Relationship Tips: కష్టమైనా వీటిని స్వీకరించాల్సిందే!

వివాహ బంధం శాశ్వతమైంది. ఈ విషయం తెలిసినా కొన్ని జంటలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ.. నూరేళ్ల అనుబంధాన్ని మధ్యలోనే తెంచేసుకుంటున్నారు. అయితే ఇందుకు వారు తమ అనుబంధంలో కొన్ని అంశాల్ని స్వీకరించలేకపోవడం, జీర్ణించుకోలేకపోవడమే కారణమంటున్నారు....

Published : 09 Dec 2022 21:27 IST

వివాహ బంధం శాశ్వతమైంది. ఈ విషయం తెలిసినా కొన్ని జంటలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ.. నూరేళ్ల అనుబంధాన్ని మధ్యలోనే తెంచేసుకుంటున్నారు. అయితే ఇందుకు వారు తమ అనుబంధంలో కొన్ని అంశాల్ని స్వీకరించలేకపోవడం, జీర్ణించుకోలేకపోవడమే కారణమంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. అదే కాస్త ఓపిక వహించి కొంత సర్దుబాటు ధోరణితో వ్యవహరిస్తే ఆలుమగలు తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకోవచ్చంటున్నారు. మరి, ఇంతకీ ఏంటా అంశాలు? తెలుసుకుందాం రండి..

క్షమించేస్తే పోలా!

‘తప్పులు చేయడం మానవ సహజం..’ అంటుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొన్ని పొరపాట్లు దొర్లుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని తెలిసి చేయచ్చు.. మరికొన్ని తెలియకుండా జరిగిపోవచ్చు. అయితే కొంతమంది వీటిని జీర్ణించుకోలేరు. ఉదాహరణకు.. మీ ప్రమేయం లేకుండా, మీ అనుమతి తీసుకోకుండా మీ భాగస్వామి మీ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారనుకోండి.. ఇలాంటప్పుడు అవతలి వ్యక్తిపై కోపం రావడం సహజం. అలాగని చీటికీ మాటికీ కోపగించుకుంటూ పోతే ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది. అదే ఈ విషయం గురించి భాగస్వామితో నెమ్మదిగా మాట్లాడి చూడండి. తనకు తెలియకుండా తన డబ్బును మీరు వాడితే తను ఎలా ఫీలవుతారో చూచాయగా అడిగి చూడండి.. అప్పుడు మీ బాధేంటో వారికి అర్థమవుతుంది. తద్వారా ఆ పొరపాటు మరోసారి చేయకపోవచ్చు. ఇదొక్కటనే కాదు.. ప్రతి విషయంలోనూ ఒకరికొకరు క్షమాగుణంతో వ్యవహరిస్తే.. చాలా సమస్యలు నాలుగ్గోడల మధ్యే పరిష్కారమవుతాయి. కాబట్టి ఆలుమగలు తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకోవాలనుకుంటే కాస్త కష్టమైనా సరే.. ఒకరినొకరు క్షమించుకోగలగాలంటున్నారు నిపుణులు.

మారిపోవాల్సిందేనా?

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు.. భాగస్వామి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా కావచ్చు.. ఇలా కారణమేదైనా కొన్ని విషయాల్లో ఎదుటివారి ఆలోచనల్ని బట్టి మనల్ని మనం మార్చుకోవాల్సి రావచ్చు. కానీ కొంతమంది ‘తనకోసం నేనెందుకు మారాలి? నా ఇష్టాయిష్టాల్ని ఎందుకు పక్కన పెట్టాలి?’ అన్న మొండి పట్టుదలతో వ్యవహరిస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఈ పంతం పనికిరాదంటున్నారు నిపుణులు. కొన్ని విషయాల్లో మనకు నచ్చకపోయినా భాగస్వామి కోసం సర్దుకుపోవడంలో తప్పు లేదంటున్నారు. ఇలా ఒకరి కోసం మరొకరు చేసే ఈ త్యాగమే ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచడంలో దోహదం చేస్తుందంటున్నారు.

పారదర్శకత ముఖ్యం!

భార్యాభర్తలన్నాక గొడవలు పడడం, కాసేపటికే తిరిగి కలిసిపోవడం సహజం. అయితే కొంతమంది వీటిని భూతద్దంలో పెట్టి మరీ భాగస్వామిలోని లోపాల్ని, వారు చేసిన తప్పుల్ని వెతుకుతుంటారు. నిజానికి ఇలా మీ మనసంతా ప్రతికూల ఆలోచనలతో నిండిపోతే.. ప్రతిదీ నెగెటివ్‌గానే కనిపిస్తుంది. అంతేకాదు.. ప్రతిదానికీ అవతలి వారి మీద అనుమానం పెరిగిపోతుంది. ఈ పెనుభూతం వల్లే చాలా జంటలు విడిపోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఒకరిపై ఒకరికి అనుమానం లేకుండా ఉండాలంటే.. ప్రతి విషయంలోనూ భార్యాభర్తలు పారదర్శకంగా వ్యవహరించడం ముఖ్యమంటున్నారు. ఇది కాస్త కష్టమే అయినా.. ఇద్దరూ దాపరికాల్లేకుండా ముందుకు సాగుతున్న కొద్దీ ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. ఇదే ఇద్దరినీ శాశ్వతంగా కలిపి ఉంచుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్