అమ్మాయిలతో ఎలా మాట్లాడుతున్నారు?

ఏ పేరెంట్స్ అయినా తమ కూతురు సంతోషంగానే ఉండాలని కోరుకుంటారు. తన భవిష్యత్ బాగుండాలని కెరీర్, రిలేషన్‌షిప్, పెళ్లి, పిల్లలకు సంబంధించి ఎన్నో జాగ్రత్తలు చెబుతుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం చాలామంది పేరెంట్స్ ఈ విషయంలో ఎంతో అడ్వాన్డ్స్‌గా ఆలోచిస్తున్నారు. అన్ని విషయాల్లోనూ అమ్మాయిలకు....

Published : 11 Dec 2022 10:58 IST

ఏ పేరెంట్స్ అయినా తమ కూతురు సంతోషంగానే ఉండాలని కోరుకుంటారు. తన భవిష్యత్ బాగుండాలని కెరీర్, రిలేషన్‌షిప్, పెళ్లి, పిల్లలకు సంబంధించి ఎన్నో జాగ్రత్తలు చెబుతుంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం చాలామంది పేరెంట్స్ ఈ విషయంలో ఎంతో అడ్వాన్డ్స్‌గా ఆలోచిస్తున్నారు. అన్ని విషయాల్లోనూ అమ్మాయిలకు అండగా నిలుస్తూ, అడుగడుగునా వారిని ప్రోత్సహిస్తున్నారు.

అయితే- ఇప్పటికీ కొంతమంది పేరెంట్స్ మాత్రం వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే రీతిలో ప్రవర్తిస్తుంటారు. ప్రతి విషయంలోనూ అబ్బాయిలతో పోలుస్తూ అమ్మాయిలను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. తల్లిదండ్రుల చదువు, కుటుంబ నేపథ్యం, తాము పెరిగిన వాతావరణం.. మొదలైన అంశాలు ఇందుకు కారణం కావచ్చంటున్నారు నిపుణులు.

ఈ నేపథ్యంలో- చదువు, కుటుంబ నేపథ్యాలతో సంబంధం లేకుండా ఎవరైనా సరే- పేరెంట్స్‌గా చెప్పే మాటలు అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా, ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేలా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేతప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉండకూడదంటున్నారు.

ఇలా చెప్పకూడదు!

⚛ నువ్వు ఒక అమ్మాయివని గుర్తు పెట్టుకో...నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది.

⚛ నీకు ఏది మంచిదో, చెడ్డదో మాకు తెలియదా? ఇంకోసారి ఇలాంటి ఎదురు ప్రశ్నలు వేయద్దు.

⚛ అమ్మాయిలు గట్టిగా మాట్లాడకూడదు.. పెద్దగా నవ్వకూడదు..

⚛ రోజురోజుకీ లావైపోతున్నావు..ఇలా అయితే పెళ్లి కావడం కష్టం.. బరువు తగ్గడానికి ప్రయత్నించచ్చు కదా!

⚛ నువ్వు వంట చేయడం నేర్చుకోవాలి. లేకపోతే పెళ్లయ్యాక కష్టం..!

⚛ ఇది అమ్మాయిలు చేయాల్సిన ఉద్యోగం/పని కాదు.

⚛ మగరాయుడిలా ప్రవర్తించద్దు.

⚛ అబ్బాయిల మాదిరిగా అమ్మాయిలకు ఎక్కువమంది ఫ్రెండ్స్ ఉండకూడదు..

⚛ అమ్మాయిలు ఒంటరిగా ఉండకూడదు.. ఒంటరిగా ఎక్కడికీ వెళ్లకూడదు.

⚛ నువ్వు ఈ పని చేయలేవు... నీకు చేతకాదు.. అన్నయ్యో, తమ్ముడో చేస్తాడులే..!

⚛ ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే. అత్తారింటికి వెళ్లిపోవాల్సిందే.. నీ కోసం బాగా డబ్బున్న, జీవితంలో స్థిరపడిన అబ్బాయి కోసం వెతుకుతున్నాం.. మేం చెప్పినట్లు పెళ్లి చేసేసుకో.. చదువు, కెరీర్ గురించి ఆలోచించకు..

⚛ మహిళలకు ఎప్పుడైనా భర్త తోడు ఉండాల్సిందే.. సొంతంగా బతకడం కష్టం..

⚛ పెళ్లి చేసుకోవాలి. పిల్లల్ని కనాలి. పిల్లలు లేని మహిళల జీవితం అసంపూర్ణమే.

చూశారుగా.. అమ్మాయిలకు చెప్పకూడని కొన్ని విషయాల గురించి. అందుకే చిన్నప్పటి నుంచే ప్రతి దశలోనూ వారితో మాట్లాడే ప్రతి మాటా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వారిలో అంతులేని ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందేలా ఉండాలి. ఆడ, మగా తేడా లేకుండా వారికి నచ్చిన రంగంలో దూసుకుపోయేలా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే స్వతంత్రంగా బతికేలా ప్రోత్సహించాలి అంటున్నారు నిపుణులు. మరి గుర్తుంచుకుంటారు కదూ..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్