Published : 02/09/2021 20:07 IST

అమ్మాయిలకు ఇలాంటి సలహాలు ఇవ్వకూడదట!

అమ్మానాన్నలనే చూస్తూ.. వారి బాటలోనే పయనమంటూ చాలా విషయాల్లో తల్లిదండ్రులనే ఆదర్శంగా తీసుకుంటారు అమ్మాయిలు. ఇక పిల్లల ఆనందమే పరమావధిగా భావించే పేరెంట్స్‌ కూడా తమ కూతుళ్ల భవిష్యత్ గురించే నిత్యం ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలోనే వివిధ రకాల సూచనలు, సలహాలు అందజేస్తుంటారు. అయితే ఇవి అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ఉండాలి కానీ... వారిని బలహీనపర్చేలా ఉండకూడదంటున్నారు నిపుణులు.

పదే పదే అలా చెప్పద్దు!

ఏ పేరెంట్స్‌ అయినా తమ కూతురు సంతోషంగానే ఉండాలని కోరుకుంటారు. తన భవిష్యత్‌ బాగుండాలని కెరీర్‌, రిలేషన్‌షిప్‌, పెళ్లి, పిల్లలకు సంబంధించి ఎన్నో జాగ్రత్తలు చెబుతుంటారు. అయితే పదే పదే ఇలా చెప్పడం వల్ల వారిలో ఒక రకమైన ప్రతికూల భావనలు రేకెత్తుతాయంటున్నారు నిపుణులు. అంతేకాదు వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేరంటున్నారు. మరి తల్లిదండ్రులు తమ కూతుళ్లకు ఇవ్వకూడని కొన్ని సలహాలు, సూచనలు ఏంటో చూద్దామా?

మీ కూతుళ్లతో ఇలా మాట్లాడకండి!

* నువ్వు ఒక అమ్మాయివని గుర్తు పెట్టుకో...నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది.

* నీకు ఇప్పుడు ఉద్యోగమొచ్చింది...ఇక పెళ్లి గురించి ఆలోచించచ్చు కదా..!

* నువ్వు వంట చేయడం నేర్చుకోవాలి. లేకపోతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు.

* నీకు ఏది మంచిదో, చెడ్డదో మాకు తెలియదా? ఇంకోసారి ఇలాంటి ఎదురు ప్రశ్నలు వేయద్దు.

* బయటికెళ్తే త్వరగా ఇంటికి రా. ఆలస్యం చేయద్దు.

* ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వారి ముందు పొట్టి దుస్తులు ధరించి తిరగద్దు.

* నీ కోసం బాగా డబ్బున్న, జీవితంలో స్థిరపడిన అబ్బాయి కోసం వెతుకుతున్నాం.

* అమ్మాయిలు గొంతు పెంచకూడదు. మెల్లగా మాట్లాడాలి.

* సినిమాలు, టీవీల్లో కనిపించే అమ్మాయిల్లా నువ్వూ ఉంటానంటే కుదరదు.

* రోజురోజుకీ లావైపోతున్నావు. బరువు తగ్గడానికి ప్రయత్నించచ్చు కదా!

* ఇది అమ్మాయిలు చేయాల్సిన ఉద్యోగం/పని కాదు.

* నువ్వు అసలు అమ్మాయిలా కనిపించడం లేదు. నీలో ఒక్కటి కూడా ఆడ లక్షణం లేదు.

* ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులతో బిగ్గరగా, ఎక్కువ సేపు మాట్లాడద్దు.

* ఎందుకలా ఎప్పుడూ పెద్ద గొంతేసుకుని నవ్వుతుంటావు?

* నీకెందుకు ఇంతమంది స్నేహితులు/బాయ్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారు?

* అమ్మాయిలు ఒంటరిగా ఉండకూడదు తెలుసా?

* ఒంటరిగా ఎక్కడికీ వెళ్లద్దు. కావాలంటే ఎవరినైనా తోడు తీసుకెళ్లు..!

* నీది డిప్రెషన్‌ కాదు... ఎందుకో బాధపడుతున్నావంతే.

* మా వద్ద అలాంటి నాటకాలు వేయద్దు.

* నువ్వు ఈ పని చేయలేవు... నీకు అసలు చేతకాదు.

* నీ ఫ్రెండ్‌లా నువ్వు కూడా కుదురుగా, మంచిగా ఉండచ్చు కదా!

* నువ్వు అసలు చదువుకున్న అమ్మాయిలాగా ప్రవర్తిస్తున్నావా?

* వయసొచ్చాక నువ్వూ పెళ్లి చేసుకోవాల్సిందే. అత్తారింటికి వెళ్లిపోవాల్సిందే.

* మహిళలకు ఎప్పుడైనా భర్త తోడు ఉండాల్సిందే.

* నువ్వు పెళ్లి చేసుకోవాలి. పిల్లల్ని కనాలి. పిల్లలు లేని మహిళల జీవితం అసంపూర్ణమే.

మరి మీరూ మీ కూతుళ్లతో ఇలా మాట్లాడుతున్నారా? అయితే అది కరక్టో కాదో ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోమంటున్నారు నిపుణులు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని