‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’

‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు.

Updated : 28 Apr 2024 09:16 IST

వీడియో విడుదల చేసిన ఆరుద్ర

కాకినాడ గ్రామీణం (సర్పవరం జంక్షన్‌), న్యూస్‌టుడే: ‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. శనివారం సామాజిక మాధ్యమం వేదికగా వీడియో విడుదల చేసిన ఆమె జగన్‌, వైకాపా ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు.  ‘నా కుమార్తెకు కాళ్లు మాత్రమే చచ్చుబడ్డాయి. ఏపీలో ప్రభుత్వ వ్యవస్థే చచ్చుబడింది. నాకు జరిగిన అన్యాయం సీఎం జగనన్నకు తెలిస్తే న్యాయం చేస్తారని అంటే ప్రాణాలకు తెగించి ఆయన వద్దకు వెళ్లా. ఫలితం లేదు. నా సొంతిల్లును అమ్మించి ప్రభుత్వం కొత్తది ఇచ్చినట్లు ప్రచారం చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. నేను, నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామంటే చంద్రబాబునాయుడు, మీడియానే కారణం. చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌కల్యాణ్‌, భరత్‌ (విశాఖ)కు కృతజ్ఞతలు. గతంలో నా బిడ్డ వెన్నునొప్పితో ఇబ్బంది పడేది. పోలీసులు కొట్టిన దెబ్బలతో వెన్నుపూస స్పర్శ లేకుండా పోయింది. శరీరం చచ్చుబడింది. వెన్నుపూస ఆపరేషన్‌ జరిగిన బిడ్డను ఈడ్చుకెళతారా? ఒక దివ్యాంగురాలిపై ఏపీలో జరిగిన దాష్టీకమిది. నా బిడ్డకు న్యాయం చేయమన్నందుకు నాపై పిచ్చిదన్న ముద్ర వేశారు..’ అని ఆరుద్ర విలపించారు. తన కుమార్తెకు న్యూరాలజీ ఇబ్బందులుంటే మానసిక సమస్యగా ముద్రవేసి పిచ్చాసుపత్రిలో పడేశారని పేర్కొన్నారు. ‘ఒక ఉగ్రవాదిలా, నక్సలైట్‌లా సుమారు 300 మంది పోలీసులు నా బిడ్డను లాక్కెళ్లారు. మంత్రి దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణల వల్లే ఈ ఇబ్బందులు’ అని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని