‘ఇంటి నుంచి వెళ్లిపో’ అంటున్నాడు..!

నాకు 28 ఏళ్లు. పెళ్లై రెండు సంవత్సరాలవుతోంది. ఈ మధ్య నా భర్తకు, నాకు తరచుగా గొడవలవుతున్నాయి. అయితే గొడవ జరిగిన ప్రతిసారీ నా భర్త ‘ఇంటి నుంచి వెళ్లిపో’ అంటున్నాడు. నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లినా వారు మళ్లీ నా భర్త దగ్గరకే పంపుతారు. నాకు వెళ్లడానికి మరో దారి లేదు. దీనివల్ల మానసిక వేదనకు లోనవుతున్నా.

Published : 19 Apr 2024 13:23 IST

నాకు 28 ఏళ్లు. పెళ్లై రెండు సంవత్సరాలవుతోంది. ఈ మధ్య నా భర్తకు, నాకు తరచుగా గొడవలవుతున్నాయి. అయితే గొడవ జరిగిన ప్రతిసారీ నా భర్త ‘ఇంటి నుంచి వెళ్లిపో’ అంటున్నాడు. నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లినా వారు మళ్లీ నా భర్త దగ్గరకే పంపుతారు. నాకు వెళ్లడానికి మరో దారి లేదు. దీనివల్ల మానసిక వేదనకు లోనవుతున్నా. ఈ విషయంలో ఏం చేయాలో దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీకు ఇలాంటి పరిస్థితి రావడం విచారకరం. మీరు నిస్సహాయ స్థితిలో ఉన్నట్టుగా అర్థమవుతోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళన చెందడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీకు మీ భర్త తప్ప మరో దారి లేదని అంటున్నారు. కాబట్టి, ఇలాంటి పరిస్థితుల్లో మీ సమస్యను పరిష్కరించాల్సింది కూడా అతనే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. మీ మధ్య గొడవ జరిగినప్పుడల్లా- మీ భర్త మిమ్మల్ని ఇంటి నుంచి వెళ్లిపోమనడానికి అసలు కారణమేంటో కూడా తెలుసుకోండి.. ఈ క్రమంలో మీరిద్దరూ సంతోషంగా గడిపే సమయంలో మీ మనసులోని బాధను అతనికి వివరించే ప్రయత్నం చేయండి. అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. ఇందుకోసం తరచుగా డిన్నర్‌కు వెళ్లడం లేదా విహారయాత్రకు వెళ్లడం.. వంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించండి. దీనివల్ల ఇద్దరి మధ్య అనుబంధం పెరిగి మనస్పర్థలు తగ్గే అవకాశం ఉంటుంది.

అలాగే ఒత్తిడి, ఆందోళన దరి చేరకుండా ఉండాలంటే ‘స్వీయ ప్రేమ’ ఎంతో అవసరం. కాబట్టి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ దాంపత్య బంధంలో మీరు ఎదుర్కొంటున్న సవాళ్లను ఒక కాగితం పైన రాసిపెట్టుకోండి. వాటిని ఒకదాని తర్వాత మరొకటి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అప్పటికీ మీ సమస్య పరిష్కారం కాకపోతే మీరిద్దరూ కలిసి మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.

అలాగే- జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ఎవరూ ఊహించలేరు. అందుకే ఆర్థిక స్వేచ్ఛ సాధించడానికి ప్రయత్నించండి. మీ విద్యార్హతలు, మీలో ఉన్న ప్రత్యేకమైన నైపుణ్యాలకు తగిన ఉద్యోగం వెతుక్కోవడానికి ప్రయత్నించండి. ఇది మీరు ఎవరిపైనా ఆధారపడకుండా చేస్తుంది.. జీవితానికి ఒక రకమైన భరోసాను అందిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్