Updated : 11/11/2021 21:11 IST

చేతిలో చెయ్యేస్తే ప్రయోజనాలెన్నో..!

'చేతిలోన చెయ్యేసి చెప్పేయవా.. నిన్ను ఎన్నడూ.. విడిపోనని..' అంటూ ప్రేయసీ ప్రేమికులు ఒకరి చేతిలో మరొకరు చేతులేసి బాసలు చేసుకోవడం మనకు తెలిసిందే. ఇదే కాదు.. కొంతమంది ఎక్కడికెళ్లినా భాగస్వామి చెయ్యి పట్టుకొని నడవడం మనం చూస్తూనే ఉంటాం. మన ప్రేయసి లేదా ప్రియుడు లేక జీవిత భాగస్వామి చేతిని మొదటిసారి పట్టుకున్న సందర్భం మనకు జీవితాంతం గుర్తుంటుంది. ప్రేమను వ్యక్తం చేయడానికి ఎక్కువగా మనం ఉపయోగించే పద్ధతుల్లో చేతులు పట్టుకోవడం కూడా ఒకటి. అయితే ఇలా చేతులు పట్టుకోవడం వల్ల కేవలం భార్యాభర్తలు/ ప్రేమికుల మధ్య ప్రేమ పెరగడమే కాదు.. మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

దృఢమైన బంధానికి..

భాగస్వామి మీ చేయి పట్టుకుంటే మీలో వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లవుతుంది కదా.. అంతేకాదు.. మీరు ఒకరికొకరు 'నేను నీ పట్ల నిబద్ధతతో ఉన్నా..' అన్న భావాన్ని అందించడానికి ఇది ఉపయోగపడుతుందట. ఇలా చేతులు పట్టుకొని నడవడం లేదా కూర్చోవడం వల్ల ఏం మాట్లాడకపోయినా ఒకరి మనసులో ఉన్న భావాలు మరొకరికి అర్థమవుతాయి. ఒకరంటే మరొకరికి ఉన్న ఫీలింగ్స్‌ని పెంచేందుకు కూడా ఇది తోడ్పడుతుందట.

ఒకరికొకరు దగ్గరయ్యేలా..

ఇద్దరు వ్యక్తులు ఒకరి చేతులు మరొకరు పట్టుకోవడం వల్ల వారిద్దరూ ఒకరికొకరు మరింత దగ్గరవుతారట. ఇలా చేతులు పట్టుకోవడం వల్ల ఎప్పుడూ వారితో కలిసి ఉన్న భావన కలగడమే దీనికి కారణం. 'నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను. నీకు తోడుగా నిలుస్తాను' అని చెప్పేందుకు ఇంతకంటే మంచి విధానం లేదనే చెప్పుకోవాలి. అంతేకాదు.. ఒకరికొకరు సహకారం అందిస్తామని చెప్పేందుకు కూడా ఇది చక్కటి మార్గం. అందుకే భార్యాభర్తలు పెళ్లిలో చేతులు పట్టుకొని నడుస్తూ తాము భాగస్వామికి తోడుంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని ప్రమాణాలు చేయడం మనం చూస్తాం.

ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది..

'నువ్వు తోడుంటే చాలు.. లోకంలో ఎన్ని కష్టాలెదురైనా వాటిని తట్టుకొని నిలబడే శక్తి నాకుంది..' అంటూ ప్రేమికులు ఒకరికొకరు చెప్పుకోవడం మనం చూస్తూనే ఉంటాం. భాగస్వామి తోడుంటే ఎన్ని కష్టాలైనా, నొప్పులైనా తట్టుకోగలిగే శక్తి మనలో ఉన్నట్లే అనిపిస్తుంది. చేతులు పట్టుకోవడం వల్ల ఇది మరింత ఎక్కువవుతుంది. నచ్చినవారి చేయి పట్టుకోవడం వల్ల నొప్పి తగ్గుతుందని.. బాధను త్వరగా మర్చిపోయే వీలుంటుందని వైద్యులే చెబుతుంటారు. అంతేకాదు.. చేతులు పట్టుకోవడం వల్ల రక్తపోటు కూడా తగ్గుతుందట. దీంతో గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయట! చేతులు పట్టుకోవడం వల్ల విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్ వల్ల ఒత్తిడి కూడా చిత్తవుతుందట.

ప్రేమను పెంచుతుంది..

ప్రేమించిన వారి చేయి పట్టుకొని నడుస్తుంటే మనసులో ఉన్న భయాలన్నీ మాయమవుతాయి. వినడానికి సినిమా డైలాగ్‌లా అనిపించినా ఇది నిజమేనని నిపుణులు చెబుతున్నారు. చేతులు పట్టుకోవడం వల్ల మన శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయట. అవి నెగెటివ్ ఫీలింగ్స్ అయిన భయం, ఒత్తిడి, బాధలను తగ్గించి పాజిటివ్ ఫీలింగ్స్ అయిన ప్రేమ, నమ్మకం వంటివి పెంచి బంధాలను దృఢపరుస్తాయి. మొత్తంగా చూసుకుంటే చేతులు పట్టుకోవడం వల్ల ఇద్దరి మధ్య దగ్గరితనం కూడా పెరుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.


Advertisement

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి