ప్రతిభ, నైపుణ్యాలతో ఇంట్లో అందరిలో స్ఫూర్తి నింపుతుంటారు. ఇలాంటి స్ఫూర్తిదాయక మహిళ నా జీవితంలో ఉండడం నా అదృష్టం!’ అంటోంది కాజల్‌. రెండేళ్ల క్రితం గౌతమ్‌ కిచ్లూను వివాహం చేసుకుందీ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఈ జంటకు నీల్ అనే కొడుకున్నాడు. ఓవైపు అమ్మగా, మరోవైపు తన కెరీర్‌ని కొనసాగిస్తూ.. తన అత్తగారి అడుగుజాడల్లో నడుస్తున్నానంటోందీ అందాల తార.


మా అభిరుచులూ కలిశాయి!

సాధారణంగా అత్తాకోడళ్ల ఆలోచనలు కలవడం అరుదు. అలాంటిది ఆలోచనలతో పాటు అభిరుచులూ కలిస్తే.. ఆ బంధం ఎంత అన్యోన్యంగా ఉంటుందో కదూ! అందుకు తామే ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌, ఆమె అత్తగారు ప్రియా అహుజా. కొత్త కొత్త ఫ్యాషన్లు ఫాలో అవడం సోనమ్‌కి ఎంతిష్టమో మనకు తెలిసిందే! అలాగే తన అత్తగారికి కూడా ఫ్యాషనబుల్‌గా, అందంగా ముస్తాబవడమంటే ఇష్టమని చెబుతోందీ కపూర్‌ బ్యూటీ.
‘అత్తయ్య ఎంత పరిణతితో ఆలోచిస్తారో.. ఇంట్లో అంత కూల్‌గా ఉంటారు. ఫ్యాషనబుల్‌గా, అందంగా ముస్తాబవడమంటే తనకు బాగా ఇష్టం. లాక్‌డౌన్‌ సమయంలో మా ఇద్దరికీ కలిసి గడిపే సమయం దొరికింది. అప్పుడు ఇద్దరం కలిసి కొత్త ఫ్యాషన్లు ప్రయత్నించడం, అందంగా ముస్తాబవడం, బేకింగ్‌ చేయడం.. ఇలా ఈ సమయంలో మా మధ్య అనుబంధం మరింత రెట్టింపైంది. ఆమె ప్రేమ, నిస్వార్థం, ఓపిక.. నాలో స్ఫూర్తి నింపుతూనే ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అత్తయ్య నాకు మరో అమ్మ. ఇక ఇద్దరం కలిసి దిగిన ఫొటోలు పోస్ట్‌ చేసినప్పుడు చాలామంది.. ‘తను నీకు అక్కలా ఉంది’ అంటుంటారు..’ అని నవ్వేస్తోందీ సొగసరి. 2018లో ఫ్యాషనర్‌ ఆనంద్‌ అహుజాను వివాహమాడిన సోనమ్‌.. ఈ ఏడాది ఆగస్టులో వాయు అనే కొడుక్కి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే!


ఆ నెగెటివిటీ మా మధ్య రానివ్వం!

అత్తాకోడళ్ల మధ్య పొరపచ్ఛాలు రావడానికి ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదరకపోవడమే అంటుంటారు చాలామంది. కానీ ఇలాంటి ప్రతికూలతలకు తమ మధ్య తావు లేదంటున్నారీ చలాకీ అత్తాకోడళ్లు సమీరా రెడ్డి-మంజ్రీ వర్దే. తల్లీకూతుళ్లకు మించిన అనుబంధం వీరి మధ్య ఉందని వాళ్ల పోస్ట్‌ చేసే ఫొటోలు, సరదాగా చేసే వీడియోలే నిరూపిస్తాయి.

‘నాకు, మా అత్తగారికి మధ్య ఊహకందని అన్యోన్యమైన అనుబంధం ఉంది. ఇద్దరం శక్తిమంతమైన మహిళలం. ఒకరి ఆలోచనల్ని, అభిప్రాయాల్ని మరొకరం గౌరవిస్తాం.. అంగీకరిస్తాం! ప్రేమను ఇచ్చిపుచ్చుకుంటాం. ఇలా ఒకరి స్వేచ్ఛను మరొకరు హరించనంత వరకు ఇద్దరి మధ్య అనుబంధంలో ఎలాంటి ప్రతికూలతలు దరిచేరవు. మా అనుబంధ రహస్యం కూడా అదే!’ అంటోంది సమీర. అత్తాకోడళ్లే అయినా తల్లీకూతుళ్లలా అల్లుకుపోయే వీరిద్దరూ.. సందర్భానుసారం, సరదాగా చేసే వీడియోలు ‘Messy Mama Sassy Saasu’ పేరుతో సోషల్‌ మీడియాలో వైరలవడం మనకు తెలిసిందే!


మా అత్తమ్మ బంగారం!

ప్రతి మహిళ జీవితంలో తన అత్తమ్మ సురేఖ లాంటి అత్తగారు ఉండాలంటోంది కొణిదెల వారి కోడలు పిల్ల ఉపాసన. హీరో రామ్‌చరణ్‌తో తన అనుబంధాన్ని నిత్యనూతనం చేసుకుంటూ ముందుకు సాగుతోన్న ఉప్సీ.. మెట్టినింటితో తనకున్న అనుబంధాన్ని సందర్భానుసారం ఫొటోలు, పోస్టుల రూపంలో పంచుకుంటుంది. ముఖ్యంగా తన అత్తమ్మ సురేఖతో దిగిన ఫొటోల్ని, పండగలు-ప్రత్యేక సందర్భాల్లో గడిపిన క్షణాల్ని అభిమానులతో పంచుకుంటూ మురిసిపోతుంటుంది ఉపాసన.
‘అత్తమ్మా.. చెర్రీతో నా వైవాహిక బంధానికి పునాది మీరే! చరణ్‌లాంటి మనసున్న భర్తను నాకు బహుమతిగా ఇచ్చినందుకు థ్యాంక్యూ! ఈ ప్రపంచంలోనే అత్యుత్తమ అత్తగారు మీరు!’ అంటూ సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఓ మరపురాని పోస్ట్‌ పెట్టింది మిసెస్‌ చెర్రీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్