Published : 13/10/2021 19:28 IST

పెళ్లికి ముందే ఆ శుభవార్త చెప్పేశారు!

రెండు హృదయాలను కలిపే అందమైన బంధం ప్రేమ. పెళ్లితో అది నిండు నూరేళ్ల అనుబంధమవుతుంది. అలాంటి అనుబంధం సంపూర్ణమయ్యేది ఎప్పుడు అంటే ఇద్దరు ముగ్గురైనప్పుడే! అయితే పెళ్లయ్యాకే మహిళలు గర్భం దాల్చడం, పండంటి బిడ్డకు జన్మనివ్వడం.. మన దేశ సంప్రదాయం. కానీ రాన్రానూ పాశ్చాత్య పోకడలు మన దేశం వారిపైనా ప్రభావం చూపడం, ఇతర దేశాలకు చెందిన సినీ తారలు ఇక్కడి అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడం లేదంటే ఇక్కడి నటీమణులు అక్కడబ్బాయిల్ని మనువాడడంతో.. పెళ్లికి ముందే గర్భం ధరించడం ఈరోజుల్లో కామనైపోయింది. ఇందుకు తాజా ఉదాహరణే బాలీవుడ్‌ భామ ఫ్రిదా పింటో.

తన ప్రియుడు కోరీ ట్రాన్‌తో కలిసి తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నానంటూ ఈ ఏడాది జూన్‌లో ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిందీ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు తన సీమంతం ఫొటోలు పంచుకుంటూ రాబోయే బుజ్జాయి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నానంటోంది. అయితే ఫ్రిదా ఒక్కర్తే కాదు.. గతంలోనూ కొందరు ముద్దుగుమ్మలు పెళ్లికి ముందే గర్భం ధరించి వార్తల్లో నిలిచారు. ఆపై వివాహబంధంతో తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకున్నారు. ఇంతకీ వాళ్లెవరో తెలుసుకుందాం రండి..

ఫ్రిదా పింటో

నెలలు నిండుతున్న కొద్దీ పుట్టబోయే బుజ్జాయి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది తల్లి మనసు.. ఈ క్రమంలో నిర్వహించే సీమంతం వేడుక ఆమె ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.. ఎన్నెన్నో మధురమైన జ్ఞాపకాల్ని అందిస్తుంది. ప్రస్తుతం అలాంటి మధురానుభూతుల్లో తేలియాడుతోంది బాలీవుడ్‌ అందాల తార ఫ్రిదా పింటో. తన బాయ్‌ఫ్రెండ్‌/కాబోయే భర్త కోరీ ట్రాన్‌తో కలిసి తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నానంటూ ఈ ఏడాది జూన్‌లో తన ప్రెగ్నెన్సీ గురించి బయటపెట్టిందీ ‘స్లమ్‌డాగ్‌’ గర్ల్‌. ఇక అప్పట్నుంచి తన బేబీ బంప్‌ ఫొటోల్ని తరచూ సోషల్‌ మీడియాలో పంచుకుంటూనే ఉంది.

 

అయితే తాజాగా ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమెకు సీమంతం వేడుక నిర్వహించారు. ఇందులో భాగంగా తెలుపు రంగు దుస్తుల్లో ఏంజెల్‌లా ముస్తాబైందీ ముంబయి బ్యూటీ. తన పొట్టను నిమురుతూ ఒకింత ఆనందానికి లోనైంది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ‘ఈ వేడుక నా జీవితానికి సరిపడా మధుర జ్ఞాపకాల్ని నాకు అందించింది’ అంటోందీ కాబోయే అమ్మ. ఇక ఈ ఫొటోల్ని చూసిన ప్రతి ఒక్కరూ ‘అమ్మతనంలోని ఆనందమేంటో మీ ముఖంలోనే కనిపిస్తోంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


కల్కి కొచ్లిన్

‘మార్గరిటా విత్‌ ఏ స్ట్రా’ సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకోవడంతో పాటు ఆ సినిమాకు గాను జ్యూరీ విభాగంలో జాతీయ అవార్డు అందుకుంది బాలీవుడ్‌ క్యూట్‌ బ్యూటీ కల్కి కొచ్లిన్‌. తన జీవితంలో జరిగే ఏ విషయాన్నైనా సూటిగా, నిర్భయంగా చెప్పే ఈ బోల్డ్‌ బ్యూటీ.. తన ప్రేమ విషయాన్ని, ఆపై తాను పెళ్లికి ముందే తల్లిని కాబోతున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇజ్రాయెల్‌కు చెందిన పియానిస్ట్‌ గై హెర్ష్‌బెర్గ్‌తో కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ భామ.. తాను తల్లిని కాబోతున్నానంటూ ఓ ఇంటర్వ్యూలో భాగంగా పంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆపై ఎప్పటికప్పుడు తన అనుభవాలను, గర్భిణిగా తాను పాల్గొన్న ఫొటోషూట్స్‌ ఫొటోలను, ఈ సమయంలో తన డైట్‌, ఫిట్‌నెస్‌ టిప్స్, Water Birth పద్ధతిలో బిడ్డకు జన్మనివ్వడం.. ఇలా అమ్మయ్యే క్రమంలో తాను పొందిన ప్రతి అనుభూతినీ తన ఫ్యాన్స్‌తో పంచుకుంటూ మురిసిపోయింది. గతేడాది ఫిబ్రవరిలో ‘సాఫో’ అనే ఆడపిల్లకు జన్మనిచ్చిన ఈ మిల్కీ బేబ్‌.. అమ్మగా తన చిన్నారికి సంబంధించిన ప్రతి విషయాన్నీ, ఆమెతో గడిపే ప్రతి క్షణాన్నీ తన ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అంతేకాదు.. గర్భిణిగా, అమ్మగా తనకు ఎదురైన అనుభవాలన్నీ రంగరించి ‘The Elephant in the Womb’ అనే పుస్తకం కూడా రాసిందీ క్యూట్‌ మామ్. 2011లో బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌తో పెళ్లి పీటలెక్కిన కల్కి.. 2015లో ఆయనతో విడిపోయింది.


గ్యాబ్రియెల్లా డెమెట్రియాడెస్

బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో అర్జున్‌ రాంపాల్‌.. దక్షిణాఫ్రికాకు చెందిన మోడల్‌, నటి అయిన గ్యాబ్రియెల్లా డెమెట్రియాడెస్‌తో గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోన్న సంగతి తెలిసిందే. వీరి అనుబంధానికి గుర్తుగా 2019, జులైలో పండంటి కొడుకు పుట్టాడు. అయితే గ్యాబ్రియెల్లా కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఇదే విషయాన్ని అర్జున్‌ అప్పట్లో సోషల్‌ మీడియా ద్వారా అందరితో పంచుకుంటూ మురిసిపోయాడు. ‘నీతో కలిసి వేస్తోన్న ప్రతి అడుగూ ఓ అందమైన అనుభూతి!’ అంటూ సందర్భం వచ్చినప్పుడల్లా తన ప్రేయసిపై ఉన్న ప్రేమను ఒలకబోస్తాడీ బాలీవుడ్‌ హీరో. ప్రస్తుతం తమ కొడుకుతో గడుపుతూ ఆ మధురానుభూతులను ఫొటోలు, వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారీ లవ్లీ కపుల్.

అయితే అర్జున్‌ 1998లోనే మోడల్‌ మెహర్‌ జెస్సియాని వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు మహిక, మైరా.. అనే ఇద్దరు కూతుళ్లున్నారు. వివిధ కారణాల రీత్యా కొన్నేళ్ల క్రితమే విడాకులు తీసుకుందీ జంట. అయినా ప్రతి సందర్భాన్నీ తన ఇద్దరు కూతుళ్లతో సెలబ్రేట్‌ చేసుకుంటాడీ కండల వీరుడు.


అమీ జాక్సన్

తన అందం, అభినయంతో భారతీయ సినీ ప్రేక్షకుల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించింది బ్రిటిష్‌ బ్యూటీ అమీ జాక్సన్‌. ఈ ముద్దుగుమ్మ కూడా పెళ్లికి ముందే గర్భం ధరించి తన ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. బ్రిటన్‌ వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటోతో సహజీవనం చేసిన ఈ చిన్నది.. వాళ్ల ప్రేమకు గుర్తుగా 2019, సెప్టెంబర్‌లో ఆండ్రియాస్ అనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. గర్భవతిగా ఉన్న తొమ్మిది నెలలు కాబోయే అమ్మగా ఎన్నో మధురానుభూతులు మూటగట్టుకున్న అమీ.. తల్లయ్యాక తన కొడుకుతో గడిపిన ప్రతి సందర్భాన్నీ ఫొటోలు, వీడియోల రూపంలో తన ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అయితే అమీ గర్భవతిగా ఉన్నప్పుడే జార్జ్‌తో నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ.. వివిధ కారణాల రీత్యా వీళ్ల అనుబంధం ముందుకు సాగలేదు. ఈ ఏడాది జులైలో అమీ-జార్జ్‌ విడిపోయారు. అప్పట్నుంచి సింగిల్‌ మదర్‌గా తన చిన్నారి ఆలనా పాలనను చూసుకుంటోందీ ‘ఐ’ బ్యూటీ.


కొంకణా సేన్‌ శర్మ

విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది బాలీవుడ్‌ అందాల తార కొంకణా సేన్‌ శర్మ. 2007లో నటుడు రణ్‌వీర్‌ షోరేతో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అతనిని రహస్యంగా పెళ్లి చేసుకోవడం, ఆరు నెలలకే వీరికి కొడుకు పుట్టడంతో.. కొంకణ పెళ్లికి ముందే గర్భం ధరించినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయినా ఈ విషయం గురించి బయటపెట్టడానికి ఇష్టపడలేదీ జంట. అయితే 2015లోనే విడిపోయిన ఈ కపుల్‌.. 2020 ఫిబ్రవరిలో అధికారికంగా విడాకుల కోసం అప్లై చేసుకున్నారు.

వీరు కూడా!

* డ్యాషింగ్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా, సెర్బియన్‌ నటి నటాషా స్టాంకోవిచ్‌ కూడా పెళ్లికి ముందే తల్లిదండ్రులయ్యారు. గతేడాది జులైలో అగస్త్య అనే కొడుక్కి జన్మనిచ్చిన ఈ జంట.. అప్పట్నుంచి తన బుజ్జాయితో గడిపిన క్షణాలన్నీ మధుర జ్ఞాపకాలుగా మలచుకుంటున్నారు.

* బాలీవుడ్‌ నటీనటులు నేహా ధూపియా-అంగద్‌ బేడీలు కొన్నాళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. ఆపై 2018, మే 10న రహస్యంగా వివాహం చేసుకోవడం, అదే ఏడాది నవంబర్‌ 18న ఈ జంటకు పాపాయి పుట్టడంతో.. పెళ్లికి ముందే నేహ గర్భం దాల్చిందన్న వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ఇక ఇటీవల రెండోసారి తల్లైన నేహ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

* బాలీవుడ్‌ నటి అమృతా అరోరా కూడా షకీల్‌ లడక్‌తో తన పెళ్లి విషయాన్ని సడన్‌గా బయటపెట్టి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. ఆపై కొన్నాళ్లకు తాము త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించే సరికి.. అమృత గర్భం ధరించడం వల్లే వీరిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ అందరూ అనుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకు అజాన్‌, రయాన్‌ అనే ఇద్దరు కొడుకులున్నారు.

* బోనీని పెళ్లి చేసుకునే నాటికి శ్రీదేవి ఏడు నెలల గర్భిణి. పెళ్లికి ముందే తమ ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టిన అతి కొద్దిమంది నాయికల్లో శ్రీ ఒకరు. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌లు వీరి ప్రేమకు ప్రతిరూపాలు.

* వెస్టిండీస్‌ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌తో కొన్నేళ్ల పాటు డేటింగ్‌ చేసిన అలనాటి అందాల తార నీనా గుప్తా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. అయితే తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించిన వివియన్‌కు దూరమైన నీనా.. తన కూతురు మసాబా గుప్తాను సింగిల్‌ మదర్‌గానే పెంచాలనుకుంది. ఇప్పుడు మసాబా దేశంలోనే పేరు మోసిన ఫ్యాషన్‌ డిజైనర్‌ అన్న విషయం తెలిసిందే.

* కమల్‌ హాసన్‌-సారికల ప్రేమాయణానికి గుర్తుగా శృతీ హాసన్‌ పుట్టింది. ఆ తర్వాత రెండేళ్లకు (1988లో) పెళ్లి పీటలెక్కిందీ జంట. పెళ్లి తర్వాత వీరికి అక్షరా హాసన్‌ జన్మించింది. 2004లో కమల్‌-సారికలు విడాకులు తీసుకున్నారు.

ఇలా కొన్ని జంటలు పెళ్లికి ముందే మాతృత్వంలోకి అడుగుపెట్టడంపై మీ స్పందనేంటి? మారుతున్న కాలం, ఆలోచనా ధోరణులతో పాటు సంస్కృతీ సంప్రదాయాలు కూడా మారుతున్నాయా? భారతీయ సమాజంలో ఇలాంటి నయా పోకడలకు మద్దతు లభిస్తుందా? ఇలాంటి ఆలోచనా ధోరణి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని